Sunday, April 12, 2020

వీరానుగమనం 2

దీర్ఘ కవిత....(part...2)
వీరానుగమనం....2
మల్లీ చెబుతున్నా
ముప్పయ్యేళ్ల క్రితం
 సరిగ్గా ముప్పయ్యేళ్ళ క్రితం....

అందమైన లోకం
అందమైన ఊహలు
అనుకున్నది సాధించగలమనే ఒక నమ్మకం ,నమ్మిక
అన్నీ అనుకూల మైన పరిస్థితులు
అప్పటివరకేం  జరిగిందో ఒక్కసారి...


అరవైయ్యైదులో తొలిసారి అడుగేసానట
 ఎప్పటినుండి గుర్తుందో తెలియదు
 గోడ నీడే మొదటి గుర్తనిపిస్తుంది
అప్పటికెంతున్నానోమరి

 ఉట్టి మీద ఉన్నదేదైనా అందకపోతే అదే కష్టం అనుకున్నాను
ఉట్టి అందేంత ఎప్పుడెదుగుతాం అనే బాధ తప్ప
కష్టాలు ఏమీ తెలియకుండా గడిచింది బాల్యం

 చల్ల గిలకొట్టే బామ్మ  దగ్గర
మీగడ ముద్ధ మింగడానికి  కదలకుండా కూర్చోవడం
కోడిపుంజును కోసినపుడు పచ్చిగా  గుటుక్కున మింగే ముక్కొకటి
నాకే ఇచ్చే బామ్మంటే అభిమానం
అది అందమైన బాల్యం


 తొలిసారి గుర్తున్న జ్ఞాపకం
 వెనకాల దీపం పట్టుకున్న బాపు
 గోడపై ఆడే నీడను చూస్తూ ఎగురుతూ నేను
అప్పుడు తెలియదు ఆ నీడనాడిస్తుంది ఎవరనేది
మనల్నెవరో ఆడించరు
మనల్ని మనమే ఆడించుకుంటాం కనిపెట్టగలగాలంతే

 ఏటొడ్డు శివాలయం చూస్తున్నప్పుడల్లా
 కాపాడే వాడెవడో ఉన్నాడనే ధైర్యం నడిపించేది
 ఎదుగుతున్న కొద్దీ తెలిసింది
ముందుకు నడపడానికి  చెప్పే ఫేబుల్సని
అలాంటి ఏర్పాటంటుంటే బాగుండనిపించినా
 లేదని తెలిసి  బాధేసేది.

 ఏటేటా మూసీ పారినప్పుడల్లా
మురిపంగా చూస్తూ అలా
 అప్పుడప్పుడు ఇసుక కొట్టుకుపోగా తేలే లింగాకారాలు
అలౌకిక తత్వాన్ని అంకురింపజేసినా
నిజం కాదు కదా అనే ఒక బాధ

 కొత్తనీరు ముందుకొచ్చి వెనక్కి పోయే వేల
 ఎగిరిపడే చేపపిల్లలు అందుకునే మేము
 ఆనందం మా కళ్ళల్లో
ప్రాణం కోల్పోయిన చేపలు మా చేతుల్లో ఇప్పుడనిపిస్తుంది వాటిదీ ప్రాణమే కదా


 అంబాడుతూ వచ్చి నిప్పు కణిక పై కూర్చున్నప్పుడు
వెనక కాలిన మరక
 నేటికీ నా మనసంతా నవ్వులతో నింపుతుంది బాధనిపించని బంధమది
 పాదంపై పడిన పెద్ద మర్ర
కమలక్క చేజారిన పప్పు గిన్నె ని గుర్తు చేస్తుంటే
ఆ జ్ఞాపకాలెంతో తీయగానే ఉంటాయి బాధనిపించని బంధం కదా

 స్టీఫెన్ హాకిన్స్ రాసిన
 రివర్స్ టైం గుర్తొస్తే ..అయ్యబాబోయ్ తీయ తీయని గతాలు సరే కానీ
జ్ఞాపకాలతో గోలే మరి


 విద్యుత్ వెలుగులు లేనినాడు
 వీధుల్లో ఆడిన ఆటలు
పగళ్ళ ను తలపించే రాత్రుల్లోనేడాడలేం
దేనానందం దానిదే
ఆముదం దీపం తక్కువేంకాదు కదా

 సన్నాయి కుప్పలు
సన్నాయినొక్కులు
 అలుపెరుగని ఆటలు
చెప్పుల్లేని కాళ్లను
కళ్ళు మూసి నడిపించిన దోస్తుల పై నమ్మకం
 మళ్ళీ పొందలేమన్నది నిజం

