Sunday, July 19, 2020

వీరాస్ పోయెట్రీ 4 పున్నమి కోసం

కవితా మాలిక
1.మూగబోయింది
2.బడిగంట
3.ఎవరూ
4.నా వల్ల విద్య
5.లలిత
6.వేడుక
7.పీవీ
8.ప్రపంచ జనాభా దినోత్సవం
9.మహ్మద్ షరీఫ్ తీరికెక్కడిది
10.మరిచిపోతే ఎలా కణిక
11.బాలు యస్పీ
12.కాటన్ దొర
13.వెంకయ్య నాయుడు
14.మదిబా
15.మనిషి బాగుండాలి
16.జలసిరులు
17.పిలిస్తే చాలు
18.పాస్
19.న్యాయవాది
20. కొరివి క్రిష్ణ
21.అంతిమ లక్ష్యం
22.సావిత్రి
23.నటకిరీటి
24.శ్రావణ మాసం
25.వారసుడు కె.టి ఆర్
*************
ఇది వీరా గుడిపల్లి కవిత
08/07/2020
అంశం ః బడి గంట
శీర్షిక ః మూగబోయింది
******************
సాయంత్రం ఇంటికి వెళ్ళమంటుంది
తిరిగి పొద్దున్నే పిలిపిస్తుంది
నిత్యం తానే నడిపిస్తుంది
ఆ చప్పుడు వినిపిస్తే చాలు
మనసు పరుగెత్తుతుంది
ముప్పయ్యేళ్ళ క్రింద
చుట్టిన శ్రీ కారం
నాతో
నాల్గు వేలమందిని నడిపించిన ఓంకారం
అనునిత్యం స్పందించే అంతర్వేది
నా ప్రపంచానికి సింహద్వారం
తను వినిపిస్తే చాలు
చుట్టూ బిలబిలమంటూ పిల్లలు
భవిష్యత్ భారతాన్ని నిర్మించే పని మొదలు
మల్లీ మోగిందంటే
బంధాలు బాంధవ్యాలకై ప్రయాణం
భారత్ నిర్మాణానికై ఉదయం
భాగమై జీవించడానికి సాయంత్రం
వినసొంపైన స్వరం
ఊహ తెలిసిన ప్పటి నుండి
 తనతోనే జీవితం
యాబై ఏళ్లు గా నడిపిస్తున్న బడిగంట
మూణ్ణెళ్ళుగా మూగబోయింది.
...... వీరా గుడిపల్లి

2
ఇది వీరా గుడిపల్లి కవిత
08/07/2020
అంశం ః బడిగంట
మోగాలి
*********************
కేరింతలు
కవ్వింతలు
ఆటలు
అల్లర్లు ఏవీలేవు
ఫలితాల పండగ
కొత్త పిల్లల జాడ ఏదీ లేదు

ప్రతి రోజూ పదిసార్లు
సుతిమెత్తగా సుత్తి తో ముద్దాడే
యాదగిరి కానొస్తలేడు
పెద్దవారు కారు సప్పుడు లేదు
ఒళ్ళంతా చిలుం పట్టింది
కడిగేవారులేరు
దుమ్ము తుడిచేవారూలేరు


రామచిలుకలు, పావురాలు
నెమళ్ళు కూడా పలకరించి పోతున్నాయి
పసినవ్వులే కరువయ్యాయి

బ్లాక్ బోర్డు బిక్కమొహం బెట్టింది
అన్నంమెతుకుల ఆనవాళ్లు లేవు
ఆకలి చూపులు గేటు దగ్గర ఆగిపోతున్నాయి
అన్నానికీ, అక్షరాలకూ కరువొచ్చింది.

పరిక్షలు దులిపేశి పాసౌట్స్ పెంచేశాక
వానాకాలం సదువలంటే తెలిసింది
జ్ఞాన వర్షం కురవాలంటే
మేధో మధనం జరగాలి

