వీరాస్ పోయెట్రీ 1

******************
1.పరిమళం
2.గెలుపు
3.గులాబి
4.మనసు చెబుతోంది
5.గడప
6.అస్తిత్వం
7.జాగారం
8.మౌన యోగులు
9.అస్తిత్వం
10.హోళీ
11.ఆయనా రిటైరయ్యాడు
12.అబద్దం
13.నేనెవరిని
14.అంబేద్కర్
15.దండం దశగుణం
16.జాము రాతిరి
17.తానుంటాడు
18.రేయన్నది లేకపోతే
19.కరోనా వెల్లిపో
20.ఉగాది
21.పట్టించుకోకు
22.చూడగలగాలి కదా
**************
1
06052020
అంశం *పరిమళం*
*******************
శీర్షిక ః భగవద్గీత

జననం, మరణం
ఇరుదరులై నప్పుడు
దాటాల్సిన ప్రవాహమే జీవితం
కురుక్షేత్రం సాక్షిగా

జారిపోయిన అవకాశాలు
రాలిపోయిన సందర్భాలు
తిరిగిరాని క్షణాలు
మరవలేని అనుభూతులు
పార్థునికీ తప్పలేదు

మనుగడ కోసం తపించి
మళ్ళీ అందుకోవడం కోసం
చేసే ప్రయత్నమే జ్ఞానసాధన
మురళీ రవం తెలిపే సత్యమది

అందుకే....
అస్త్ర సన్యాసం చేసి
చేతులు జోడించి మోకరిల్లిన సందర్భం
చేసిన ప్రతిజ్ఞ
జరిగిన అన్యాయం
అన్నీ మరిచి బేలగా మారి
పలయనానికి సిద్ధమై నపుడు

కర్తవ్యం బోధించిన
నారాయణుడు
*నరుని బుద్ది కద్దిన పరిమళం*
భగవద్గీత
2
అంశం :- గెలుపు
తారీఖు :- 13022020
పేరు:- వీరా గుడిపల్లి
శీర్షిక ః  *గెలిచే తీరాలి*
నేను
*ఓడించాల్సిందెవరూ లేరు*
గెలవాల్సిందొక్కడినే
గెలుపు నా స్వభావం
గెలుపు నా ప్రయాణం
గెలుపు నా ఆహార్యం
గెలుపు నా కంటి చూపు
గెలుపు నా ఇంటిపేరు
*నిరంతర ప్రయాణం*
*నిశ్చల  భవితవ్యం*
*కైౙెన్ ఫిలాసఫీకలవాటు పడ్డ వాడిని*
చుక్కల నడుమ
ఖాళీలొదిలిందెందుకు
*నేను నడవడానికే కదా*
*గెలవాల్సింది నన్నే మరి*
గెలుపు నేను వేరు కాకూడదు
*గెలుపే నేనవ్వాలి*
*నన్ను నేను గెలిచే తీరాలి*
...... *వీరా గుడిపల్లి*
గ్రూపు :-సాహితీశ్రేష్ఠులు
అంశం :- గెలుపు
తారీఖు :- 13022020
పేరు:- వీరా గుడిపల్లి
శీర్షిక ః  *ఓడిపోతావు*
ఓడిపోతావు
*ఇంగువ గుడ్డను*
*ఉతికాననుకోవాలి*
తోక తెగిన కుక్క
మొత్తుకోవడం యెప్పుడాపాలి
ఆశలు చావవు
ఢిల్లీ లో చీపురు మెరవలేదా
*ఆకాశం లో చుక్కల్ని సర్దినోడు*
ఖాళీలెందుకొదిలాడో తెలుసా
మనంనడవడానికే కదా
సర్దుబాట్లతో సంతోషించాలి
ఆశల వెలుగులో అడుగులు వేయాలి
నిన్ను నీవు గెలవకుండా
నావైపు రాకు
ఓడిపోతావు
మళ్ళీ మళ్ళీ ఓడిపోతావు
..... *వీరా గుడిపల్లి*
ప్రేమికుల దినోత్సవం
అంటే యేంటి
నేను శ్వాస తీసుకోవడంమొదలైన రోజా
నా శ్వాస తానే కదా
నేను అడుగులు వేయడం మొదలెట్టిన రోజా
నా అడుగులు తనకోసమే కదా
నా హృదయం
నీలా ఉండడం నాకు ఇష్టం
నాలా ఉండడం నాకు అవసరం
ఇది ఒక సినిమా డయలాగ్
3

