Saturday, February 18, 2023

వీరానుగమనం 5

Eighteen months 
4.
నాల్గవ వారం
ఆ పద్దెనిమిది నెలలు
************************
నమ్మండి నమ్మకపోండి..1
***********************
ఉద్యోగం రావాలనే ఆశ ఉండేది కానీ
ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నది గానీ చదివింది గానీ లేదు.
 వెంకట నారాయణ సార్ ను అందరూ రవి సార్ అంటారు , తను నేను సూర్యాపేట లో సరదాకి ట్యూషన్ చెబుతూ అలా హ్యాపీగా కాలం గడుపుతూ
డీయస్సీ పడగానే రాసాం.సీరియస్ గా తీసుకోలేదు ఇద్దరమూ అంతే .....నమ్మాలి.నేనైతే జీవితంలో ఇప్పటిదాకా ఏ విషయం సీరియస్ గా తీసుకోవడం జరగలేదు.
తొలి ప్రయత్నం లోనే జాబ్ వచ్చేసింది దాంతో ఆనందం .సీరియస్ నెస్ అనే విషయం సీరియస్ గా మరిచి పోయాను. ! ఇది నిజం
 నేను రాగిబావి ప్రాథమిక పాఠశాల, రవి సార్ బొడ్డు గూడెం ప్రాథమిక పాఠశాల లో జాయిన్ అయ్యాం.
మాతోపాటు ముషం శ్రీనివాస్ ప్రాథమిక పాఠశాల ముశిపట్ల ,ఉమేందర్ ప్రాథమిక పాఠశాల ఆరెగూడెం లో జాయిన్ అయ్యారు. నలుగురం మోత్కూరు లో పోతాయిగడ్డ అనే ప్రాంతంలో రెండు గదుల పోర్షన్ కిరాయికి తీసుకుని ఉండే వాళ్ళం. కిరాయి 300 రూపాయలనుకుంటా తలా 75 రూపాయలు ఇచ్చేవాళ్ళం.అదనపు బిల్లు అంటే కరెంట్ బిల్లు,నల్లా బిల్లు లాంటివేం ఉండేవి కాదు .
అందరి లో నేను ఒక్కడినే పెళ్లి ఐన వాడిని.ఐనా మా ఆవిడ తన డిగ్రీ పూర్తి చేయడం కోసం మహబూబా బాద్ లో వాళ్ళ నాన్న గారి దగ్గర ఉండడంతో నేనూ ఫోర్స్ డ్ బాచిలర్ గా వీరందరితో కలిసి ఉండడం జరిగింది.
ప్రతీరోజూ ఉదయం జాగింగ్ అనంతరం వంట చేసుకుని లంచ్ బాక్స్ సర్దుకుని నలుగురం ఒకేసారి తలా ఒక సైకిల్ పై పాఠశాల కు వెళ్లి డ్యూటీ అనంతరం నాలుగున్నర ఐదు ప్రాంతంలో మోత్కూరు చేరుకునే వాళ్ళం.
సాయంత్రం సరదాగా బస్టాండ్ వరకు వెళ్లి
లడ్డు శీను పండ్ల దుకాణం దగ్గర తలా ఒక అరటి పండు తిని అదో ఇదో సుత్తేసి అలా అలా తిరిగి టీ తాగి ,వెనక్కి వచ్చేసి వంట చేసుకుని తిని బజ్జోవడం.ఇదీ రొటీన్ దినచర్య, మా నలుగురిదీనూ...
కానీ ఈ అందరిలో ఉమేందర్ మాత్రం కసిగా చదువుతూ సబిన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా సెలెక్ట్ అయ్యాడు.ప్రస్తుతం డీఎస్పీ గా పనిచేస్తున్నారు.
మిగతా వారమంతా స్కూలసిస్టెంట్ గా ప్రమోట్ అయ్యాక గెజిటెడ్ హెడ్మాస్టర్ ప్రమోషన్ కోసం క్యూలో ఉన్నాం.
ఐతే స్పెషల్ టీచర్ గా పనిచేసిన ఆ పద్దెనిమిది నెలల కాలం ఏం జరిగింది అనేదే ఇక్కడ నేను ప్రస్తావించదలచుకొన్న అంశం....
5
ఐదవ వారం
*********************
పసివాడు నేర్పిన పాఠం...2
*********************
కొత్తగా ఉద్యోగం
అప్పటికే సూర్యాపేట విద్యార్థి బంధువు ఇనిస్టిట్యూట్ లో రోజుకు పది గంటలు 
ఉదయం నుండి రాత్రి ఏడు గంటల వరకు పనిచేసిన అనుభవం
ఏదో చెప్పాలని ఏదో చేయాలనే తపనతో పాఠశాల లో అడుగిడి కార్యోన్ముఖుడినయ్యాను.
కొద్దిరోజులు గడిచాయి చతుర్విధ ప్రక్రియలపై దృష్టి పెట్టడం , రాయడం చదవడం అనే విషయాన్ని ప్రాథమికంగా ఎంచుకుని పని చేయడం మొదలు పెట్టాను. నా వరకు సంతోషంగా నే సాగుతోంది ప్రయాణం. 
ఏదో సాధించాలనే తపన గాడిన పడుతోంది. పేరెంట్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ, గ్రామస్థులతో కలిసి పోతూ పాఠశాలను ప్రతీ ఒక్కరు తమదని భావించేలా చేయడం కోసం కృషి చేయడం మొదలు పెట్టాను.
అప్పట్లో అన్నల ప్రభావం గ్రామాలలో అధికంగా ఉండేది. పని చేసే వారికి మంచి గుర్తింపు ఉండేది. అలా లభిస్తున్న గుర్తింపు తో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెల్తున్నాను‌. అప్పుడు జరిగిందొక సంఘటన నా భవిష్యత్తు ప్రయాణ దిశను మార్చింది. నా ఆలోచనా సరళిని మలుపు తిప్పిన సంఘటన .