అక్షరాలు మొలకెత్తాలి
ఆకలి కేకలు ఆగిపోవాలి
చిలుం వదిలించుకుని
నేను మోగేతీరాలి.
...... *వీరా గుడిపల్లి*
3
ఇది వీరా గుడిపల్లి కవిత
09/07/2020
****************
*ఎవరూ ఇంకెవరూ*
******************
అధ్యక్షా
ఆ పిలుపు వినిపిస్తే కనిపించేదెవరు?
పాదయాత్ర
పదం కనబడితే గుర్తుకు వచ్చేదెవరు?
ఉచిత కరెంటుతో
తెలంగాణ రైతుల ప్రాణాలు నిలిపిందెవరు ?
ఉద్యోగులకళ్ళల్లో
కాంతులు పూయించిందెవరు ?
అంబులెన్సు
అందరికీ అందుబాటులోకి తెచ్చిందెవరు ?
ప్రజా హితమే
తనమతమని చేతల్లో చూపిందెవరు ?
పేదలు కూడా
ఆంగ్ల మాధ్యమంలో చదవాలని ఆశించిందెవరు ?
చెరగని చిరునవ్వే
ఆభరణంగా ధరించి అక్కయ్యా చెల్లెమ్మా అంటూ ఆప్యాయత పంచిందెవరు
ట్రిపులైటీల స్థాపకుడెవరు ?
ఆరోగ్యశ్రీ రూపకర్త యెవరు?
ఎవరూ? ఎవరూ? ఇంకెవరూ?
ప్రతీ హృదయం
గుడిగా కొలువైన జనహృదయ నేత
వైయస్సార్ గాక ఇంకెవరు ???
...... *వీరా గుడిపల్లి*
4

ఇది వీరా గుడిపల్లి కవిత
కణిక కోసం
09/07/2020
****************
అంశం ః విద్య
శీర్షిక ః నావల్ల
*************
ఉపాధి దొరకక కాదు
ఉపాధి హామీ పథకం లో పనిచేసినా ఇంతకంటే ఎక్కువే వస్తుంది
నారుమడి దున్నినోడిని
నాలుగు రాళ్లు సంపాదించడం తెలియక కాదు
పనిలేక కాదు పనిరాక కాదు
అక్షరాళ పరిమళం వ్యసనమైపోయిందంతే
పసిపిల్లల సావాసం
 ఆధ్యాత్మిక అమృతవాహిని గా భావించాను గనుక
చదువు చెప్తున్నంత కాలం
నేనూ విద్యార్థి గా నిరంతరం నేర్చుకోవచ్చుననే ఆశ
బడిలోనే కొనసాగాలనే కోరిక బలంగా నాటుకుపోయింది
ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడిననెప్పుడూ అనకోలే
ఉపాధ్యాయుడినని మాత్రమే మనసు చెబుతోంది
కష్టకాలమనుకోవడంలే
ఇంతకాలం ఎంత త్యాగం చేశానో
మీరంతా గుర్తించే టైమొచ్చిందని అనుకుంటున్నాను.
విద్య
ఎవరి చేతిలో ఉందో తెలిసొచ్చింది.
యేం చేయాలో ఆలోచించే సమయం వచ్చింది.
నావల్ల..... కదా...
గర్వంగానూ ఉంది.
..... *వీరా గుడిపల్లి*
5
లలిత
పద్య రచనలో
అమోఘమైన పట్టుసాధించి
వచన కవితా రచనలో
మెళకువలను పసికట్టి ,
వెన్నెల శిల్పం రూపంలో పుస్తకం గా మలిచి
మనకందించిన
శ్రీ మతి శివునూరి లలితాకృష్ణ
ఆషాఢమాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ  ద్వితీయ న్యాయ నిర్ణేత.
సమన్వయం
క్రమశిక్షణ అంటే
తానే గుర్తుకు వస్తుంది.
కవితలను సేవ్ చేయడం
బ్లాగ్ అప్డేషన్
సమూహ సభ్యుల పోస్టింగ్స్ పై స్పందించడం
పద్యానువాదాలను
పద్ధతిగా సమీకరించి
అవధాని గారి
కృషిని సమన్వయ పరచడం
కవితా గానం,
వీరాస్ కవి సమయం
కవన జ్యోతి సమూహాలను
అంతా తానై నడిపిస్తున్న
శివునూరి లలితాకృష్ణ గారు
మన
 ఆషాఢమాసం కవితల పోటీ కి

రెండవ న్యాయ నిర్ణేత.
అంతేనా...
మీ అందరికీ తెలుసు
అద్భుతమైన గాయని తాను.
గాంధర్వ గానం
అంటే విన్నాను కానీ ఎలా ఉంటుందో తెలీదు.
ఉన్నా
లలితమ్మ స్వరం కంటే బాగుంటుందనుకోను.
తన స్వీయ గళంలో కవితల పోటీ ఫలితాలు అనేక పర్యాయాలు వెలువరించారు.
ఈ ఆషాఢమాసం పౌర్ణమి
నగదు పురస్కారాల కవితల పోటీ ఫలితాల్లో
న్యాయ నిర్ణేత గానూ  బాధ్యత లను నిర్వహించిన
చెల్లి
 శివునూరి లలితాకృష్ణకి ధన్యవాదాలు