 బంక కోసం చెట్ల పైన గొడ్డలితో కాటు
 పెట్టినప్పుడు
చెట్టు బాధ తెలియ చెప్పిన
బామ్మ  మాటలు గుర్తొస్తుంటే
 నేర్చుకోని క్షణం లేదనిపిస్తుంది
నేటి లా కాదు మరి

 తుమ్మ కొమ్మలు రాల్చిన ఆకులు రగిలించిన శత్రుత్వం
శాశ్వత శతృత్వాని కి దారి తీస్తే
 అసూయాద్వేషాలు అంటుకుంటే
అగ్ని కనిపించకుండా కాల్చ గలదని తెలిసింది


 సద్దిగట్టిన ఆర్పన్నం
 మూడు రోజులైనా రుచి తగ్గక పోయేది
 నాటి బంధాలోలె
సాయంత్రానికి పాడయ్యే పదార్థాలు నేడు
నేటి బంధాలకు  నిదర్శనం మరి



 ఎర్ర బస్సు ఎండపూట  వచ్చినప్పుడు
 ఒగిరించుకుంటు వచ్చి చూసినప్పుడు
 ఎంత ఆనందమో మాకు
స్ప్లెండిడ్ హ్యాపీనెస్ అని సారు అన్నప్పుడు
 అర్థం కాలే  అంత గొప్పది అని

 గ్యాౙంగి నారకోసం మట్టలు నానేసే ముందు
 పీకేసిన ముల్లంచులు
స్వచ్ఛమైన నార కోసం చేసిన త్యాగం ప్రతిఫలమాశించని
కర్మాచరనని  తెలుసుకోలేకపోయాను

 గడ్డివాములో దాచిన ఈతపండ్లు మాగినప్పుడు
ఎనుగులో వేసిన శిత్పాలకాయలు
మాగి మనసును లాగినప్పుడు
 బండ పై రాసిన బలుసు పండ్లు
పరిమళం పంచినప్పుడు
 బొడ్డు మల్లె పూల చెట్టు కింద సాయంకాలం నిలబడినట్లు
 ఏటి ఒడ్డున నిలబడి అవతలి తీరం చూసినప్పుడు కలిగే ఆనందాన్ని
పసుపు బొమ్మలో పోస్తే కదా బాల్యం అయినా
 ఆనాటి బాల గణపతైనా


 దూదిరి కోళలు తయారు చేసి
 సాయంత్రం గిరగిరా తిప్పి
 రాలే మినుగురుల నడుమ నాడు
 సుదర్శన చక్రం ధరించిన కృష్ణుడి వలె నేను

 బడి వదలగానే సంకకు  సంచేసుకుని
 చెల్క కాడికి వెల్లేవాన్ని
 ఇప్పుడనిపిస్తుంది ఆనాటి బాహుబలిని నేనేనని
బామ్మ తెంపిన పండ్లు ,కాయలు
 సంచీ నింపుకుని సంకకేసుకుని మోసేవాన్ని  మరీ

 కాల్చిన కందికాయ
వేయించిన పాలజొన్న
పప్పు దోస
పచ్చి ధనియా
ఏదీ వదల్లేదు
 నేటి నా ఆరోగ్య రహస్యం
నాటి ఆహారమేనేమో

 చెప్పుల్లేకుండా కంచెల్లో తిరిగేవాళ్ళం
 గ్లౌజులు లేకుండా గడ్డి కోసే వాళ్ళం
 పసుల గాసే టప్పుడు పల్లేరు తొక్కినం
 బోయిన్  కాలువ నీళ్లు తాగినం
 బోనాల పండుగకు వరాల పై ఉర్కినం
 ఏంటో నాటి దైర్యం
అతి జాగ్రత్తలు తెలుపకపోవటం
 ప్రకృతితో స్నేహించడం


 ఒకటి మాత్రం నిజం
 సెల వంటే నాడు మా కైనా
నేడు మీకైనా అదే ఆనందం
మారనిదిదొక్కటే నేమో

 రాయిన్కాలువలో వంతుకెళ్లి పూడిక తీసిన
 ఎప్పుడు ఎండని శంభుని కాలువ
నాడు జీవనది అనుకున్నా
 తల పర్రె దగ్గర ఈదులాడినం
 నీటికి మనిషికి అనుబంధం
ఇప్పటిది కాదులే