ఓ పసివాడు తన ఉపాధ్యాయునికి నేర్పిన పాఠమది. 
ఇప్పటికీ అది నా అదృష్టం అనే భావిస్తున్నాను.
ఆ రోజు ఎప్పటికీ మరిచిపోలేను వాడి పేరు మహేష్ అనుకుంటా వేగంగా వచ్చి నా చేయి పట్టుకొని ఆపాడు.
నేను ఏంటన్నట్లుగా చూశాను.
వాడన్నాడు " సార్ మల్లేశ్ నిన్ను రాయితో కొడతడట సార్,అదిగో చూడండి చేతిలో రాయుంది" అన్నాడు
నాకు ఆశ్చర్యం వేసింది, అటువైపు తిరిగి మల్లేష్ దగ్గరకు వెళ్ళాను. 
"ఏరా నిజమా నన్ను రాయితో కొడదామనుకున్నావా ?" అనడిగాను.
వాడిలో భయం కానీ బెదురు కానీ లేదు. అంతేనా " ఆ(( అవును సార్" అన్నాడు.
నాకు నవ్వు వచ్చింది అంతేకాదు కొంత గర్వం కూడా కలిగింది.ఎందుకంటారా? అంత కోపం లోనూ వాడు సార్ అనే పదం ఐతే అన్నాడు. చేతిలో ఉన్న రాయి కింద పడేయలేదు.
 "సరే రా.. ...కొడితే కొడుదువు గానీ
 ఎందుకు కొట్టాలనిపిస్తుంది ?" అని ప్రశ్నించాను.
ఆశ్చర్యం ఏంటంటే వాడిలో ఏమాత్రం భయం కనిపించలేదు అంతే స్పీడుగా 
"నాకు ఎక్కాలు రాలేదని మా నాయినకు ఎందుకు జెప్పినవ్ సార్ ,మా నాయిన నాకు సదువొస్తలేదని అందరికి జెప్పిండు" అని అడిగాడు. అలా అన్నప్పుడు మాత్రం వాడి కళ్ళ లోనుండి ఒక కన్నీటి బొట్టు రాలిపడింది. నా హృదయం ఎవరో పిండేసిన ఫీలింగ్ నా కండ్లు కూడా ఆర్థ్రమయ్యాయి. తప్పు చేశాననిపించింది. వెంటనే వాడిని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకొన్నాను ఒక్క నిమిషం అలా ఆగి 
 "సారీరా!! మళ్లీ ఎప్పుడు కూడా అలా చెప్పను , రాయితో కొడతావా సరే కొట్టు ఈ సారికి "
అన్నాను. వాడు రాయి పట్టుకున్న చేతిని పట్టుకొని.
వాడు అప్పుడు ఏడ్చాడు అంతే కాదు నేనూహించని మాటన్నాడు
 "నన్ను కొట్టు గాని మా నాయినకు జెప్పకు సార్" అన్నాడు.
గట్టిగా దగ్గరకు తీసుకొని అలాగే ..... మళ్లీ ఎప్పుడు కూడా ఇలాంటి పొరబాటు చేయనని నాకు నేను చెప్పుకున్నాను.
ఆ తర్వాత ఆ అవకాశం వాడు నాకు ఇవ్వలేదు.
సహజంగానే వాడు ది బెస్ట్ బంగారం ఆ సంఘటనానంతరం పరిమళమలదబడిన పసిడి గా మారిపోయాడు.
నన్ను నేను భవిష్యత్తు లో మంచి ఉపాధ్యాయునిగా మలచుకునే అవకాశం ఇచ్చాడు ‌. ఆ క్షణం నుండి విద్యార్థుల పట్ల నా దృక్పథం మారిపోయింది. ఎక్కడ మాట్లాడినా సరే తల్లి తండ్రుల తో మాట్లాడే టపుడైనా నిజాన్ని సున్నితంగా తెలియజేస్తూనే విద్యార్థుల ఆత్మ గౌరవం కాపాడాలి పాజిటివ్ వైబ్రేషన్ కలిగించేలా పేరెంట్ టీచర్ మీట్ ఉండేలా చూసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. మనల్ని గొప్పగా project చేసుకోవడం కోసమో ,మంచి ఉపాధ్యాయుడినని చాటుకునే అంతర్గత భావన తోనో ప్రవర్తించ కూడదు . కాంప్లైంట్ కాదు కన్విన్స్ చేయాలని, పరిష్కారం వెతకాల్సిన బాధ్యత టీచర్ దే తప్ప ,తప్పు విద్యార్థులది కాదనే దృష్టితో ఆలోచించేలా చేశాడు ఓ నాల్గవ తరగతి పిల్లవాడు. అన్నీ ఉపాధ్యాయ శిక్షణ లోనే చెప్పరు కొన్ని అనుభవాలు కూడా శిక్షణ నిస్తాయి. నాకు ఎదురైన అనేక సంఘటనలలోకెల్లా నన్ను కదిలించిన సంఘటన ఇదే ,అదీ సర్వీస్ తొలి నాళ్ళలో ఎదురవడం నా అదృష్టం కాక మరేమౌతుంది.
రాగిబాయి పాఠశాల నేర్పిన పాఠం నాకు ఇంకా గుర్తుంది. ఎప్పటికీ గుర్తుంటుంది. అభ్యసనం ఇరువైపులా జరిగింది అటు పిల్లలకూ ఇటు నాకు. ..‌.. 
6.
వీరానుగమనం 5
ఆరవ వారం
అన్నిటికంటే గొప్ప మంత్రం..3
*******************
ప్రాథమిక పాఠశాలలో చేరాను. అప్పటి వరకు పదవ తరగతి ఆ పై పిల్లలకు మాత్రమే పాఠాలు బోధించాను.ఇప్పుడు ఐదవ తరగతి లోపు పిల్లలకు పాఠాలు చెబుతుంటే కొత్తగా ఉంది సంతోషంగా ఉంది.. అమాయకంగా వారికి తెలిసిన అంటే చూసిన, విన్న, ప్రతీ విషయం మనతో షేర్ చేసుకుంటుంటారు.
పిల్లలకు పాఠాలు చెప్పడమనేది కొత్తేం కాదు. కానీ 
బడిని. ... చదువు కునే రోజుల్లో చూసిన దానికి , ఒక ఉపాధ్యాయునిగా చూసే దానికి ఎంతో తేడా కనిపించింది. 
అప్పటికే నెలకు రెండు వేలు ప్రైవేటు లో సంపాదిస్తున్నా కూడా (అప్పుడు రెగ్యులర్ స్కేల్ పొందుతున్న SGT వేతనం వెయ్యి రూపాయల లోపే ఉంది) తొలి జీతం రూ.398 అందుకున్న ఆనందం సంథింగ్ డిఫరెంట్ అన్నట్లుగా ఉంది.
రోజూ మోత్కూరు నుండి సైకిల్ పై
 ( ప్రైవేటు ఇనిస్టిట్యూట్ కరస్పాండెంట్ శ్రీ మలిశెట్టి సోమయ్య సార్ గిఫ్ట్ గా ఇచ్చిన సైకిల్ అది ) స్కూల్ కి రావడం తిరిగి సాయంత్రం మోత్కూరు చేరుకోవడం అలా అలా అంతే. 
పాఠశాలలు పర్యవేక్షణ చేయడానికి మండల విద్యాశాఖాధికారి ఉండే వారు. 
ఆ రోజుల్లో మండల విద్యాశాఖాధికారిగా సీనియర్ స్కూల్ అసిస్టెంట్ నే నియమించే వారు ఇప్పుడు అది ప్రత్యేకమైన పోస్ట్. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులతో సమాన హోదా కలిగిన ఉద్యోగం.కానీ ఆ రోజుల్లో అలా కాదు
 senior school assistant.
వారు కూడా పాఠశాల పర్యవేక్షణకు సైకిల్ పైనే వచ్చే వారు ఇప్పుడైతే కారు లేదా కనీసం బైక్ పై అదీ ఒక సహాయకునితో వస్తున్నారు.
 చాలా సాదా సీదా ఆహార్యం ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా వచ్చే వారు.
ఒకరోజు 
ఎవరో వచ్చి బడిముందు సైకిల్ ఆపి బెల్ కొట్టారు. నేను పాఠం చదివిస్తున్నాను వినిపించుకోలేదు.మళ్ళీమళ్ళీబెల్ కొడుతున్నాడు.అంతే! నాకు కోపం వచ్చింది
 ".ఏం చేస్తున్నావిక్కడ? పిల్లలను పాఠం చదివిస్తున్నాను కనిపించడం లేదా " అన్నాను.
"నేను MEO ను నీవేనా ఇక్కడ టీచర్?" 
తన సమాధానం తో పాటు నాకో ప్రశ్న .