ఇది వీరా గుడిపల్లి కవిత
6
10/07/2020
వేడుక
*******
కణిక కోసం
నా గెలుపు ను కోరుకునే వారితో
కలిసి గడపడం
నా ఆనందాన్ని కోరుకునే వారితో
కలిసి భోంచేయడం
నన్ను నన్ను గా గుర్తించే వారితో నాలుగు మాటలు మాట్లాడుకోవడం
నాతో నేను గడిపే క్షణాల్లో గుర్తుకు వచ్చేవారిని
గుర్తించి
పిలిపించి
సరదాగా ఆనందించడం
వేడుక అంటే
నేనే ముఖ్యమని భావించే నావాల్లతో నాలుగు మాటలు మాట్లాడడం
వేడుకను వేడుక చేసుకోవడమే
జీవితం
.... *వీరా గుడిపల్లి*
7

ఇది వీరా గుడిపల్లి కవిత
11/07/2020
పీవీ
*******************
బంగారం కుదువబెడితేతప్ప
బయట పడలేని స్థితి నుండి
బంగారు భవిష్యత్తు వైపు
భారత దేశాన్ని నడిపించిన
తెలుగు తేజం.
పెద్దదిక్కైన కుటుంబం
నాయకత్వం వదులుకున్న తరుణంలో
దీపస్థంభంలా అగుపించి
 ఆదెరువై ఆదుకున్న మహనీయ మూర్తి
కష్టాల అలలెన్ని ఎదురైనా
తీరం దాటకుండా తీర్చి దిద్దిన మేధస్సు.
వేయి పడగలు వాదించి
సాహిత్య వీధుల్లో విశ్రాంతి నెదుక్కున్న సాహితీ పిపాసి
మౌన మునిగా మన దృష్టిలో మిగిలిపోయి
మహా మనీషిగా ఎదయెదలో నిలిచిపోయిన ఠీవి .మన పీవీ
....... *వీరా గుడిపల్లి*

8
ఇది వీరా గుడిపల్లి కవిత
12072020
ప్రపంచ జనాభా దినోత్సవం
*************************
నియంత్రణ
జనాభా నియంత్రణ
నలబై లక్షలతో కువైట్
నాలుగు కోట్లన్నా మించని కెనడా
నలబై కోట్లు దాటని అమెరికా
ఐదు లోపే  కదా స్పెయిన్
మనకే మనకే ఔను మనమే వందకోట్లు దాటేశామెప్పుడో ఆపై మరో ఇరవై దాటేశాం.
పెరగని నేల
 పైగా గాల్వాన్ గొడవలు
పశు పక్షాదుల సంఖ్య
పచ్చని అడవుల విస్తీర్ణం
ఎక్కడైనా  పెరుగుదల కరువున బడింది
మానవ జనాభా దప్ప
అడవులు కనుమరుగై వన్యమృగాలంతమై
కోతులు జనావాసాలు కబ్జా చేస్తున్నాయి
ప్రకృతి
 జనదాహానికి పూర్తిగా బలైపోకముందె
జనాభా నియంత్రణ గుర్తెరగాలి.
సహజత్వాన్ని సమాధి చేయొద్దు
ప్రపంచ మంటే మనుషులేనా
పర్యావరణం కూడా....
జనాభా నియంత్రణ తక్షణ కర్తవ్యం
...... వీరా గుడిపల్లి
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం
అనుకరణ గానీ కాపీ గానీ కాదు.

పేరు ః వీరా గుడిపల్లి
ఊరు ః బోడుప్పల్
మండలం ః మేడిపల్లి
జిల్లా ః మేడ్చల్ మల్కాజ్ గిరి

9
ఇది వీరా గుడిపల్లి కవిత
12072020
మహ్మద్ షరీఫ్ గారి ఉద్యోగ విరమణ సందర్భంగా
శీర్షిక ః తీరికెక్కడిది గనుక
**************
అదే మొదటి సారి అతన్ని చూడడం
పేరు చెప్పడు
ఎవరినీ పరిచయం చేయనివ్వడు
తానెవరో
తెలుసు కుంటే తెలుసుకో
లేకుంటే ఊరుకో అన్నట్లు ఆ చూపులు
ఆలోచిస్తున్నా
ఎంతకీ తట్టలేదు ఎవరతను
ఎవరో ఉండి వెలుగు బాట గురించి మాట్లాడుతున్నారు.
మెరిసిందంతే.....
షరీఫ్ భాయ్ అన్నానో లేదో అమాంతంగా వాటేసుకుని
వీరన్నా అన్నాడు.
తానంటే
తన అక్షరాలే అని నమ్మిన అసలైన కవి డాక్టర్ మహ్మద్ షరీఫ్.
అక్షరాలతో తనను తాను ఆవిష్కరించుకున్నాడు.
వెలుగు రేఖల్లో తన చిరునామా రాసిపెట్టాడు.
తానంటే పద్యాలని
 పరిమళించే స్నేహమని తెలుసుకొమ్మన్నాడంతే.
సాహితీ సుగంధమలదుకున్న తనకు
 అక్షరాలే లోకమైన మనం యేమివ్వగలం.
జ్ఞాపకాల నవ్వుల్ని తప్ప
ఉద్యోగ విరమణ లాంటి సాంకేతిక అంశాలను గూర్చి ఆలోచించడతను
పద్యాలల్లుకునే పనిలో
తీరికెక్కడిది గనుక.....
..... *వీరా గుడిపల్లి*