అంశం :- గులాబి
తారీఖు :- 17022020
పేరు:- వీరా గుడిపల్లి
శీర్షిక ః  *తానున్నాడు*
తాను న్నాడు
తారా సమూహం నుండి వేరుపడి
విశ్వ వీక్షణం చేసే తోకచుక్క లా
ఎవరొస్తారో తెలీకున్నా
దాహార్తులు నిరాశపడగూడదని
ఏర్పడిన ఒయాసిస్ లా
తాను న్నాడు
తనచుట్టూ తాను తిరుగుతూ
రేయింబవళ్లకు కారణమౌతూ
ఫలితమంతా సూర్యునికాపాదించే ధరిత్రి లా
తాను న్నాడు
సమస్త చరిత్ర ను
నిక్షిప్తం చేసుకుని భవిష్యత్ భద్రతకు భరోసానిస్తూ
ఎవరికీ అర్థం కాని కృష్ణ బిలంలా
తానున్నాడు
ఈ ప్రపంచానికి
అందం
ఆశ
అవసరం
ఐశ్వర్యం
అన్నీ తానై
తూర్పు కొండల్లో ఉదయించే
*ఎర్ర గులాబీ లా*
తాను న్నాడు
సంధ్యాకాంతులు మాయమయ్యేవేళ
ఆకాశంలో పొటమరించే
*తెల్లగులాబీలా*
తాను న్నాడు
తాను న్నాడు
4
మనసు చెబుతోంది
తూర్పు కొండల్లో
పూసిన గులాబీని ప్రథమ స్థానంలో వుంచారు
*శ్రీ ధర్ మణికంఠ గారికీ*
*సాహితీ శ్రేష్ఠులు అందరికీ*
ధన్యవాదాలు
గెలుపెప్పుడూ
పెదాలపై చిరునవ్వు ను మొలిపిస్తుంది.
ఎన్నిసార్లు విజేతగా నిలవలేదు
ఐనా సరే
ప్రతీ సారి అదే మొదటి సారైనట్లు
తొలకరి చినుకులు పుడమిని ముద్దాడినపుడు పొంగిన నేలలాగ
నదీసాగర సంగమంలో ఉయ్యాల లూగే కూలని అలలాగ
ఆనందం
గడప దాటుతుంది. పెదాలు కంటి వెలుగులో మెరిసిపోతున్నాయి
*ఎగరమాకేయని మనసు పదే పదే చెబుతూనే ఉంది*
జొన్న కంకి దులుపుతున్నపుడు రాలేనుసి నేలనెంతకీ చేరదేంటనుకునే వాడిని
చాలా సమయం పట్టేది
అక్షరాలు తెచ్చే పులకరింత
కనిపించకుండా ఎదిగిన కందగడ్డను మునిపళ్ళతో కొరికినపుడు
ఆనందాన్నిస్తుందని మళ్ళీ తెలి‌సింది
గుర్తింపు తెచ్చే పులకింత స్వభావమది
......*వీరా గుడిపల్లి*
5