నేరుగా వచ్చి అడగొచ్చు కదా ఇదేం పిచ్చి అలవాటని మనసులో అనుకుంటూ
 "ఔను సార్ good morning" అన్నాను.
"ఊ(( ఊ(( ...మీ head master రాలేదా?"
ప్రతి నమస్కారం చేయడా? మనసులో ఏదో కెలికినట్లు అనిపిస్తుండగా... సార్ సెలవు పెట్టారు సార్ "అన్నాను.
అటెండెన్స్ రిజిస్టర్ తీసి చెక్ చేసి సంతకం చేశారు.
పిల్లలను చదివించారు, ఎక్కాలు అడిగారు, ఇదో అదో సరదాగా మాట్లాడారు.నా అసహనం కాస్త తగ్గింది. సాయంత్రం ఇరువురం ఎవరి సైకిల్ పై వాళ్ళం మోత్కూరు ప్రయాణం అయ్యాము. MEO గారు కూడా మోత్కూరు లోనే ఉండేవారు.దారివెంట మేం మాట్లాడుతూ వెల్తున్నపుడు ఇప్పటి లాగ ప్లాట్ లగురించో, ఫ్లాట్ గురించో కాదు పిల్లల స్థితి గతులు గ్రామాల పరిస్థితుల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం.ఇంతలో సార్ ఇళ్లు వచ్చేసింది.ఇంట్లోకి ఆహ్వానించారు. నేను కాదనకుండా వెళ్ళాను. సార్ ఫ్రెషప్ అవడానికి లోపలికి వెళ్ళాడు. నేను హాల్లో కూర్చుని ఉన్నాను .బ్లాక్ అండ్ వైట్ TV ఉన్నది.దానిపై ఫిలిప్స్ రేడియో ఉంది.నాకు బాగా గుర్తుంది రెండింటినీ ఆఫ్ మోడ్ లోనే ఉంచారు. ఒక బెంచి, రెండు చెక్క కుర్చీలు ఉన్నాయి.
గది వెనుక గది వరుసగా మూడు గదుల పోర్షన్ గోడలపై స్లాంట్ గా వేలాడదీసిన ఫోటోలు ఉన్నాయి.వాటిలో ఒకటి మహాత్మా గాంధీ ఫోటో, ఇంట్లో దేశనాయకుల ఫోటోలు ఆ రోజుల్లో చాలా మంది ఇళ్లలో కనిపించేది. ఇంతలో సార్,మేడం ఇద్దరూ బయటికి వచ్చారు మేడం చేతిలో టీ గ్లాసులు మాకు చెరొకటి అందించింది. నా గురించి ఆరా తీయడం మొదలు పెట్టింది 
 "మీ స్కూల్ లో చింత చెట్టు ఉందట గదా నాయనా ? "
"ఊళ్ళో మామిడి చెట్లు ఉన్నాయా?"
ఇలా... నేను అన్నింటికీ ఉన్నాయనే సమాధానం చెప్పాను. ఇదే దారిలో వెల్తావు కదా అప్పుడప్పుడు చింత కాయలు గానీ మామిడి కాయలు గానీ తెచ్చిచ్చి పోతావా ?? అనడం జరిగింది తనకు నేనేమీ బదులీయలేదు.
సార్ కి ఏం అర్థం ఐందో కానీ మేడం ను
  "నీవు లోపలికి వెళ్లు" అన్నాడు తరువాత సార్ తో నేనేం మాట్లాడలేదు టీ తాగి చడీ చప్పుడు లేకుండా వెళ్లి వచ్చేశాను.
ఏజ్ వలననో లేక అప్పటికే రెడ్ టేపిౙమ్ పై వేళ్ళూనుకున్న భావ జాలమో , వామపక్ష విద్యార్థి సంఘాలలో తిరిగిన ప్రభావమో కానీ నాకు చాలా కోపం వచ్చింది.అసహనంతో రగిలిపోయాను. చాలా అవమానంగా అనిపించింది.
కానీ ఎవరితో షేర్ చేసుకోవాలనిపించలేదు . తప్పెవరిది? సార్ దా? లేక వాళ్ళావిడ దా? ఏంచేయాలి??
ఆ రోజు నిద్ర పట్టలేదు చాలా రాత్రి వరకు అదే విషయం ఆలోచిస్తూ తెలతెల వారుతుండగా నిద్ర పోయాను.
నిద్ర ప్రశాంతత నిచ్చింది.
ఒక నిర్ణయానికి వచ్చాను.ఆ రోజు నుండి ప్రతీ రోజు అదే దారిలో వెళ్ళడం అతని ముందుగా వెళ్ళడం జరిగేది.కానీ యే రోజూ తనను విష్ చేయలేదు. ఐనా నాలోని అసహనం తగ్గలేదు.అవమాన భారం ఎక్కువనిపిస్తుంది.
చివరిగా ఒకసారి ఆ సర్ తో చెప్పాను ఆ రోజు మీ ఇంట్లో జరిగిన విషయం నన్ను అసహనానికి గురి చేసిందని.
 "చింతకాయ, మామిడికాయ తెచ్చిచ్చే వాడిలా కనిపిస్తున్నానా ? ఆ రోజు నుండి నేను నేనులా లేను సార్ " అన్నాను.
 "నిజమే అలా అనుండాల్సింది కాదు.... సారీ" అన్నాడు. కాస్త విచారంగా మొహం పెట్టి.
తను సారీ చెప్పిన వవిధం మనఃఃస్ఫూర్తిగా చెప్పినట్లు అనిపించింది తన మొహం చూస్తే. మరుక్షణం నా మనసు హాయిగా ఉంటుందను కున్నాను. కానీ అదేంటో
విచిత్రంగా ఉంది మరీ ఇబ్బంది అనిపించింది.అనవసరంగా సార్ ని ఇబ్బంది పెట్టానా అనిపించింది.అడిగేంత వరకు మనసు రగిలిపోయింది అవమాన భారంతో ,అడిగాక తను సారీ చెప్పాక ,తప్పు చేశానా అనిపించింది.ఎటూ తేల్చుకోలేని స్థితి. ఆ సంఘటనను అంగీకరించానా అంటే లేదు . మరి అడిగి హ్యాపీ గా ఉన్నానా అంటే అదీ లేదు. ఈనాటికీ ఆ సంఘటన గుర్తు చేసుకున్న సందర్భంలో మనసంతా మౌనంగా ఏదో బాధ.
అంటే ఆ సంఘటనను ఏ కోణంలో తీసుకున్నా నేనే బాధ పడినట్లు.. కదా !!!
నా తొందరపాటు ఫలితమది అనిపిస్తుంది.
కొంత వేచి చూడాల్సిఉండెనేమో అనిపిస్తుంది.
తను క్యాజువల్ గా అడిగిందా
ఆఫీసర్ భార్యగా అడిగిందా
ఏదో ఒకటి కానీ
నాతో ఆ సార్, సారీ అనడం నాకు తృప్తి నీయకపోగా 
తనపై ఉన్న కోపమంతా కరిగిపోయి నేను పశ్చాత్తాపం చెందేలా చేసింది.

