Sunday, April 12, 2020

వీరానుగమనం 1


వీరానుగమనం... 1
*వీరా గుడిపల్లి దీర్ఘ కవిత ... (Part.. 1)*
(అనుభవాల ,జ్ఞాపకాలను కలిపి పేనే ప్రయత్నం)
 *యాబైయ్యైదేళ్లైంది*
  నేనిక్కడికి వచ్చి
నా కంటే ముందు ఎందరో వచ్చారు
నాతోపాటు కొందరు
ఆ తర్వాతా వస్తూనే ఉన్నారు

 ఎక్కన్నుండొచ్చానో తెలీదు
 ఎక్కడికి వెళ్తామో  తెలియదు
 వెళ్లేవాళ్లు వెళుతున్నారు
 తెలియని గమ్యం చేరుకోవడానికి

యేంచేస్తున్నానిన్నాళ్ళు
*ఆయనసుట్టు యాబయైదు చుట్లు దిరిగిన అంతేకదా*
సూర్యుని చుట్టూ భూమి ,భూమి చుట్టూ చంద్రుడు అంతే
*జీవితమంటే నే యెవరిచుట్టో ఒకరిచుట్టు తిరగడం*

 ఎన్ని గీతలు గీశారు
ఎన్ని భాషలు కూర్చారు
 ఎన్ని బంధాలు అల్లుకున్నారు
 దేని కోసమో వెతుకుతున్నారు
ఎందుకో తెలియకుండా

 పారే నీటికి కట్టలు వేశారు
 పర్వతాలను కూల్చేశారు
చందమామనందుకున్నారు
 పాలపుంతలనేలుతున్నారు
పక్కోని గురించి పట్టించుకోకుండా

 సంతానానికి అర్థం మారింది
కో ఇస్తే చాలు కొడుకంటున్నారు
 డబ్బిచ్చి డబ్బాల్లో పెంచే పేరెంటిజం
 వృద్ధాప్యంలో వదిలేస్తున్న వారసత్వం
 నిందారోపణలేతప్ప
 నిజమెవరికవసరం

 *ఎవరి కోసం యెవరొచ్చారు*
*కలిమి కోసం కలుపుకున్న బంధాలే తప్ప*
కన్నీళ్లతో అతకాలని చూస్తూ
 యాబయ్యైదేళ్ల కాలం
 యేంనేర్పిందంటే
 *అవసరమేముందనుకునేంత*

 భావవాదం ఒకరిది
 భౌతికవాదమింకొకరిది
 మధ్యే వాదంతో
మనుగడ సాగించే వారే అంతా
సాగినంత కాలం సాకులు చెబుతూ

*రుచులకు అలవాటు పడ్డ నాలుక*
*వాసన కలవాటుపడ్డ నాసిక*
*స్పర్శా సుఖం కోసం తహతహలాడే దేహం*

 *అందాల వెతుకులాటలో కళ్ళు*
 *పొగడ్తలకు అలవాటుపడ్డ చెవులు*
 *నీతులు వల్లించే మనసు*
*అంతరాత్మకు ఎదురు తిరగడం లో*
*విశ్రాంతి లేకుండా ఉన్నాయి*

అంతకుముందు ఎలా ఉందో అన్న అనుమానం పోయింది
యాబయ్యైదేళ్ళ అనుభవం
అన్నీ కళ్ళ ముందుకు తెచ్చింది
 ప్రతిభను గుర్తించలేం
పక్కోడి ఉన్నతి భరించలేం
పొత్తు జేస్తే తప్ప  పూర్తిగా అర్థం కాదు
పొరుగు నుండి చూస్తే తప్ప
నిజస్వరూపం కానరాదు

ప్రతోడు మంచిగుండాలని
మాటలే తప్ప మనసారా  కోరుకోవడం లేదు
ఎంతకాలం ఈ ప్రయాణం
హాయిగా సాగినంతకాలం
ఆనందం తరగనంత కాలం
సంతోషం కమ్మినంత కాలం

ఇన్నేళ్ల ప్రయాణంలో
ఎదురైన ప్రతీ అనుభవం
నన్నెంతో ఎదిగేలా చేసింది.

కాలసంద్రం లో
పృథ్వీ నావపై దొరికిన దేహపు తోడ్పాటు
తీరం చేరేవరకు తీరుబడిగా మోయాల్సిందే.
ఒంటరిగా వెల్లాలని తెలిసీ

ప్రకృతి శక్తులను
 కూలదోయజూసే మనసుల్ని
 మోసే దేహాలతో స్నేహించడమెందుకు
ఈ దేహం సైతం వదిలెల్లాల్సిందే కదా

*కొన్ని నాల్కలు*
*కుళ్ళిపోయాయి చెవి తో స్నేహం చేయలేవు*
కొన్ని చేతులు మంచి రాయడం మరిచిపోయాయి.అక్షరలోపం బారిన పడ్డాయి.
కొన్ని నాసికలు
అనారోగ్యం పాలయ్యాయి బుసకొట్టడమే తప్ప శ్వాసించడం మరిచాయి
కొన్ని హృదయాలు
కమురు కంపుతో పొగబారి పోయాయి ఎంతకాలం కొట్టుకుంటాయో
ఆ మనసెందుకో
ఓర్వలేని క్యాన్సర్ బారిన పడింది. ఎంతకాలముంటుందో పిచ్చెక్కి పోకుండా.