అంశం :- గడప
తారీఖు :- 18022020
పేరు:- వీరా గుడిపల్లి
శీర్షిక ః  *మా గడప*
కాలానికి కరువొచ్చినా
కలతలఏకాంతాలు కలవరపెట్టినా
కరుణతో రమ్మని పిలుస్తోంది
కాసంత సేద దీరమంటోంది
*గడప*
పొద్దున్నే తననలంకరించే తనంటే ఎంతిష్టమో
నిత్యం తనతోనే సావాసం
నా అడుగుల సవ్వడి వినపడితే చాలు
గడపతో తన ఆనందాన్ని పంచుకుంటుంది తాను
*కబుర్లన్నీ గడపతోనే చెబుతుంది*
నాకోసం
*నిత్యం తనెదురు చూసేదక్కడే*
గడపంటే తనకంతిష్టం
*నాకంటే కూడా*
గడప దాటడమంటే
బాధగా ఉంటుంది
ఎంతెదిగినా
ఎక్కడ తిరిగినా
గడప చేరితేనే ఆనందం
చిన్నప్పుడు అమ్మ
ఇప్పుడు తను
నేను గడపొదిలితే చాలు
తిరిగొచ్చేవరకు అక్కడే
నేను చెక్కిన శిల్పం
తను మొక్కే దైవం
ఆ గడపే
మా ముగ్గురి ఆనవాళు
చెల్లి చేతుల్తో కొలువైన ఆగడపంటే నాకిష్టం
*మా గడప కుటుంబ బంధాల కూడిక*
*మనసుల మణిహార మాలిక*
...... *వీరా గుడిపల్లి*
6
21022020
*న అస్థిత్వం*
*మహా శివరాత్రి ప్రత్యేకం*
వినగలగాలంతే కాని నీవు వినిపించనిదెక్కడ
ఓంకారము ధ్వనించంది యెక్కడ
కనగలిగే మనసుండాలి గానీ నీవు కనిపించనిదెక్కడ
నీవుకానిదంటున్నది యెక్కడ
నేనంటున్నంతకాలం నీవుంటావు
నీవున్నంతకాలం నేనుంటాను
మనమున్నంతకాలమే యేదైనా
మనం లేని కాలం ఉంటుందా
కాలమే మనమై సాగే స్థితి కాదు
మనంకాలమై నడవాలి
ద్విమితీయం, త్రిమితీయం, కాదు అమితీయం ... మితులకతీతం
మనల్ని మాట్లాడిస్తారట
మనం మాట్లాడనిదెపుడు
వినలేకపోవడమైయుండొచ్చు.
శిలలో వెతికే పనిలో ఉన్నారేమో
శిలైపోయామా??? ఔనులే శిల కాకుండ పోతామా
చలనంలో లేనిది నశిస్తుంది
నాశనమవడమంటే రూపాంతరమే కదా
మహా శివరాత్రి .
మనకు ప్రీతికరమట.
ప్రతీ శివరాత్రి.....
ఉనికిని గమనిస్తే ద్వైతం
లేదంటే అద్వైతం......
అంతిమంగా..... న అస్తిత్వం.
........ *వీరా గుడిపల్లి*
7
21022020
*శివరాత్రి జాగారం*
అవకాశం వదులుకోను
ఎంత
తపించినా కునుకేరాలేదిన్నాళ్ళు
ఇంకా యేనాడైనా
పగలే నిద్ర బోవడమన్నది కలే కదా
ఈనాడే మైంది ?? ఈ నిద్రేమిటి?
అలా ముంచుకొస్తుంది
తినకుండా
పనులు చేస్తూ నిరాహారంగా
ఎన్నిసార్లు లేను
తన తిట్లు కనీసం లెక్కించకుండా
ఈ రోజెందుకిలా
పదే పదే తిండిపైకి మనసు పోతుంది
యేమైందీరోజు
ఆటలాడేటపుడు
అన్నంపై ధ్యాసే ఉండదు
ఆటాడించే వాడికోసం ఉపవాసమింత కష్టమై పోయింది
పుస్తకం పెడితే చాలు కల్లు మూతలు పడేవానాడు
ఆటలాడుతూ నిద్రే మరచి అమ్మ పిలుపందుకున్నా దిగులే తప్ప నిద్రే రాకుండేది
ఈ నాడేంటి?
పదే పదే నిద్రా దేవి తన ఒడిలోకి ఆహ్వాని‌స్తోంది
కష్టమైనా నిరాహారంగానే ఉంటా
తప్పనిసరిగా నిద్రనసలే దరికి రానీయను
అవకాశం వదులుకోవడం అసలే ఇష్టం ఉండదు.
....... *వీరా గుడిపల్లి*
8
మల్లినాధసూరి కళాపీఠం కోసం
*ఇది వీరా గుడిపల్లి కవిత*
*మౌన యోగులు*
మాట్లాడకుండా
ఉండడమేనా మౌనమంటే
*ప్రకృతి నీవు అభిన్నాలని తెలుసు కోవడం*
కదలకుండా
కూర్చోవడం మాత్రమేనా   యోగిత్వం
*మనసును మనసే కట్టి పడేయడం*
పంచేంద్రియాల
ఆశలను మన్నించడమేనా   భోగం
*ఆశలను మొలకెత్తనీయకుండా చేయడం*
దేహం నియంత్రణ లో లేకపోవడమమేనా  రోగం
*మౌనం,యోగం,భోగం సాధించక పోవడం*