ఓం భూర్భువఃస్వరో తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహీ దియో యోనః ప్రచోదయాత్ 
క్షమాపణ కోరడం కంటే గొప్ప మంత్రం ఈ ప్రపంచంలో.. మరొకటి లేదని అర్థమైంది. 
7.
వీరానుగమనం 5
ఏడోవారం
మనదాకా వస్తే కానీ తెలియదు 4
**************************
ఏమాటకామాటే చెప్పుకోవాలి
ఈ పద్దెనిమిది నెలల కాలం ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
దసరా సెలవులకు ముందు జరిగిందా సంఘటన.
 తెల్లారితే దసరా సెలవులు అంటే ఫస్ట్ షార్ట్ టర్మ్ హాలీడేస్ ఆల్మోస్ట్ పన్నెండు,పదమూడు రోజులుండేవి. తెలంగాణ వచ్చాక ఇప్పుడు పదిహేను పదహారు రోజులకు మారింది.
రేపటి నుండి సెలవులు ఇంటికి వెళ్ళి పోవచ్చు అనే ఆనందం .మామూలుగానే హాయిగా సాగిపోతుంది నా సైకిల్ ప్రయాణం.ఆరోజు మరింత సంతోషంగా కూనిరాగాలు తీస్తూ వెల్తున్నాను.బాట వెంట ఎవరూ తారస పడరు. అది రోడ్డు కాదు. కంకరకూడా పరచబడిన జ్ఞాపకం లేదు ఇరుపక్కలా చేలూ కంచెలు ఉన్నాయి రక్షణగా నాట బడినవో అవే పెరిగినవో గాని సర్కారు కంప చెట్లు,మంగ పొదలు, వేసిన ఎనుగులతో నిండిన దారి. పనకబండ దాటి వెళ్ళాలి కదా మన రాగిబావి చేరుకోవడానికి, పనకబండ చేరుకోవడానికి కొన్ని నిముషాల ముందు సైకిల్ పై హాయిగా వస్తున్నానా అకస్మాత్తుగా ఎనుగులోనుండి దారికి అడ్డంగా ఒక నాగు పాము వేగంగా వస్తుంది.నా సైకిల్ ముందు చక్రం, పాము వస్తున్న దారులు పరస్పరం లంబరేఖలని చెప్పవచ్చు.కొన్ని క్షణాలు రెండు కలిసేందుకు ఒకేసారి భయం నరనరాన ప్రాకింది.వణుకు పుట్టింది ఇవన్నీ ఏకకాలంలో జరిగిన సంఘటనలు. ఏంచేయాలో తెలీదు ఏం చేశానో తెలీదు సైకిల్ ఎలా వదిలానో గాని స్పృహలో లేకుండా నే సైకిల్ వదిలేసి దూరంగా వెళ్లి పోయా. అక్కడ నుండి చూస్తే సైకిల్ కింద పడింది ముందు చక్రం పై పడగ విప్పిన పాము చాలా రాజసంతో కనిపించింది. కాళీయ మర్థనం ఘటనలో కాళీయుని తలపించింది.కాక పోతే పడగ మీద కృష్ణుడు నాట్యం చేయడం లేదు.
 పడగ కనిపించడంతో త్రాచు అని పోల్చుకోగలిగాను. మొదటి నుండి పామంటే విపరీతమైన భయం నాకు. కొన్ని క్షణాల పాటు నిశ్చేష్టుడినయ్యాను.పాము వెళ్లి పోయింది కానీ కొంత సేపటి వరకు సైకిల్ దగ్గరకు వెళ్ళలేదు. మరో వ్యక్తి ఇప్పటికీ గుర్తుంది అతని పేరు నర్సింహ కానీ అందరూ నర్సయ్య అని పిలుస్తుంటారు. వెనుక నుండి వచ్చాడు
 " ఏమైందయ్యా సైకిల్ మించి పడ్డావా" అంటూ పలకరించాడు . నిజానికి పేర్లు గుర్తుంచుకోవడంలో నాది చాలా వీక్ మెమొరి కానీ ఆరోజు డైరీ లో తన పేరు రాసిపెట్టాను . నేను విషయం వివరించి తనతో వెళ్లి సైకిల్ తీసుకుని పాఠశాల కు వెళ్ళి పోయాను. ఎలా వెళ్లానో కానీ ఆరోజు మహా ఆపద తృటిలో తప్పిన ఫీలింగ్ తో మనసంతా గాలిలో తేలిపోతుంది ఎక్కడో లోపల ఉన్న పెయిన్ ఆనందాన్నే డెలివరీ చేస్తుంది. తిరిగి ఇంటికి బయలు దేరే టపుడు ఆ ప్లేస్ వరకు రాగానే కాస్త ఆగి మరొకరు వచ్చే వరకు నిరీక్షించి బయలుదేరాను.
మోత్కూరు వచ్చాక మితృలతో ఈ విషయం చెప్పలేదు. మరుసటి రోజు మహబూబా బాద్ వెళ్లి ఉమాను తోడ్కొని చిత్తలూరు వెళ్ళాను.పండగకోసం.తమ్ముడు ,చెల్లె ,బావ అందరూ అప్పటికే చేరుకున్నారు.
మా బావ ,నేను డిగ్రీ కళాశాలలో బ్యాచ్ మేట్సు, తమ్ముడు, చెల్లె అంతా చాలా సరదాగానే ఉంటాం. మేమంతా ఒకే చోట చేరితే పండగ రోజు కాకపోయినా సరే ఆరోజు పండుగను తలపించాల్సిందే.
సరదా సిట్టింగ్ లో "నేను -నాగు" విషయం పంచుకున్నాను. అందరూ సీరియస్ గా విన్నారు.వెంటనే పాములు మంత్రాలు పగబట్టడాలు ఇత్యాది విషయాలపైకి చర్చ మల్లింది. మంత్రించిన బియ్యం కర్చీఫ్ లో కట్టుకోవాలని, 
"అది మూఢ నమ్మకం కదా" అంటే,
"ఏమో యెవడికెరుక ఛాన్స్ తీసుకోవడం అవసరమా " ఒకరు
అదేమో గానీ మంత్రపు దారం మణికట్టు కు కట్ట్టుకోవాలని ఒకరు,అదేంటంటే