 ఇంటెన్క మడికట్లల్ల
పాటిమన్ను తీసుకెళ్తుంటే
 బంగారం దొరికిన వాల్లెందరో
 పాతూరి ఆనవాల్లు
 కథలు కథలుగా చెబుతుంటే
 చరిత్రకు అర్థం తెలిసింది
చావుబతుకుల సీరియల్లు రాసి దాచిపెట్టిన చోటది.ఎర్రోళ్ళ మడికట్లు


 రెండు తలల పాము
గుమ్ముల్లో పెంచుకున్న నమ్మకాలు
 ఆశ్చర్యంతో ప్రశ్నల్ని  కళ్ళలో మొలిపించిన క్షణాలు
నాటి పల్లెలు ఎన్సైక్లోపీడియా లే
 చదవగలగాలి అంతే

 పదిలో సైకిల్
ఇంటర్లో మోటార్ సైకిల్
 ఉద్యోగం వచ్చాక ఫోర్ వీలర్
 డ్రైవింగ్ నేర్చుకున్నాను
 వాటి ఊసే తెలియని వారి ముందు నాడు మేం హీరోలమే


 నేనూ  ఫెయిలయ్యా
 ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లీష్ లో
 పల్లె విడిచి పట్నం వచ్చినాక తప్పు తెలుసుకునే లోగా జరిగిపోయిందది

 నీటి కరువెంతున్నా
 ఏటి కాల్వలు సాదినవానాడు
 బోర్లు లేని రోజుల్లో  బావులెంత బాగుండేవని
మోటమోకులు, ఊటబావులు,చేదబొక్కెన
 వినసొంపైన పదాలు
 అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ

 సెలవులు వస్తే చాలు
 గానుగుబండ
వెంపటి
ఓగోడు
కొత్తపల్లి
పసునూరు
 పది రోజులు గడిచేసరికి
సొంతూరు అయిపోయేవి
 వెనక్కి రావాలంటే దిగులేసేది


 పరిగేరడం కూడా పనిగానే చూసేది
 అర్వపల్లి జాతర కోసం దాచుకోనీకి
కీసుపిట్ట
పిల్లనగొయ్య
రబ్బరు చెండు
 బొంగుల ముద్ద
తిప్పితె తిరిగే గడియారం
ఏడాదంతా కలగంటూ పరిగేరేవాళ్ళం
తాలు ఆందాలు యేరేవాళ్ళం


 అన్ని నిజాలే చెబుతున్న అబద్ధాల అవసరమే రావట్లేదు
పది దాకా పల్లెటూరే
పరీక్షలు పట్నంలో
తారు రోడ్డు అందంగా కనిపించేది
 నాగారం దగ్గరో అరవపల్లి దగ్గరో
 అడ్డంగా దాటిపోయేది తప్ప దాని పైన నడిచిందెప్పుడని
 అటువైపు ఇటువైపు నల్ల తాచులా ఎంతదూరం కనిపించేదో
ఆ వైపు ఈ వైపు ఉన్న చెట్లను అశోకుడే నాటించాడనుకునేది

 ఏ గుడికి వెళ్ళినా సరే
చిత్తలూరు
 అర్వపల్లి
భైరవుని బండ
దేవుడు అక్కడనే ఉన్నాడనే బలమైన నమ్మకం ఉండేదప్పుడు

 ఏటి అవతలికెల్లివస్తే
ఎంత సంతోషమో
జాజిరెడ్డిగూడెం లో ప్రొవిజన్స్ తీసుకొస్తే ఎంత గొప్ప తనము
 ఎదుగుతున్న మన్న తృప్తితో
స్వాభిమానం కురుస్తున్న క్షణాలు
చేతి వెనుక బెల్లం ముక్క అంటించుకుని చప్పరించే పసితనమే ఐనా


 అమ్మ ఎవరికైనా అమ్మ
రంగూన్ రౌడీ
తొలిసారి థియేటర్ లో చూసిన సినిమాలు కృష్ణంరాజు, రజనీకాంత్
ఎవరికి అభిమానిగా ఉండాలనేది ఆలోచన
 ఎవరో ఒక్కరికే అభిమానిగా ఉండాలి మరి

 సొంతంగా నాది అని చెప్పుకునే సైకిల్ ఇంటర్లో
అశ్వారోహనం చేసిన రాజువలె నల్లగొండ రోడ్లపై స్వారీ
ఆ వయసులో ప్రతిదీ కొత్తగా గొప్పగా

 తొలి నవల చలం రచన
 దైవమిచ్చిన భార్య చదివినప్పుడు అక్షరాలు ఏం చేయగలవో అర్థమైంది సాహిత్యానికి పునాది పడింది