ప్రజారంజక పాలన అందించిన జనకుడి మాట మౌనం
జానకిని
కూతురు గా పెంచిన తనది యోగం
ప్రజారాజ్యం అందించిన అతడి చేతన భోగం
*జనకుని స్వభావం అలదుకున్న ఆత్మలే కదా*
*మౌనయోగులు*
........  *వీరా గుడిపల్లి*
9
*మహిళా దినోత్సవం సందర్భంగా*
     *వీరా గుడిపల్లి కవిత*
          08032020
       *నవ్వైమొలకెత్తాలి*
ఆడ‌సగం ఈడసగం
ఇది పాలోల్ల కొట్లాట గాదు
చెరో సగమైతేనేకదా సంపూర్ణ త్వం
కళ్ళు రెండైనా
ఒకే దృశ్యాన్ని  చూస్తాయి
చెవులు రెండైనా
ఒకే మాట  వింటాయి
మనమూ అంతే కదా
ఆధిపత్య దృష్టి ఎక్కడిదసలు
మనంగా సాగనినాడు
మనుగడుంటుందా
మనిషి గా చూడనినాడు
మనిషెలా అవుతాము
సగం కాదు తల్లీ
సాంతం నీవే.....
నేను నీ నుండి తెగి పడిన ముక్కనమ్మా
నీలో భాగాన్ని
సృష్టి నీవు... సృష్టి లో ఓ భాగం నేను
*నీవూ నేను వేరన్న మాటే రుచించదు నాకు*
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
*ప్రతి రోజూ నీదై తీరాలి*
*ప్రతీ క్షణం నీ నవ్వై మొలకెత్తాలి*
............ *వీరా గుడిపల్లి*
10
హోళీ
నాకు రోజూ హోళీ పండగే
నిత్యం తన నవ్వుల్ని చల్లుతుంది
రోజూ అడుగుల శబ్దం
హృదయం లో గుప్పుతుంది
పలకరిస్తూ ప్రతి క్షణం
పులకరింతల్నలదుతుంది
మనసంతా సప్త వర్ణాల సింగిడే
తాను కలిసిన ప్రతీ క్షణం హోళీయే
*అతనూ రిటైరయ్యాడు*
*ఇది వీరా గుడిపల్లి కవిత*
ఆయన
ఆయన కూడా రిటైరయ్యాడు
ఇదేం చోద్యం ఆయన కూడా రిటైర్ అయ్యాడు
పనిలో అలిసింది లేదు
బాధ్యత మరిచింది లేదు
చిరునవ్వు వదిలింది లేదు
ఐనా
ఆయన కూడా రిటైర్ అయ్యాడు
ఆడలేనోడు కాదు
ఆట మరిచింది లేదు
ఓడిపోయినోడు కాదు
ఓటమి తెలిసినోడు కాదు
ఎన్ని మండలాలు ఇచ్చినా
ఎందుకనలేదు
ఏ స్కూలు కు వెళ్ళినా
తన ముద్ర వేయకుండా రాలేదు
ఆయన కూడా రిటైర్ అయ్యాడు
అధికారుల్లో నాయకుడిగా
నాయకుల్లో అధికారిగా
మనం అనుకున్నామే కానీ
ఎక్కడైనా
ఉపాధ్యాయునిగానే తానున్నాడు
అయినా
ఆయన కూడా రిటైర్ అయ్యాడు
rajaram
అదో యం ఈ వో పేరు కాదు
రాజారామ్ అతనో ఆత్మీయ నేస్తం
రాజారామ్
హెడ్మాస్టర్ పేరు కాదు
కలిసి పనిచేసిన సహోపాధ్యాయుని పేరు
రాజారామ్
అతనో మిత్రుడు
సలహాదారుడు
మార్గదర్శి
ఉపాధ్యాయులందరికీ
ఏ సందేహం వచ్చినా
ఠకీమని గుర్తొచ్చే పేరది
అతనూ రిటైరయ్యాడు
అందుకే మరి
పది రోజుల ముందు నుండే ప్రపంచమంతా మూగబోయింది
లోకమంతా తనకు తానే లాక్ డౌన్ ప్రకటించుకుంది
....... *వీరా గుడిపల్లి*
ఇది వీరా గుడిపల్లి కవిత
అదేంటో గాని
నేనెప్పుడూ అబద్దమాడలేదు
ఇప్పుడేం రాయాలి
తననడగండి
కావాలంటే ఒక నవ్వు నవ్వుతుంది
పెళ్ళైన కొత్తలో చెప్పాను
వంట రాదని
నన్నెప్పుడూ వంటగదిలో కే రానివ్వలే
తనకు తెలుసు నేను అబద్దమాడనని
తను దొరకడం
నా అదృష్టం అన్నప్పుడల్లా
నన్నల్లుకు పోతుంది
తనకు తెలుసు
నేనబద్దం చెప్పనని
యేనాడూ
తనవంట బాలేదని అనలేదు
తనూ కాదనలేదు
తనకు తెలుసు నేను అబద్దమాడనని
నాఅంత అమాయకుడుండడని అంటుందెప్పుడూ
నేనూ కాదనలేదు
నాకు తెలుసు
తను అబద్దం చెప్పదని
నమ్మండి బాబూ
నేనెప్పుడూ అబద్దమాడలేదు
ఇప్పుడు అబద్దం చెప్పమంటే నావల్ల కాదు
అందుకే కవిత రాయలేదు.. 
13