10
*****************
ఇది వీరా గుడిపల్లి కవిత
12072020
మరిచిపోతే ఎలా
కణిక వార్షికోత్సవ వేడుకల సందర్భంగా
.....వీరా గుడిపల్లి
******************
ఏంచేయాలని ఆలోచించడం కాదు
ఎలా చేయాలని నీరసపడడం కాదు
ఇదీ మార్గమని చూపగలగాలి.

అవాంతరాలెదురైనప్పుడు
అవాక్కైపోవడం కాదు
అలలకెదురీది అభాసుపాలవడమూ కాదు
అంతర్లీనంగా ఉన్న మార్గాలను పసికట్టి
అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడడం

సమూహాల ప్రయోజనం సకారాత్మకంగా చూపెట్టి
సమాజహితం కోసం చేయగలిగినంత చేయడం

దారిలో ఎదురైన ఎవరినీ మరవక పోవడం
పలకరించిన ప్రతివారినీ పది కాలాల పాటు గుర్తుంచుకోవడం
మోటివేషనల్ స్పీకర్ గా మాటలు చెప్పడం కాదు
ఆచరణలో చూపడం అందరికీ ఆదర్శంగా నిలబడడం....కణిక విధానం.

కరోనా కాలం లో చూపిన చొరవ
వార్షికోత్సవ వేడుకలు జరిపిన విధానం
రేపటి నుండి అందరికీ ఆదర్శం...
ఆ ఆదర్శం ఇప్పుడు రమాకులకర్ణి రూపంలో... ... మనముందు

రమా కులకర్ణి అంటే ....
 ఇప్పుడు అందరికీ గుర్తుండే కణిక
ఎన్నో కణికలను సృష్టించిన... సోదరి.
రమా కులకర్ణి... వినీలమ్మలను
అభినందించడం.... మరిచిపోతే ఎలా???
.....   *వీరా గుడిపల్లి*


11
పేరు ః వీరా గుడిపల్లి
ఊరు ః ఉప్పల్
మండలం ః మేడిపల్లి
జిల్లా ః మేడ్చల్ మల్కాజ్ గిరి
****************
ఇది వీరా గుడిపల్లి కవిత
13072020
బాలు యస్పీ
************************
తరాలపాటుగా తనివితీరా సంగీతసరస్వతిసేవలో తరిస్తూ
అభిమానుల ను కాకుండా
భక్తబృందాలను సంపాదించుకుని
ఎంతెదిగినా ఒదిగుండాలన్న రీతిలో
నిండు సభా వేదిక పై
తనకండగా నిలిచిన వారికి పాదాభివందనం చేయగలిగే హృదయం కలిగి
పాడుతా తీయగా అంటూ
నూతన గాయకులకు అండగా నిలబడుతూ
విశ్వ సంగీత విభావరుల గౌరవాన్నందుకుకుని
వారసత్వం కాదు సుమా ప్రతిభ అన్న
మాస్టారి (ఘంటసాల) మానస చోరుడు
సహస్ర నామాల నుండి
సర్వేశ్వర స్తుతి వరకు సర్వం తానై వినపడే దెవరని ????
యస్పీ బాలు కదా!!!!!
..... *వీరా గుడిపల్లి*

12
ఇది వీరా గుడిపల్లి కవిత
14072020
గోదావరి ప్రజల గుండెచప్పుడు
సర్ ఆర్థర్ కాటన్ దొర
**********************
పరాయి పాలనలో మగ్గుతున్నప్పుడు
కాల్వెలీ కాటన్ పదోసంతానమై
ధర్మోపదేశకుడిగా కీర్తి గడించి
గోదావరీయుల పుణ్య ఫలంగా వచ్చినోడు
సైనికుడిగా
బర్మా యుద్ధం లో సత్తా చూపించి
కొలెరూన్ నదిపై ఆనకట్ట నిర్మాణం
తంజావూరు జిల్లాను సస్యశ్యామలం చేయడం
గోదావరిని
ధవళేశ్వరం దగ్గర   ఆపి పొలాలకు మళ్ళించి
కరువు రక్కసి కోరలు పీకి నేలంతా పచ్చరంగు పులిమిన ఇంజనీర్
పారిపోయే
నీటి తావులకు కళ్ళెం వేసిన దొర
రైతు కన్నీటి చుక్కలకు బంధంవేసిన
గోదావరి ప్రజల గుండెచప్పుడు.
........ *వీరా గుడిపల్లి*