ఎక్కన్నుండొచ్చామో
 యెవరికీ తెలీదు
యెంతకాలముంటామో తెలీదు
కలిసి
నడుస్తున్నప్పుడు పడదోయడమెందుకు అదీ జబ్బే కదా
చేయందించలేని రోగం
  మందింకా రాలే

*ఈ దేహం ధరించి యాబైఐదేల్లైంది*
ఎన్ని చూశానో,
నడిచేదేహాలను చూస్తూ నవ్వుకున్నాను
కలహించు కుంటున్నాయి.
కన్నీరు పెడుతున్నాయి.
కలిసి నడిచే దేహాలను మోసం చేస్తున్నాయి
సర్వస్వం తామేనని నమ్మబలుకుతూ

లింగభేదపు మాయనుండి బయటపడలేని వేళ
నీతులు చెప్పడం చూశాను
పక్కవారి ప్రగతి భరించలేని వేళ వగలుబోతూ
కధలు చెప్పడం గమనించాను
ప్రతీ మనసును ప్రేమిస్తూ పరులసేవకే ప్రాణమిచ్చే ప్రాణాలను పలికించాను

ఈ దేహం నాకేమిచ్చిందంటే ....
పచ్చి
మిరపకాయలలో తీయదనముంటుందని
శుభం జరిగినా అశుభం అలదుకున్నా మొఖం పై పసుపే పూస్తారనే జ్ఞానం
ఉల్లి తల్లి లాంటిదే
దేహానికే తప్ప మనసుకు కాదని
నిజం కంటే అబద్దం అందమైందని, సంతోషం పక్కోడి ఓటమినుండి
ఆనందం ఎదుటోడి గెలుపు లో వెతుక్కోవాలని తెలిపింది
ఈ దేహం తో బంధం బలపడడం భయపెడుతోంది.....

*అరుణాచలం వెళ్ళుండకపోతే*
 *ఆగమయ్యుండే వాడినని*
కమ్యూనిజాన్ని చదివుండకపోతే
 మనిషి విలువ తెలిసుండక పోయేదని.
శివమూ,శవమూ వేరు కాదని
 చైతన్యపు శక్తి భాండాలని
కుంచించుకు పోయిన విశ్వం
 విస్తరిస్తూ బతుకుతుందని
స్టీఫెన్ మాత్రమే
ఎందుకు గ్రహించాడో అర్థమైంది .
పదార్థమే పరమాత్మని ప్రకటిస్తున్నాడీ వీరా
నమ్మితే తప్పు సుమా!!!
నా వెనకాల నడుస్తావు.
నీ మార్గం నీవే వెతుక్కో...

సీతమ్మవాగింకా శోకిస్తుంది.
తనవొడ్డున ఇప్పపూవింకా అమ్ముడు పోతుందని
రామకోటి గోదాట్లో వదులు తుంటే
సముద్రుడడుగుతున్నాడట నాకెందుకు పంపిస్తున్నారని
 వీరా
  ప్రకటిస్తున్నాడు .. రాముడు కాని దెవరని.
  ఇంటికో సీత దుఃఖిస్తుంటే!!!
నిన్ను నీవే నమ్ముకొమ్మంటూ..
నిజాయితీ గా నిలబడమంటూ..
సుఖాలవేటలో సాగే ప్రయాణం
దుఃఖం తో అంతమౌతుంది
ఆనందానికి అర్థం తెలిస్తే
ప్రయాణమంతా సంతోషమే
గమ్యమనేది లేకుండా....
Don't set destination
It will become a Full stop.
ముప్పయేళ్ళ క్రితం నాకిరవయ్యైదేకదా

చురుకుదనం తగ్గని  మనసు
బరువెక్కిన దేహం,
దేనినైనా నవ్వుతూ
భరించడం నేర్పిన అనుభవం
యాబై ఐదేళ్ల ప్రయాణమంతా
నేర్పుతూ.. నేర్పుతో నేర్చుకుంటూ
 అలాగే సాగిపోతూ....
....... *వీరా గుడిపల్లి*

No comments:

Post a Comment

వీరానుగమనం 3

వీరానుగమనం...3 ప్రేమకధ తనగురించి చెప్పాలి‌.ప్రేమంటే తన గురించే చెప్పాలి. టీ తాగాను చెల్లి తెచ్చిచ్చింది. బాలేదని చెప్పి వె...