,"తిరుపతి దారం చేతికి కట్టుకుని కలర్ వైట్ అయ్యే వరకు ఉంచుకోవడం లేదా? నాలుగు రోజులు కట్టుకుంటే ఏంటి " చెల్లె
ఇలా ఎప్పుడూ మూఢనమ్మకాల జోలికి వెళ్లని వారు, స్వతహాగా శాస్త్రీ య దృక్పథంతో ఉండేవారు అంతా కూడా ఒక్కోసారిగా డిఫెన్స్ టాక్ చేయడం మొదలైంది.
ఇదంత మనవాడికి జరిగే సరికి, మనసు బలహీనమవడం తో 
"నాలుగు రోజుల పాటు మంత్రించిన బియ్యం దస్తీలో కడితే,మంత్రం దారం మణికట్టుపై కట్టుకుంటే నష్టం ఏముంది?
ఇందులో నమ్మకాలతో పనేముంది? ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి?"
అందరి అభిప్రాయం అదే.
అప్పుడు మా బాపు ఒక మాట చెప్పాడు.
పామును కొట్టడం లాంటివి జరిగితే దెబ్బ తగిలి ఎటూ తిరగలేక అక్కడే ఎనుగుల్నో పొదల్నో తల దాచుకుంటుంది.ఆకలికి దూరం వెళ్ళ లేక అక్కడక్కడే తిరుగుతుంటే ఎవరికైనా కనిపించినప్పుడు, పగబట్టి అక్కడే తిరుగుతుంది అనే నమ్మకం ,
జనాల్లో నాటుకుపోయింది. క్రమేపీ త్రాచు పాము పగ పన్నెండేళ్ళనే పాటలు పుట్టాయి. అంతే తప్ప మరేం లేదు భయపడనీకి అన్నాడు.
కానీ అలా ఉండడానికి ఎవరూ ఒప్పుకోలేదు.
సరే ....."అక్కడ ఉన్నారు ఇలాంటి విషయాలు చూసే వారు, మోత్కూరు వెళ్ళాక తప్పని సరిగా ఫాలో అవుతాను" అని చెప్పాను.
మా బాపు మాత్రం "అంతగా భయమైతే నాలుగు రోజుల పాటు వేరే దారేమైనా ఉంటే ఆ దారిలో వెళ్ళరా అన్నాడు."