13

పేరు ః వీరా గుడిపల్లి
ఊరు ః ఉప్పల్
మండలం ః మేడిపల్లి
జిల్లా ః మేడ్చల్ మల్కాజ్ గిరి
****************
శీర్షిక  . వెంకయ్య నాయుడు
******************
ఇది వీరా గుడిపల్లి కవిత

మొలక
భూమిని చీల్చుకుని వెలుగు చూస్తుంది
ప్రతీ రోజు
ఓ సాహసమే రేపటి సూర్యోదయం చూసే వరకు
అనునిత్యం పోరాటమే
అంతిమ లక్ష్యం పై ఆశలు కోల్పోకుండా
ఎదురు దెబ్బ
తినకుండా ఎదగలేదు
ఎదగుదల పై ఆశలు కోల్పోలేదు
ఎవరిపై
ద్వేషం పెంచుకున్న దాఖలాలు లేవు
అకంఠిత దీక్ష తో
హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు
ఉపరాష్ట్రపతి పీఠం తానై వరించే వరకు
సాగిన
 మా ప్రియతమ నేత వెంకయ్య నాయుడు లెక్క
తెలుగు వారి ఎదుగుదల ఆంతర్యమది.
వట వృక్షం గా మారి
నీడ నివ్వడం. ఆపన్నులకు అండగా నిలబడడం.
వెంకయ్య నాయుడు గారంటే అంతే మరి
...... *వీరా గుడిపల్లి*

14.
పేరు ః వీరా గుడిపల్లి
ఊరు ః ఉప్పల్
మండలం ః మేడిపల్లి
జిల్లా ః మేడ్చల్ మల్కాజ్ గిరి
****************
శీర్షిక ః మదిబా
(నెల్సన్ మండేలాను తన తెగవారు గౌరవంగా పిలుచుకునే పేరు)
******************
భారత రత్న బిరుదాంకితుడతను
దక్షిణాఫ్రికా తురుపుముక్క
నల్లజాతి తెగువ
నెల్సన్
అతికించబడిన అక్షరాలైనా వదిలేయలేదు
కీర్తి కిరీటంలో తురిమి విలువిచ్చిన మహోన్నత వ్యక్తిత్వం
రెండున్నర దశాబ్దాల జైలు జీవితం
ఆశయాన్ని ఆవగింజంత వెనక్కి నెట్టలేక పోయాక
ప్రత్యర్థి
 పారిపోయే సందర్భానికి జన్మనిచ్చిన మహనీయుడు
చీకటి సూర్యుడు
ఇప్పుడు ఉపమానం కాదు విశేషణం కాదు
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు
 అడుక్కునేవి కాదని పోరాడి సాధించుకోవాల్సినవని నిరూపించిన నిలువెత్తు రూపం. మదిబా
దక్షిణాఫ్రికా భారత్ ల బాంధవ్యం
ఈనాటిది కాదు
ఇద్దరు మహాత్ముల సాక్షిగా
..... వీరా గుడిపల్లి
15
ఇది వీరా గుడిపల్లి కవిత
14/07/2020
********************
*మనిషి బాగుండాలి*
*****************
తొలకరి వాసన సోకగానే
పుడమిని చీల్చుకుని ఆకాశం వైపు చూశానా
ఎదగని రోజే లేదు
అవనీ సుతగా బంధీనై నీలి నింగి వైపే చూస్తున్నా
అవాంతరాలేంటో అన్నీ నాకే
ముక్కు తో కెలికేవి
మేతకై చూసేవి,తొక్కుతూ పోయేవి.
విరవబడి, నరకబడి,
కొరకబడి దిన దినం చేస్తూ వృక్షానయ్యాక
నాపైనే వాటి ఆటలు, నానీడనే వాటి బతుకులు.
బతికినంత కాలం
బలికి సిద్దంగా ఉండాల్సిన బతుకు నాది
బంకకోసం కాట్లు,బలిపీటకై వేట్లు
రొట్టె పీట,రోకలి బండ
నాగలికోల, ముళ్ళు గర్ర
పందిరి గుంజ,
పట్టెమంచం చివరాఖరికి పాడెకర్రలవసరమైనా... నా వైపే చూస్తున్నాడు.
అవనిసుతగా అన్నీ భరిస్తున్నా
అవధులు మీరిన ఆశతో వాడొస్తున్నా నన్ను నరకడానికి వాడే గొడ్డలి కామనై సహకరిస్తున్నా.
మనిషి బాగుండాలి. బాగుపడాలి.
...... *వీరా గుడిపల్లి*

