Monday, April 13, 2020

వీరానుగమనం 4

వీరానుగమనం..4
నిజాయితీగా చెప్పాలొకమాట
విద్య
ధనం
అధికారం
అందం
ఆరోగ్యం
భక్తి
ప్రతీ ప్రతిభ
 గర్వాన్ని పెంచేదే
మనసు బలహీనమైనపుడు
.... ఒక పవిత్ర గ్రంథం లోని మాటలివి

 వీరానుగమనం 4
నిజాయితీగా చెప్పాలొకమాట
విద్య
ధనం
అధికారం
అందం
ఆరోగ్యం
భక్తి
ప్రతీ ,ప్రతిభ
 గర్వాన్ని పెంచేదే
మనసు బలహీనమైనపుడు
.... ఒక పవిత్ర గ్రంథం లోని మాటలివి
వాటిని జయించిన వారెందరినో 
నేను చదివే ప్రయత్నం చేశాను. 
నాకు వారు అర్థమైనంత వరకు వారి గురించి మీతో పంచుకునే ప్రయత్నమే
  యీ వీరానుగమనం నాల్గవ భాగం
ప్రతీ జనవరి ఇరవై ఐదున ఒక దీర్ఘ కవిత సమర్పించడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాలుగా
వీరానుగమనం 1,2,3
ఇప్పుడు 
వీరానుగమనం దీర్ఘ కవిత
నాల్గవ భాగం
నన్ను ప్రభావితం చేసిన అని అనను గాని
గొప్ప ప్రభావం చూపిన వారని అనగలను.
అలాంటి వారి గురించి
మీతో పంచుకోవాలనే ఆలోచన అంతే
***********
అలాంటి వారిలో వృత్తి గతంగా
అనేక పరిచయాలు ప్రభావాలు 
మొదట నారాయణ రావు గారి తో ప్రారంభిస్తాను.
1
********************

ఈరోజు నా పుట్టిన రోజు
ఐతేనేం
ఈ రోజు 
నేనొక్కడినే పుట్టానా‌‌...
ఇదో మిష 
మీ గురించి నాల్గక్షరాలు నల్గురితో పంచుకోవడానికి
నా ప్రయాణంలో తారసపడి
జ్ఞాపకం గా మిగిలిపోయిన 
కొన్ని సందర్భాలు
మననం చేసుకుంటూ
సాగిపోవడం
అపురూప చిత్రాలనోసారి
ఆవిష్కరించుకోవడం
అందమైన
అడుగు జాడలనలా 
చూసుకోవడం

1

మిమ్మల్ని 
జ్ఞాపకం చేసుకోవడమే ఈనాడు నాకు పండుగను కుంటాను
కన్నుగీటి కన్నేసి కలతలు రేపి
కమతాలను కొల్లగొట్టిన వారిని కూడా
కరుణతో తడిమి
వాత్సల్యం పంచిన ప్రేమమయి 
అప్పటి వరకు
 మీరెవరో తెలీదు
ఇప్పటి వరకెందుకు 
కలవలేక పోయానో కానీ
ఇప్పుడైనా
 కలిసినందుకు సంతోషం కాదు ఆనందం కలిగింది
ప్రతీ క్షణం
యేదో నేర్పుతూ
నానుండే
నేర్చుకుంటున్నా నంటూ 
నాకు విలువలనాపాదిస్తుండే
మీరు 
ఎప్పటికీ మదిలో మెదిలే ఆత్మీయ నేస్తం.