నేనెవరిని
మూలాల వెతుకులాట చేసేదెవరు
ప్రతిబింబానికి ప్రాణం
తెరపై భీభత్సం
చూసేదెవరు? చూపే దెవరు?
ఎగిసిన మంటలు యేమౌతున్నాయి
ఎమ్సీస్క్వేర్ లో ఈయెందుకు కనిపించదు
చూసేదెవరు చూపేదెవరు
తరగని శోధన ఆగని శోషణ
అందని కోణపు కొలతలు
వేసేదెవరు? కొలిచేదెవరు??
మేనే నీవా,నీవే మేనా
ఎక్కడినుండొచ్చానో ఎందుకని వచ్చానో
నాకు భిన్నంగా యేమీ లేదు
నేనంటే సమస్తం
సమస్తం నేనే
ఈ నేనులెన్ని నేనులుగా చూస్తున్నా
సరే
............. *వీరా గుడిపల్లి*
ఇది వీరా గుడిపల్లి కవిత
14
అంబేద్కర్
15042020
************
మూతికి
బుట్లుగట్టి ఉరికించిన రోజులు
వరపుత్రులమంటూ
జబ్బలు చరుచుకున్నోళ్ళు
ముట్టుకుంటే
మురికైతామని తరిమికొట్టిన వాళ్ళు
సాటి మానవులనే
బానిసలు గా బాధపెట్టి న వాళ్ళు
నాగళిబట్టడం రాకున్నా
నాలుగు వందలయెకరాలు కబ్జా బెట్టినోళ్ళు
దేవున్ని కూడా
కులాల నడుమ పంచాలని చూసినోళ్ళు
మంచితనమంటే
తెలియనోళ్ళు,మానవత్వం మరిచినోళ్ళు
మనిషి గా
పొరపాటు నా పుట్టినోళ్ళు
యెవరు  ? యెందుకు భయపడ్డారు?
చీకట్లను
తరిమే కాంతి రేఖ మొలిచినందున
బకాసురుల
భరతం పట్టే భారతీయుడు కనపడినందున
తూర్పు దిక్కున
ఎవరూ మోయలేనంత జ్ఞానతేజం అంబేద్కర్ గా అవనిపై అడుగేసినందున
బాబాసాహెబ్ గా
భరతావనిలో భాసిల్లినందున......
...... వీరా గుడిపల్లి
15
*️⃣*️⃣*️⃣
వీరా గుడిపల్లి కవిత
19042020
దండం దశ గుణం...
************************"
కరోనా కరోనా
ఏమంటుందీ కరోనా
చేతులు కడుక్కోమందీ
మూతులు మూసుకోమంది
కండ్లు నలుమొద్దంది
తుమ్మేవాడికి దూరముండమంది
దగ్గేవాడి దగ్గరుండొద్దంది
పనిలేకుండా తిగొద్దంది
పరిశుభ్రతే ప్రాణమంది
కొత్తగేం చెప్పిందీ కరోనా
అన్నీ బామ్మ చెప్పినవే
బతిమాలి చెప్పింది బామ్మ
వింటేనా
భయపెట్టి చెప్తుందీ కరోనా
వినక ఛస్తానా
దండం దశ గుణం భవేత్
అన్నారంట కదా!!!!!
******* *వీరా గుడిపల్లి
16.
24/04/2020
శీర్షిక ః జాము రాతిరి
జాము రాతిరి అంటే నిఘంటువు అర్థం
(సూర్యాస్తమయం అయ్యాక మూడుగంటల తర్వాత సమయం జాము రాతిరని)