16.
ఇది వీరా గుడిపల్లి కవిత
15072020
జనసిరులే జలసిరులు
************
విశ్వాంతరాళంలో
ప్రాణికోటి కావాసం ఏది
జనావాస యోగ్యమైన గ్రహమేది
అవతార్ కధలన్నీ
 ఊహలకే పరిమితం చేసిన ప్రాణధార యేది
జనసిరులతో కలకలలాడే భూగోళం మరి

సరస్సులు, నదులు,
వాగులు , వంకలు, జలపాతాలు అన్నీ
ఉప్పు తావులను  వెతుక్కుంటూ పరుగెడుతున్నాయి.
కాటన్ దొర రాకముందు
గోదావరి కడ్డం పడిందెవరు
కల్వకుంట్ల రాకముందు
కాళేశ్వరం దగ్గర నిలబడి గోదావరిని వెనక్కు పిలిచిందెవరు.
నీటి విలువ తెలిసినోళ్ళు కదా
ఉప్పు తావుల్నెతుక్కుంటూ వెల్తుంటే
 చూస్తూ ఊరుకుంటారా
తపతీ,నర్మద, కృష్ణ,
గోదావరి, కావేరీ, ప్రాణహిత, గంగా, గోమతి
జీవనాడులని తెలిశాక
భూగోళం ప్రాణికోటి కావాసమైంది
 జలసిరుల వల్లేనని తెలిసింది

......  *వీరా గుడిపల్లి*
17
ఇది వీరా గుడిపల్లి కవిత
16072020
అంశం:పాఠశాల భద్రత-ఆరోగ్యం
*పిలిస్తే చాలు*
*************************
భద్రత
భావి భారతానికి
తరగతి గదిలో
రూపుదిద్దుకుంటున్న రేపటి సమాజానికి
యల్వోసీని కాపాడుకునే సరిహద్దు భద్రత కాదు
సానిటేషన్ చేయబడ్డ తరగతి
గాలీ వెలుతురు వచ్చేలా
ఆటలకై కాసింత చోటు
మధ్యాహ్నం భోజనం లో
 కనీసం ఓ కూర
పరిశుభ్రమైన వంటగది
ఐరన్ మాత్రలకే పరిమిత మవని
ఆరోగ్య కార్యకర్తల సందర్శన
సొంత పనులు చెప్పని ఉపాధ్యాయ బృందం
కనీసం ఒక గంటైనా
 మాతో గడిపే అమ్మా నాన్నలు
ఈ భద్రత చాలు
బంగారం
అన్న పిలుపేం కోరుకోం
అరే ఒరే కాకుండా
మా పేరుతో పిలిస్తే చాలు
....... వీరా గుడిపల్లి

18
ఇది వీరా గుడిపల్లి కవిత
17072020
 *పాస్*
***************
ఫెయిల్ అంటే ఏంటి
కరోనా అందరినీ పాస్ చేసింది
యేటా ఇలాగే చేస్తే
అంతా మనుషులే మనవాళ్ళే కదా

గడప దాటి రానోడు
వరవరరావు గురించి మాట్లాడుతున్నాడు
కాల్వలంటే తెల్వనోడు
కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు

పాసేంటి ఫెయిల్ ఏంటి
చదువు చెప్పడం ముఖ్యం గానీ
పదిహేడు ప్రశ్నలా ప్రతిభను కొలిచేది...

నీటి ప్రవాహాలను
వెనక్కు పిలవడం యెవడైనా ఊహించాడా
నీవల్లే
 ప్రభుత్వాలు ఎన్నుకోబడుతున్నాయన్న ప్రగల్భాలు పాతరేసే వాడొస్తాడని అనుకున్నావా
నిందలేయడం తప్ప
నీతి నిజాయితీ పదాలేంటో తెలియక
పదాతి దళాల ప్రభావం గుర్తెరుగనోడిని
మాటాడకుండా
మార్చగల మనిషొకడొస్తాడని ఊహించావా...
బక్కోడనుకున్నావే గానీ బలైపోతావనుకోలే కదా
తెలంగాణ తేరుకుంటుంది.
తెర్లు జేయాలని చూడకు
ఈ మట్టి బిడ్డలే కదా.....