 కొత్త తరం ఆనవాళ్లు
 పరిచయం చేసిన నంద్యాల సత్యనారాయణ చెప్పిన కథలు ఇప్పటికీ గుర్తున్నాయి

 పల్లెర్ల వాసు
 సర్వయ్య
మల్లేశ
 సోమ రాములు
 మజారొద్దీన్
 పెండెం శంకరయ్య
వెంకటేశ్వర్రెడ్డి
 వెంకటేశ్వర్లు
 వసుమతి
విజయ్
కృష్ణమూర్తి
 తొలినాటి మిత్రులు
 ఏకబిగిన చెప్ప గల పేర్లు
ఎప్పటికీ మరువలేని స్నేహాలు
 ఇప్పటికి కలిసి ఎన్నాళ్లయిందో గాని

 బాపు ఇచ్చే యాబై గాక
 రీడింగ్ టేబుల్ కొనుక్కోమని
 దాచిచ్చిన వంద
పాకెట్ కొట్టేయబడ్డప్పుడు
 ఎంత భయపడ్డానో
విషయం తెలిసిన అమ్మ
ధైర్యం చెప్పడం నాకు ఇప్పటికీ గుర్తే

 శివరాత్రి జాతర లో గరుడ ముద్ద చేతికందినప్పుడు
 దేవుడు ప్రత్యక్షమై నంత సంబరం

 కూలిన రాళ్ళపై నిలబడి
పచ్చ గన్నేరు పూలు కోసి
 మంకెనాకులు  దూసుకొచ్చి
 తొమ్మిది రోజులు
 బతుకమ్మ పేర్చిన జ్ఞాపకం

 బోడ బాపనమ్మ గంగిరేగి చెట్టు నుండి దొంగతనంగా పండ్లు దులిపి
గోడ దునుకలేక
 బామ్మ చేతిలో రక్షణ పొందిన జ్ఞాపకం

 రాయిని కాలువలో
 ఎర్రలు లేకుండా చేపలు పట్టిన రోజులు వెంటనే నీటిలో వదిలిన ఆనందం
 ఎంత బాగుందో

 పందెం కోసం
 సూర్యాపేట నుంచి చిత్తలూరు వరకు
 నడిచిన జ్ఞాపకం
నల్లగొండ నుండి సైకిల్ పై చిత్తలూరు వరకు

 వర్షాకాలం
 బస్సు కోసం ఏడు కిలోమీటర్లు గురజాలకు నడిచి వెళ్లడం
ఆ రోజుల్లో అలవాటే

 కోతులు చూడటం కోసమే
 గురజాల నడుచుకుంటూ వెళ్ళేది
 ఆ రోజుల్లో
 ప్రతి ఇంటికి కోతుల నుండి రక్షణ కోరుతున్నాం  ఈ రోజుల్లో

 తోలుబొమ్మలాట
 బాగోతాలు
 చిడతల రామాయణం
సాయంత్రపు వినోదాలు ఆరోజుల్లో
సినిమా సిక్స్టీన్ ఎమ్మెం వచ్చేవరకు
  నేల టికెట్
 సెకండ్ క్లాస్
ఫస్ట్ క్లాస్
 బాల్కనీ
ఇప్పుడు అంతా ఒకే టికెట్

 అరవపల్లి జాతరలో
బస్తా తీసుకొని వెళ్లి
తెరముందు పరుచుకుని
కూర్చుని చూసిన మొదటి సినిమా
 శ్రీమంతుడు

 ఏ ఊరికైన నడిచే వెళ్లేది
బస్సులు లేని రోజుల్లో
బంధువులను తీసుకురావడానికి
కచ్చడం బండి
లేకుంటే గుడిసె బండి

 బావి కాడ సద్ది తింటుంటే
 ఎంత ఆనందమంటే
 ఈరోజుల్లో
 బార్ లో మందేసినా అంత ఆనందం రావడం లేదు
ధర్మాస్ ఫ్లాస్క్లో   టీ పంపితే
బాపు తాగిన తర్వాత మిగిలిన దాని కోసం పోటీ పడే వాళ్ళం

 చేదబావి
పూడికతీత ప్రతీ ఎండాకాలం
నల్లాలొచ్చాక కనుమరుగైపోయిన బావులు
ఆ  తావులు ఇంకా గుర్తున్నాయ్

దయ్యాలన్నీ
ఉప్పల మైసమ్మ యాప చెట్టు పై నివాసం ఉంటాయని కథలు కథలుగా చెప్పేవారు
నడకదారిలో అలా వెళుతూ ఉంటే కాల్లు వణికేదప్పుడు
ఇప్పటికీ ఆ తావు మారలేదు
 చూసే చూపే మారింది
 దయ్యాలేమయ్యాయో మరి