నాకో ధర్మ సందేహం మొదలైంది
నేను పామునేమీ అనలేదు కానీ కొద్ది నిమిషాల పాటు సైకిల్ ఫ్రంట్ వీల్ పై పడగ విప్పి ఆడింది.
నన్ను గుర్తు పట్టి ఉండవచ్చు నా?
ఈ పగలు నిజమేనా? ఏం చేయాలి అనుకుంటూ అప్పటికి ఆ విషయం వదిలేశాం.
అంతా కలిసి ప్రతి రోజూ పండగే అన్నట్లు గా సెలవులు సంతోషంగా గడిచిపోయాయి.అందరం బయలు దేరే సమయం ఆసన్నమైంది.మళ్ళీ అందరూ అదే జాగ్రత్తలు చెప్పారు.
అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని
"నువ్వు ఏది పట్టించుకోవు నాయనా జర జాగ్రత్త ఆ దారమేదో కట్టుకో మర్చిపోకు" అని చెప్పింది.
"సరే అమ్మా "అంటూ బయలు దేరాను.
మా ఆవిడను వాళ్ళ నాన్న గారు తీసుకెళ్ళారు.
ఉదయమే బయలుదేరి గట్టు సింగారం వరకు ఎడ్ల బండిమీద వెళ్లి, అక్కడ ఫస్ట్ బస్ ఉదయమే ఆరున్నర గంటలకు పట్టుకుని మోత్కూరు చేరాను.
నెక్స్ట్ డే నుండి బడికి వెళ్ళాలి. ఎలా?
ఇదే ఆలోచన, పాములేదు పగ లేదు అని ఒక వైపు,మంత్రాలు ట్రాష్ అంతా ఉత్తదే అనే ఆలోచన మరోవైపు, చదువుకునే రోజుల్లో వామపక్ష విద్యార్థి సంఘాలలో తిరిగిన అనుభవం, ఐనా ఎక్డనో కాస్త భయం. ఎక్కడినుండి వచ్చిందీ భయం? ఏం చేయాలి?
తెల్లవారుజామున లేచాను, స్కూల్ కి రెడీ అయ్యాం, నేను, ఉమేందర్,రవి, శ్రీను ఎవరి సైకిల్ పై వారు ఎవరి పాఠశాలకు వారు స్టార్ట్ అయ్యాం.పోతాయి గడ్డ మెయిన్ రోడ్ ఎక్కగానే రవిసార్ లెఫ్ట్ టర్న్ అయ్యారు మిగతా ముగ్గురం రైట్ టర్నయ్యాం.చౌరస్తా దగ్గరకు వెళ్లగానే శ్రీను, ఉమేందర్ స్ట్రైట్ గా వెళ్ళారు.నేను రైట్టర్న్ తీసుకున్నాను. నేరుగా వెల్తున్నాను ఇంతలో "వీరారెడ్డి సార్ అలా వెల్తున్నారేంటి సార్ " అనే పిలుపు టీ కొట్టు అతనిది. ప్రతి రోజూ అక్కడ టీ తాగి వెళ్ళడం అలవాటు.ఆ రోజు మరిచిపోయా.
ఆగి టీ తాగి ఈ రోజు నుండి కప్రాయ పల్లి నుండి వెల్లాలనుకున్నట్లు చెప్పాను.
"దూరం కదాసార్" అన్నాడు.
"కానీ బాట బాగుంటుంది " నా సమాధానం.
మంత్ర బియ్యం ముడి వేయలేదు, నల్ల దారం కట్టుకోలేదు.  
ఇది మెలో డ్రామా అనొచ్చా?? ఏమో మరి
నెల రోజుల పాటు అలాగే వెళ్ళాను.

ఎందుకో మనసు ఊగిసలాట
తట్టుకోలేక పోయాను.
ఏమైనా సరే పాత దారిలో వెళ్ళే తీరాలని అనుకున్నాను.
ఒక రోజు,ఆ టీ కొట్టులో టీ తాగి పాత దారిలోనే వెళ్లడం మొదలు పెట్టాను.
దగ్గర దగ్గరగా ఆ స్పాట్ రానే వచ్చింది. అక్కడ బాట పక్కనే ముగ్గురున్నారు. ఆశ్చర్యంగా ఒకతను మంట పెడుతున్నాడు.ఆగి ఏంటని అడిగాను పామును చంపానని,నాగు పాము కాబట్టి కాల్చాలని అందుకే ఇలా చేయడమని చెప్పారు.
అదీ ఇదీ ఒకటేనా? 
ఏమో కావచ్చు, కాక పోవచ్చు కానీ, 
ఆరోజు నుండి రోజు ఇదే దారిలో వెళ్లి రావడం జరిగింది. ప్రతీసారి ఆ స్పాట్ కి రాగానే ఏదో అపరాధ భావన తొలిచేది.

మనం అభ్యుదయ వాదులమనీ, సత్య వాక్పరిపాలకులమనీ,మూఢ నమ్మకాలకు అతీతులమనీ, ఏదైనా విషయం చర్చించే టపుడు ఆ చర్చలో దొర్లే సద్గుణాలన్నిటికీ మనమే ప్రతినిధులమనీ ఎదుటి వారి ముందు మాట్లాడుతుంటాం. కొండొకచో మనమూ భావిస్తుంటాము. కానీ మనదాకా వస్తేకదా తెలిసేది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ను నేను తిరస్కరించడానికి నెలరోజులు పట్టింది.
తప్పొప్పుల తలంపును దరిచేరనీయలేదు.
...... సశేషం (ఇంకా ఉంది)
*****************
ఎనిమిదో వారం
వీరానుగమనం 5
Primary school teacher 5
****************
ఆరోజు నాకనిపించింది 
అన్ని విషయాలు B Ed లోచెప్పరని. పాఠశాలలో అనేక విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుందని.
ఒకటి, రెండు,మూడు, నాలుగు తరగతులలో కూర్చుంటే చాలు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ప్రతీ విద్యార్థి ఒక లోకల్ ఛానల్.మొదట మనల్ని మాట్లాడనివ్వరు.వారు చెప్పేవన్నీ వినాలి.వాళ్ళింట్లో ఏం జరిగిందో, గ్రామంలో ఏం జరిగిందో,ఏ సీ సీ కెమెరా చూడని,ఏ వార్తా పత్రికలో ప్రచురించని,అనేక విషయాలు మనతో పంచుకుంటారు.అన్ని విషయాలు శ్రద్ధగా వినాలి జెశ్చర్స్ ఇవ్వాలి. కామెంట్స్ చేయగూడదు ఔనా!! అనే ఆశ్చర్యం ప్రకటించడం వరకు సరే.
( మనలో మన మాట ఏ కోర్టు కనుక్కోలేని న్యాయం,ఏ పోలీసు విచారణలో తేలని నిజాలు ప్రాథమిక తరగతుల పిల్లలతో పది నిమిషాలు గడిపిన ఉపాధ్యాయులకు తెలిసిపోతాయి , కాకపోతే చెప్పిన ఫీలింగ్ వాడికుండదు,విన్న ఉపాధ్యాయుడు తననుండి విషయం అవతలి కోర్టు కు విసరడు అంతే !!! అదో చిదంబర రహస్యం)