అతను పాసయ్యాడు.
.......... వీరా గుడిపల్లి

19
ఇది వీరా గుడిపల్లి కవిత
17072020
న్యాయ వాదుల దినోత్సవం
*******"***********
శీర్షిక ః న్యాయ వాది

అప్పుడెప్పుడో
నాలుగు పాదాలతో నడిచిందట
యుగగానికో పాదం
కనుమరుగై పోతూ కుంటికాలుతో మిగిలి
పాతాళం లో నక్కింది
నోరులేనోడేం పిలవగలడు ఎలా పట్టగలడు
కళ్ళు లేని ప్రతిమ ముందు
నల్లకోటేసుకుని నిలబడి
పాతాళంలో దాగిన ధర్మాన్ని, న్యాయాన్ని
పాతాళ గడియ వేసినట్లు
ఆపన్నుల వాక్కై పిలిచి
గెలిచే దంతా
న్యాయం కాకపోవచ్చు కానీ
కడకు న్యాయమే గెలుస్తుందన్న  *విరోధాభాసాన్ని*
ప్రవచన పరిచే *సత్యాన్వేషి.*
మనుధర్మం నుండి
*మనధర్మం వైపతని ప్రయాణం*
...... *వీరా గుడిపల్లి*
20
ఇది వీరా గుడిపల్లి కవిత
17072020
****************
కొరివి క్రిష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలతో
శీర్షిక ః ఆ ధర్మం

చదివింది అక్కడే
మూలాలవైపెలా వెళ్ళాడో మరి
ఒక్కరినీ వదలడే
వంకరగా మాట్లాడినా వక్రరేఖల్ని సరళ రేఖలుగా మార్చాలనే తన ప్రయత్నం.
మృతదేహాలకు ప్రాణం పోయలేమని
 కొరివి పెట్టడమొక్కటే మార్గమని అతని నమ్మకం.
గణిత గమనం సాగిస్తూ
సామాజిక బాధ్యత మరువలేని బలహీనతే బలంగా విస్తరిస్తున్న కలం
మనసులో మంటలు
చెలరేగుతున్నా తన బుగ్గలు నవ్వుల్ని ప్రసవిస్తాయి.
రాతలు
 విప్లవ జ్వాలలై ఎగసిపడుతున్నా
మాటలు హిమపవనాలే మరి
ఎక్కడ చదివామన్నది కాదు ఎలా చదివామన్నది ముఖ్యం.
ఏం చేస్తున్నామన్నది ముఖ్యం.
ఆ ....ధర్మం పెంచిన బిడ్డే కాని
అధర్మాన్ని సహించే వాడైతే కాదు..
....... *వీరా గుడిపల్లి*

21
పున్నమి కోసం
ఇది వీరా గుడిపల్లి కవిత
18072020
అంశం ః సినీ నటి సౌందర్య
శీర్షిక ః అంతిమ లక్ష్యం
*****************************
నులితీగల
ఆసరా తో పందిరి పైకి పాకడమే
వాగులన్ని కలుపుకుని
ఉవ్వెత్తున ఎగిసిపడ్డా సముద్ర గర్భంలో కలవడమే
ఎన్ని ఏళ్ళిలా తిరిగినా
రేయింబవళ్ళ చక్రం తప్పించుకోలేని భూగోళం లా
రంగులలోకంలో విహరించి
నటనకే వన్నెలద్ది , అభిమానుల ఆరాధ్య దేవతలా వెలుగొందినా...
రాజకీయ చక్రంలోకి రాకతప్పని స్థితి
నాటి రోనాల్డ్  రీగన్ నుండి .....
నేటి తర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వరకు
తప్పూ కాదు తప్పేదీ కాదంటూ
తప్పని స్థితిలో తనపాదం మోపి
కొత్త ఆశలకు ఊపిరులూది
అర్ధాంతరంగా ఆకాశం నుండటే వెళ్లి పోయిన సౌందర్యం
ఆగమైన అంతిమ లక్ష్యం.
..... *వీరా గుడిపల్లి*
22
ఇది వీరా గుడిపల్లి కవిత
19/07/2020
నటకిరీటి
****************
తొందరపడకు సుందరవదనా
అప్పుడున్న దారుల్లో
తప్పనిసరిగా అతనెన్నుకున్నది మంచిదారని
ఆ నలుగురు చూశాకైనా తెలియాలి
తప్పక తానెంచుకున్నది నవ్వుల నటకిరీటం
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు
నటరత్న డాక్టర్ నందమూరిని
ఆదర్శంగా తీసుకుని అడుగులేసి
శ్రేయోభిలాషి గా మారిన వైనం
హాస్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన విధం
వటవృక్షాలనడుమ గుర్తింపు కావాలంటే
గంజాయి సాగు కాదు చేయాల్సింది
పెంచాల్సింది తులసీ వనమన్న
స్పృహతో ఎదిగినోడు
నటకిరీటి
తొందర పడకుండా అడుగలేశిన సుందరవదనుడు.
హాస్యానికి హీరోయిజం కట్టబెట్టిన
రాజేంద్రుడు
...... వీరా గుడిపల్లి