*ఆసమయంలో......*
అలసిన మనసు
సొలసిన దేహం
వడలిన భావం
అరమోడ్పు నేత్రాల మాటున
ఆఖరి మజిలీని తలపించేలా
నిశ్చింతగా నిశ్చలంగా
దేహాన్ని వదిలి దూరంగా
రోజూ ఇదే తంతు
తీరని కలలు
నెరవేరని ఆశలు
కోరిన రూపంలో
కనురెప్పల మాటున కాసేపు
రోజూ ఇదే తంతు
ఆక్షణాలే కదా
రేపటి కూపిరులూదేది
నేటిని నెమరేసుకునేది
ఖగోళంలో భవిష్యత్తునువెతుక్కునేది
ముందడుగుకు ప్రణాళికలు
మురిపాలకు ఎదురు చూపులు
*జాము రాతిరి సోయగం తెలియాలంటే*
*జామురాతిరేకాంతంలోనే*
అందాలు పుష్పించే కాలమది
అక్షరాలు పరిమళించే క్షణాలవి
********** *వీరా గుడిపల్లి*
17
తానుంటాడు

మాటే మంత్రమై
చూపే ఆయుధమై
నీవెంటెప్పుడూ తానుంటాడు

పలుకే పరిమళించి
మురళీ రవమై నిన్నలదకుని
నెమలి పింఛమై
 తలపులు గా మారుతాడు

నడిపించే భగవద్గీతై
యశోదమ్మ ఆనవాళుగా
అడుగడుగునా అగుపిస్తాడు

కురుక్షేత్రం నడిపించిన
శాంతి దూత రూపంలో
బర్బరీకుని సాక్షి గా
మనవెంటే తానుంటాడు

సంపూర్ణ శరణాగతి
కోరితే తప్ప
కోకలు ప్రసాదించని
 భక్తవత్సలం గా తానుంటాడు

రాజకీయపు
పౌరాణిక మనో స్మృతి చిహ్నంగా
మన మధ్యే తానుంటాడు

 కృష్ణాయని
వాలిన రుక్మిణి లేఖలా...
మనసంతా తానుగా మారితే
మనవెంటే తానుంటాడు.