 సార్లు అంటే
చచ్చేంత భయం చంపేంత ప్రేమ
 భయం భక్తీ కలిసి కాపురం చేసిన హృదయాలు మావి

 సెలవుల్లో
 పసుల గాసే టపుడు  చెట్టు చేమ అలదుకొని పారే తీగలతో సావాసం
 బోడకాకర కాయ లంటే మా కంచెలో
సండ్ర చెట్టుకు పారే తీగకే కాస్తాయేమో
అనేంత అమాయకత్వం
 పాలకుర్తి చెట్టు కాయలు పాములై వస్తాయన్న అపోహలు

 పలుగు రాళ్ళకు  బొట్లు పెట్టి
పండగపూట కోన్ని కోసి
భక్తితో మొక్కినపుడు
 కోడి కాలు నొకటి నరికి చెట్టు కొమ్మకు కట్టేసి నప్పుడు
యే ప్రశ్నా ఉదయించని స్తబ్ధత

దేహంతో రాలేదు
దేహంతో పోదు కూడా
మొలతాడు
ఆ రోజుల్లో దోతికి బందోబస్తు కోసం
 తాళంచెవి
 చిమ్మట
పిన్నిస్ వంటి వాటికి
ఒంటికి కట్టిన  దండెంతాడది
దేహం పోయినప్పుడు మాత్రమే తీసేవారు ఆచారాలలో భాగమైపోయింది
అంతంత ఆసరా కాదది
మొలతాడు
 చీదని ముక్కు
 గోకని చేయి
 చీకని వేలు
 చినగని లాగు
 ఆడని కాలు
 పలకని నోరు
 ఉండేవా ఆ రోజుల్లో

 పదోతరగతి ఐపోయేవరకు
 పండ్లు తోమనీకి వేపపుల్లలే వాడేవాళ్ళం
 లేదంటే ఉప్పు బొగ్గు ఎప్పుడో మంజన్ పొడి

 వానకాలం కురిసే మిద్దె
 చౌడు పోసి దిమ్మీసేస్తె ఆగేది
 గిన్నెలు పెట్టి పట్టే నీళ్లు
 బురద వాకిళ్లు లేని ఇళ్లు లేవు
మొరం కుప్పలు పోసి దారి చేసుకునేవారు

 అలుకు పిడచ
ఈనె
తీనె
 అందమైన లోగిలికి
వారంవారం పెండ పూత
 ఇల్లంతా కొత్త హంగు
 పండుగలప్పుడు గోడలు అలికి పట్టెలు పెట్టేవారు

 పూరి గుడిసెలకు
 తాటి కమ్మలు
 గడ్డిమోపులు
సొప్ప కట్టలు
జమ్మి పరకలు
కానుగాకు
మోదుగు కొమ్మలు
ఇంటి పై కప్పుకు ఆర్ సీసీ లేదు
డంగు సున్నం లేదు

 జాలారి గుంటలు ఇంటికొకటి వారానికొకసారి
ఎత్తిపోతలు
డ్రైనేజీ ఊసే లేదు

 సాయంకాలం
 అరుగుల మీద పురుషుల బాతాఖానీలు
 గుమ్మాల దగ్గర మహిళల ముచ్చట్లు
 వినోదభరిత సన్నివేశాలు
 ఎంతో ఆనందం
 మేము భాగస్వామ్యం కాకపోయినా సరే

 విత్తనాలు బదులు
 నాగుకు ఇవ్వడం
నేటి ఇంట్రెస్ట్ లాగా
పంట పడకుండానే గింజలు పెంచుకోవడం

చావడి దగ్గర రోజూ గుంపులుగా జనం
పంచాయతీ లన్నీ అక్కడే మరి
చిత్తలూరు మా శ్వాస, ధ్యాస.
 ఇప్పటికీ రోజు కోసారి చిత్తలూరు వెళ్ళి వస్తుంది మనసు.
ప్రతీ పుట్టిన రోజున అక్షరమై వాలుతుంది
వాక్యమై చుట్టుకుంటుంది.
...... వీరా గుడిపల్లి

No comments:

Post a Comment

వీరానుగమనం 3

వీరానుగమనం...3 ప్రేమకధ తనగురించి చెప్పాలి‌.ప్రేమంటే తన గురించే చెప్పాలి. టీ తాగాను చెల్లి తెచ్చిచ్చింది. బాలేదని చెప్పి వె...