చర్చి ఫాదర్ వలె వినాలి తప్ప పాస్ ఆన్ చేశామో.... అంతే!!.మన పరిస్థితి ఆగమే.
మనంత నమ్మక మైన మనిషి, తెలివైన వాడు, జ్ఞాని ,వాడి దృష్టి లో మరొకరుండరు. 
మన మాటే శాసనం, తల్లి తండ్రుల మాట కంటే కూడా మనమాటే ఆ పసి హృదయానికి ఎక్కువ. కావలసిందల్లా శ్రద్ధగా వినడం
ఎన్ని విషయాలు తెలుస్తాయో!! గ్రామంలోని అనేక గొడవలకు అసలైన కారణాలు, ఎన్నో రహస్యాలు, అలవోకగా ఏ పక్షం వహించని పసివారు అలా చెప్పడం మనం లౌక్యం తో ఏమీ తెలియనట్టు ఉండడం సహజం. ప్రైమరీ టీచర్ కు అన్ని విషయాలు తెలుస్తాయి కానీ ఒక యోగిలా మసలుకుంటాడు. చిరునవ్వు రువ్వుతూ దొంగెవరో దొరెవరో తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉంటాడు.
తన శిష్యులకు దైవ సముడు.
 వారి రాత రాసే బ్రహ్మ, వారికి రాత నేర్పే గురువు. కల్లాకపటం తెలియని పిల్లలతో గడిపే సమయం ప్రతీ రోజు లభించే వరం.
పిల్లలకు తానో నమ్మకమైన నేస్తం. వారు చెప్పడం ఐపోయాక మన పాఠం మొదలౌతుంది. అప్పుడు మనం ఏం చెప్పినా వాడి బుర్ర స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. అలవోకగా నేర్చు కుంటారు. కానీ ప్రతీ క్షణం మన ధ్యాస వాడి పైనే ఉండాలి వాడే మన మొదటి ప్రయారిటీ కావాలి. మనం చెప్పిందే ఫైనల్ కదా!!!
ఆ కాలంలో అక్షరాలు దిద్దించడం, వల్లె వేయించడం, డిక్టేషన్ చెప్పడం ఉండేది.
పలకపై అక్షరం రాసి ఎలా దిద్దాలో చెప్పి నంత మాత్రాన పనైపోదు. పలుకుతూ దిద్దుతున్నాడా లేదా అనేది అనుక్షణం మనం గమనిస్తుండాలి. ఏమరుపాటుగా ఉన్నామా బలపం పడుకో బెట్టి ఏదో రాగం తీస్తూ రుద్దేస్తాడు. పలకంతా పనిమంతుడి లెక్క. పలక శుభ్రం చేసుకునే విధానం చెప్పాలి ప్రతీ సారి ,లేదంటే ఉమ్మేసి రుద్దేస్తాడు. అంతటి సహనం ప్రతిసారీ చూపాలి.
కోప తాపాలకు తావివ్వకుండా ఉండాలి, రోజంతా చిరునవ్వు ను వదలకూడదు.అందుకే ప్రాథమిక ఉపాధ్యాయుడంటే సహనానికి ప్రతిరూపం .....లేదంటే ...
ఆ రోజు వృథా అయిపోయినట్టే. కోప్పడ్డామా అంతా ఐపోయినట్లే ??
తప్పు వాడిది కాదు. ఏమరుపాటుగా ఉన్న మనది అంతేనా? ...ఆ పసి మొలకల పై అసలు కోపం ఎలా వస్తుంది? ఓ చిరునవ్వు మన మోము పై ప్రాణం పోసుకుంటుంది. ప్రాథమిక ఉపాధ్యాయుడంటే మాతృ మూర్తి మరో అవతారం.
వారి ప్రతీ చర్య ను ఆస్వాదించాల్సి ఉంటుంది.
బడి వదిలే సమయానికి అంతా ఇంటి దారి పడుతుంటే ఏదో కోల్పోతున్న భావం మనసంతా ... అందుకే ఆ పద్దెనిమిది నెలల కాలం నా వృత్తి రీత్యా అత్యంత కీలకమైన సమయం అంటాను నేను.
 ఇప్పుడు బోధనాభ్యసన ప్రక్రియ రూపం మార్చుకుంది. ఏ పద్ధతి మంచిదనేది వేరే విషయం.ఏరోజుకారోజు
 నేను ఈరోజే మొదటి సారి పాఠం చెబుతున్నానన్నంత ఫీల్ ఉంటే నే వృత్తికి న్యాయం చేయగలరు ఉపాధ్యాయులు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల విషయంలో ఇది ముమ్మాటికీ నిజం.
ప్రాథమిక పాఠశాల లో పనిచేసిన అనుభవం మిగతా సర్వీస్ అంతటికీ పునాదిగా భావిస్తున్నాను.
అక్షరాలు దిద్దించాం. ఎక్కాలు రాబట్టి/బట్టీ పట్టించాం. (తప్పని చెబుతున్నా తప్పని సరై చేయాలని) . డిక్టేషన్ క్రమం తప్పకుండా చేయించాం.లెసన్ రీడింగ్ ప్రతీరోజూ జరిగేది.సాయంత్రం ఓరల్ డ్రిల్లింగ్.చివరి అరగంట లౌడ్ రీడింగ్.నలబై దాటని సంఖ్య ఇరువురం ఉపాధ్యాయులం... అలా పద్దెనిమిది నెలలు..... ఇంకా ఉంది.