........ *వీరా గుడిపల్లి*

18
ఇది వీరా గుడిపల్లి కవిత
31032020

ఏమని చెప్పేది?????
రేయన్నది లేకపోతే
ఎపుడో పోయేవాన్ని
విశ్రాంతి
విశ్లేషణ
ప్రణాళిక
అన్నీ అప్పుడే
ఎంతటి పనైనా
చేయగలననే ధైర్యం లభించేదపుడే
అభిమన్యుడు ఆవహించి
ఆ కాసేపు ఉపశమనం కలిగిస్తుంటాడు
పద్మవ్యూహాలను ఛేదించే
ప్రణాళికలు ప్రాణం పోసుకునేదపుడే
రోజంతా ఎలా గడిచిందో సమీక్షించుకునే దపుడే
రేయన్నది
నాకెప్పుడూ స్వయం శిక్షణా శిబిరం
రేపటి కోసం నన్ను నేను తీర్చిదిద్దుకునే అవకాశం
రేయన్నది
లేకపోతే నేనన్నమాటే లేదు
నీ గురించి ఆలోచించే క్షణాలవే
నా గురించి మననం చేసుకునేదీ అప్పుడే
ఏమని చెప్పేది????
రేయన్నది లేకపోతే నేనేమై పోయేవాడినో
....... వీరా గుడిపల్లి






19
ఇది వీరా గుడిపల్లి కవిత
21032020
*కరోనా... వెల్లిపో*

యేంటా కంగారు
కరోనా యేమైనా రాక్షసిలా కనిపిస్తుందా
అవును మంచి చెప్పే మామ్మను పరిహసిస్తావు
బుద్దులు చెప్పే ఒజ్జను మనసులో తిట్టుకుంటావు
అమ్మ కంటే యెవరురా నీకు చుట్టం
ఒక్క మాటిన్నావా
నాన్న కంటే యెవడురా నిన్ను ప్రేమించేది
పాపం ఎప్పుడన్నా తను చెప్పినట్లు చేశావా
నోరు లేని ప్రేమికులు

బూచాడు లేడని తెలియదా
నువ్వు బువ్వ తినాలని కదా అబద్దం చెప్పింది
చందమామ వస్తుందా
నీ సంతోషం కోసం కదా జాబిల్లి రావే అని పిలిచింది
చేయివ్వడం తప్పని కదా జోడించమన్నది
సంస్కారం నేర్పడాన్ని సాంప్రదాయ మన్న విషయం నీకర్ధం కాదాయె

కంటికి కనిపించని వైరస్ శివాలెత్తి వచ్చింది
బామ్మ మాట జ్ఞాపకం చేస్తుంది
కరోనా కరవాలం
నాన్న మాట వింటే శాంతిస్తా నంటుంది
కోవిద్ కోపం
సాంప్రదాయ పద్ధతులను స్వాగతిస్తే పోతానంటుంది

రోగం కాదు కరోనా వైరస్
రాగాలు పలికించడానికి,
అమ్మ మాట జ్ఞాపకం చేయడానికి
నాన్న అడుగు జాడలు వెతుక్కోడానికి
బామ్మ యాదిలో బతకడానికి
బడితె పట్టి బెదిరించే .... ఆత్మీయ అతిధి
కరోనా

 దారి తప్పిన వారిని
 దారిలో పెట్టడానికి వచ్చిన మార్గ దర్శి
ప్రాణం తీసైనా సరే పద్దతులు నేర్పిస్తుంది.
కరోనా కు కరములు జోడిస్తున్నా

నీవు చెప్పినట్లు వింటా
నా ఇంటికి రాకు ఒంటిని ముట్టకు
మాట తప్పితే మల్లీ వద్దువు గాని వెల్లిపో ... please
..,.... Veera gudipally

20
*ఇది వీరా గుడిపల్లి కవిత*
24032020
 *ఉగాది*
ఉగాది సృష్ట్యారంభమంటారు
 నమ్మకాలనెప్పుడూ ప్రశ్నించలేం
 నమ్మకాలను ఎప్పుడూ ప్రశ్నించాలేం