23
ఇది వీరా గుడిపల్లి కవిత
19/07/2020
మహా నటి సావిత్రి
*********************
విజేతలకు విజ్ఞతెంత
లౌక్య లోపం కమ్ముకునేంత
కీర్తికి మంచితనానికి స్నేహమెంత?
పేదరికాన్ని ప్రసవించేంత
ఆటపాటల బాల్యం
అమాయక ఆకాశవిహాయసమై

తెలిసీ
వాడేసిన వాటిపై మక్కువ పెంచుకుని
వాడి పోయే జీవితానికి
బలమైన పునాదులేసుకుంటూ .....

అమృతభాండం ఒలకబోసుకుని
పరిష్కృతమైన అపరిష్కృత కధలో జీవించిన మహానటి

ఎలా ముందుకు వెళ్ళాలో
ఎలా అడుగులు వేయగూడదో రెండింటికీ ఉదాహరణగా నిలిచిన అభినేత్రి.

అమరధామం వీడి వచ్చి
అవనిపై వలసచేసుకుని
అందరికీ ఆదెరువై
ఇమడలేక ఇంద్రపురికి తిరిగెళ్ళిన

మహామనీషి, మన సావిత్రి.
....... *వీరా గుడిపల్లి*

24
ఇది వీరా గుడిపల్లి కవిత
19/07/2020
శ్రావణమాసం
*********"**"
తొలకరితో పులకరించి
ప్రాణాలను పదిలంగా ఎదలో దాచుకుని
ఎంచక్కా పచ్చచీర చుట్టుకుంటుంది పుడమి.
ఐదోనెల హొయలెంతంటే
కోపంతగ్గిన సూరీడు
ఉదయించడానికి నిత్యం సిగ్గుపడుతూ మేఘాలు కప్పుకుంటున్నాడు.
 అన్నా చెల్లెళ్లంతా కలిసి రాఖీలసంబరంలోమునిగి అమ్మానాన్నల కళ్ళల్లో ఆనందం పూయిస్తున్నారు.
 యేకోరికలకైనా పరిష్కారం మోసుకొచ్చిందాయె .నాగుల చవితి పుత్త్రైకాదశి రూపంలో
పంచమ వేదం పాండవుల కధైనా
 పవిత్ర గీతను బహూకరించిన సుత్రధారి
ప్రణయ పరిమళం
 యుగాలలతరబడి నిలిచేలా చల్లిన
 రాధాలోలుని జన్మదినం మోసుకు వచ్చిందీ ఐదోనెల
కాలం కొలమానిగా  కోణమానిలో లంబకోణమై నిలిచిందీ *శ్రావణం*
మన శ్రావణమాసంతో
సమాంతరంగా ప్రయాణించాలనెంత ఆశో!!!!
ఆ జూలియస్ సీజర్ కూ, ఆగస్టస్ కూ
........ *వీరా గుడిపల్లి*

25
ఇది వీరా గుడిపల్లి కవిత
20072020
వారసుడు
*****************
వారసుడే కానీ...
రాజకీయ వారసత్వం
ఆయాచితంగా వచ్చిందేం కాదు
 ఉద్యమ వారసత్వం నుండి
ఊపిరి పోసుకుంది.
ప్రజలతో మమేకమై
 కలిమీలేములలో కలిసి నడిచిన కల్వకుంట్లకు
కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణా బీడు భూముల నుండి వచ్చింది.
ఆగకుండా సాగిపోతున్న గోదావరికి
కాళేశ్వరం దగ్గర కట్టిపడేయాలన్న కసినుండి వచ్చింది
కార్య నిర్వాహక అధ్యక్షుడు
 కల్వకుంట్ల తారక రామారావుకు
అప్పనంగా వచ్చింది కాదీ వారసత్వం.
..... *ఇది వీరా గుడిపల్లి కవిత*



No comments:

Post a Comment

వీరానుగమనం 3

వీరానుగమనం...3 ప్రేమకధ తనగురించి చెప్పాలి‌.ప్రేమంటే తన గురించే చెప్పాలి. టీ తాగాను చెల్లి తెచ్చిచ్చింది. బాలేదని చెప్పి వె...