తొమ్మిదవ వారం
ఎప్పుడొస్తరయ్యా ???..6
*******************

అయ్యా !!!! బాగున్నారా??
ఆ((( బాగున్నాం. అంటుండగానే ఏదో చెప్పడం మొదలు పెట్టాడు.
మోత్కూర్ లో...
సాయంత్రం సరదాగా ఏటొడ్డుకు వెళ్లి ఇసుకలో అటూ ఇటూ తిరిగి అప్పుడే నిర్మాణం పూర్తి కావస్తున్న బ్రిడ్జి మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండే వాళ్ళం చీకటి పడేవరకు.
ఆరోజు అలాగే సరదాగా తిరిగి తిరిగి  చీకటి పడేవరకు బ్రిడ్జ్ పై కూర్చుని, ఎందుకో రోజుకంటే ఎక్కువ సేపు కూర్చున్నాం .బాగా చీకటి పడింది. రూం కు బయలు దేరుదామని లేవబోతుంటే ఆ పెద్ద మనిషి వచ్చాడు. అయ్యా బాగున్నారా అంటూ. ఆ(( బాగున్నాం అంటుండగానే ఏదో చెప్పడం మొదలు పెట్టాడు.
లేవబోయిన వాళ్ళం కూర్చుని తను చెప్పేది వినడానికి సిద్ధపడ్డాం.
అయ్యా !!! నాది ఇక్కడికి ఆరు మైళ్ళ దూరంలో ఉన్న గ్రామం. గుండాల మండలం. నా పేరు నర్సయ్య. అని చెప్తున్న తను ఎవరో మాకు గుర్తు రావడం లేదు. తను మాత్రం మేమెంతో పరిచయమున్న వాడి లా చెప్తున్నాడు. మీరెవరని మేం అడగలేదు తను చెప్పే విషయం వింటూ ఊ((,ఆ(( అనడం చేస్తున్నాం.
తన కుటుంబ సమస్య అది. భూ తగాదా, అన్నదమ్ముల మధ్య వ్యవహారం.తనకు సరియైన వాటా దక్కలేదని, తన అన్న దమ్ములు,   తండ్రి, తనపై దాడి చేశారని, కొందరు పెద్ద మనుషులను కూడా  కొన్నారని, అందువల్ల వారికే  మద్దతు పలుకుతున్నారని ఆ మాటల సారాంశం.  మేం , అది అన్యాయం కదా అలా చేయడం తప్పు కదా అని కాస్త సానుభూతి వ్యక్తం చేశాం. వన్ సైడ్ వెర్షన్ విని న్యాయ నిర్ణయం చేయ గూడదని తెలుసు కానీ సానుభూతి తెలపడానికి అదేం అడ్డు కాదన్న లోకరీతి ఫాలో అయ్యాం. సరే పెద్దాయనా ! మరి వస్తాం ...అంటూ లేచాం.
అప్పుడన్నాడు అతను " అన్నా ఎప్పుడొస్తారు మరీ "
ఎంత చిన్న వారైనా సరే ,అందరితో అన్నా అని పిలిపించుకోగలిగేది ఆ ...అన్నలు మాత్రమే కదా!!!
మాకు అప్పుడు వెలిగింది బల్బు.మమ్మల్ని చూసి తను అన్నలని అనుకుని ఇంత కథ చెప్పాడని. నిజానికి అతను ఏ మాత్రం మాకు తెలిసిన మనిషి కాదని.
మా అవతారాలు గుర్తుకు వచ్చాయి ఒకసారి.
దువ్వకుండా వదిలేసిన జుట్టు, పెరిగిన గడ్డం అఫ్ కోర్స్ ట్రిమ్ చేసిన గడ్డం. రెడ్ కలర్ టీ షర్ట్, ఇరవై నాలుగు, ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన యువకులం.

అది అన్నల ప్రజా దర్బార్లు నడుస్తున్న సమయం. ఒక రైలు బోగీ తగల బెట్టబడిన కాలం.  ఎర్రజెండాను కాస్త ప్రజలు ప్రేమిస్తున్న సమయం, వారిపై ప్రజలు నమ్మకం పెంచుకున్న రోజులు. ప్రజల్లో అపారమైన అనవచ్చో లేదో కానీ కాస్త మెండుగా నమ్మకమున్న కాలం.
విద్యార్థిగ కాలేజ్ టైం లో పీడీయస్ యూ లో తిరిగి, వామ పక్ష సాహిత్యం చదివిన మాకు వారి పట్ల సదభిప్రాయం ఉండేది.
హఠాత్తుగా ఈ సందర్భం ఎదురయ్యే సరికి మాకు ఏం చెప్పాలో పాలు పోలేదు.
మేం అన్నలం కాదని, ఉపాధ్యాయుల మని తనతో చెప్పినా, అతను నమ్మడం లేదు

"సరే అయ్యా అలాగే చెబుతా గానీ, ఎన్నడు వస్తారు? ఎప్పుడు వస్తారు? "
అతని ప్రశ్న.

కాస్త విడమరిచి విపులంగా వివరించాక
"సరే గానీ అన్నలు ఎప్పుడు వస్తారు మరి ఇక్కడికి" మరో ప్రశ్న.
మాకు తెలీదన్న జవాబు విని నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోతూ మావైపతను చూసిన చూపులోని అర్థాలు...
వసంతం కోసం ఎదురు చూసే ముందు
 "శిశిరాన్ని ఎదుర్కోవాలని తెలిసినా
రాలే ఆకుల్ని చూసి 
వాడిన మోడులనుకోవడం వెనకున్న
 అమాయకత్వం.
అందిందనుకున్న అవకాశం ఏదో అందకుండా పోయిందన్న బాధ
వెతుకులాట ముగిసిందనుకుంటే , మళ్ళీ మొదటికి వచ్చిందన్న ఆవేదన
ఒకటా రెండా.... "

ఒకసారి బాధనిపించింది. 
పాపమనిపించింది.
ప్రజాకోర్టుల పేరుతో జరిగిన తష్వాలు,కొంత ఖేదం కొంత మోదం, కొందరికి న్యాయం కొందరికి అన్యాయం ధ్వనించిన రోజులు.
 కొంత కాలం తాత్కాలిక ఉపశమనం కలిగించిన క్షణాలవి. కానీ శాశ్వత పరిష్కారాలు గా భావించి ఇచ్చిన మద్దతు కొందరి మోములో చిరునవ్వు, కొందరిలో విషాదం మిగిల్చిన సమయం.
అన్నల రాజ్యం నడిచిందనలేం కానీ, కొంత కాలం ప్రజలు అన్నల రాజ్యం వచ్చిందా ,వచ్చేస్తుందా?అన్న భావనకు మాత్రం వచ్చారు. ఇదెంత కాలం?  అనే సందేహం అందరిలో ఉన్నా..... సశేషం (ఇంకా ఉంది)

వీరానుగమనం 3

వీరానుగమనం...3 ప్రేమకధ తనగురించి చెప్పాలి‌.ప్రేమంటే తన గురించే చెప్పాలి. టీ తాగాను చెల్లి తెచ్చిచ్చింది. బాలేదని చెప్పి వె...