 స్వీకృతాలకు ఋజువులుండవు
 ప్రకాశించే సత్యమే స్వీకృతం

 ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత
వికారి శార్వరి ... ఇలా ఓ అరవై
పదే పదే నా చుట్టూ తిరుగుతుంటే
 చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాడం
మరో పన్నెండు యేటేటా కలిసెల్తుంటే
నక్షత్రాలు ఇరవయ్యేడు
 నా జాతకాన్ని రాస్తా యట

 ఆది సోమ మంగళ ఈ ఏడూ
 వారానికోమారు
 పలకరిస్తూ ఉపవాసాలు చేపిస్తుంటే
గంటలు  నిమిషాలు సెకన్లు
ఘడియలు విఘడియలై
రాహుకాలం యమగండం
రాసి పెడుతుంటే

నేను గీసిన గీతలే
నన్ను భయపెడుతుంటే
పంచాంగం తెరవాలంటే భయమౌతుంది
కరోనా గురించేం భయం లేదిప్పుడు
యెక్కడి పాటక్కడ పాడే
 జాతకాల గురించే

ఈ ఉగాదికి క్వారంటైన్ పాటిస్తా
ఆశ పెట్టే ఆదాయం
భయపెట్టే వ్యయాల లెక్కలకు దూరంగా
ఐసోలేషన్ పాటిస్తా.

యెవరో
ఆడించే ఆటలో పావులౌతున్న
అమాయకులకు
 యెంత తెలివుంటేనేం .....
వేటకుక్కల బారినపడ్డ కుందేలు పరుగేకదా
......... *వీరా గుడిపల్లి*
21

✳️✳️✳️✳️✳️
ఇది వీరా గుడిపల్లి కవిత
17092019
 *పట్టించుకోకు*
 కంపముల్లను
 దాటుకుంటూ కదిలిపో
 పంట చేలవైపు పయనమాపకు
 విరి చేయాలనో,కాల్చేయాలనో
కాలయాపన చేయకు
 సహజ గుణం
 సహనమవసరం. పరిమళిస్తూ ప్రయాణించు
 కాల్చాలని చూస్తే కంపు భరించాలి
 విరి చేయాలనుకుంటే సాత్వికతను కోల్పోవాలి
దాటుకుంటూ వెళ్ళిపో
 నవ్వుతూనే సాగిపో
 పనికిరానివి పట్టించుకోకు
ఒక్కటి కోల్పోతే
వందవకాశాలు ముందుంటాయి.
ఒక్కరు కాదంటే
నీ దారి నచ్చినవాల్లు  వందమంది నీవెంటొస్తారు
 నీకు పోటీ నీవే కావాలి
 విజయం నీదై నిలవాలి
..... *వీరా గుడిపల్లి*
22.
27032020
*చూడగలగాలి కదా*
ఈ ద్వారాలెపుడూ తెరిచే ఉంచాలట
మూసిందెపుడని...
ఈ హృదయం ఎప్పుడూ లబ్ డబ్ మంటూ శబ్దిస్తుంది
నీవున్నా వనే కదా...
వెల్లి పోయావనుకుంటున్నారు
మల్లీ వస్తావని ఓదారుస్తున్నారు
తూర్పు తెలవారగానే నను తడిమే వేకువ రేఖ నీవే నని తెలియదా
నారూపు కట్టని ఒక్క అక్షరం రాయలేవని తెలియదేమో
నేలంతా మేనై పరుచుకున్నాక
నీ ప్రతి అడుగూ నాపైనే కదా
యెక్కడికి వెల్లి పోతావు నాలో నే అటూఇటూ తిరుగుతుంటావు.

ఎన్ని జతల కళ్ళు ఆశగా చూసినా
నిరాశే మిగులుతుంది... నిజం తెలియాలంటే నిజాయితీ గా చూడగలగాలి కదా...
.....  *వీరా గుడిపల్లి*




No comments:

Post a Comment

వీరానుగమనం 3

వీరానుగమనం...3 ప్రేమకధ తనగురించి చెప్పాలి‌.ప్రేమంటే తన గురించే చెప్పాలి. టీ తాగాను చెల్లి తెచ్చిచ్చింది. బాలేదని చెప్పి వె...