క్రమశిక్షణ నడిచి వస్తున్నట్లనిపించేది
మీఅడుగులు కనబడినా
శబ్దం వినబడినా

కనుమరుగవుతున్నాయనుకున్న విలువలన్నీ
కంటికెదురుగా కుదురుకుని కనిపించిన మానుష రూపం
దర్షనమిచ్చిన రోజింకా గుర్తుంది
మే తొమ్మిది రెండువేల సంవత్సరం
స్కూలసిస్టెంట్ గా
మీ స్థానంలో నేను చేరిన రోజది

ఆకాశం లో 
హరివిల్లు ఎన్ని అద్భుతాలకు ప్రాణం పోసిందో గానీ
ఉపాధ్యాయ లోకానికి
మార్గదర్శకాలను
 ఊట చెలిమెగా అందించిన 
మీకంటే గొప్పది మాత్రం కాదు
గణిత బోధనలో
మీరవలంబించిన మార్గం
నా మనో ఫలకం పై వేసిన ముద్ర
నేనేనాడూ మరిచిందే లేదు
నా గణిత గమనం 
మీ చేతిసంచిలో చివరి వరకూ మోసి
అందించిన ప్రేరణ ...
ఆల్కలైన్ వాటర్ లా
అమ్మ చేతి స్పర్శ లా
సముద్ర స్వరంలా
పసిపాప నవ్వులా
చేతల్లో నే తప్ప
ప్రచారార్భాట మెరుగని తీరు
ఎప్పటికైనా మరిచేదెలా

వెలుగు రేఖల వెతుకులాట లో
ప్రతిభా మేరువు... ప్రయాణ సాధనం
మేడవరపు నారాయణరావు.

మర్రి ఊడ లాంటి 
మహిమాన్వితమైన ఆదెరువు
నా జీవిత యానంలో....
ఓ మరపు రాని సహవాసి
లోకానికి 
అవసరమైన బంధం
గుర్తింపు 
కోరుకోని అనుబంధం
కొలనుపాక లో పనిచేసిన కాలం
ప్రధానోపాధ్యాయులు గా 
మీరు
సహోపాధ్యాయునిగా నేను
విద్యా వనాన్ని సృష్టించిన తీరు
యెప్పటికీ... మరువలేని జ్ఞాపకం

ఎన్ని సవాళ్లు ఎదురైనా
ఎదురొడ్డి నిలిచి
ప్రతిభావంతుల నందించి
సమాజ శ్రేయస్సు కాంక్షించి
కడదాకా పోరాడిన
యోధుడినెలా మరవగలరు యెవరైనా
విద్యా గంధం పంచడంలో
ప్రభుత్వ రంగానికి
పెను సవాళ్ళెదురౌతున్న తరుణం
కబలింపు వేటగాళ్లను
 ఛేదించిన ధైర్యం
యెప్పటికీ బ్రతికే ఉంటుంది.

మీరెప్పటికీ
నా జ్ఞాపకాలలో చిరంజీవి
మీతో కలిసి పనిచేసిన క్షణాలు
వృత్తిగత జీవితం లో
ఎదురైన సందర్భాల్లో
జీవించిన ఓ సందర్భానికి
పొందిన జ్ఞానం 
 love you sir

రెండవ వారం 
సత్య నారాయణ రెడ్డి గారు 
2
**************
అప్పుడే యాడాదైపోయింది.
జనవరి 25 2023 వచ్చేసింది.
నిజానికి ఈ సంవత్సరం నేను ఉద్యోగ విరమణ చేయాల్సిన సంవత్సరం.
Officially crossed 58
మరో మూడేళ్లు 
ఉద్యోగం చేయమని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో సరే అన్నాను.
పుట్టిన రోజూ పండగే కదా
మనకు కాక పోయినా 
మనల్ని ప్రేమించే వాళ్ళకు

అలాంటి వారితో 
నా జ్ఞాపకాలు పంచుకోవడం అలవాటు.
ఈ పర్యాయం
నా ప్రయాణంలో తారసిల్లిన ఒకరి గురించి పరిచయం చేస్తా.

ఊరకుండడమే ఉత్తమ లక్షణమన్న రమణులను
 దారి తెలియకుండానే అనుసరించిన 
మనిషి తో పనిచేయడం నిజంగా గొప్ప విషయం. 

తానేమీ 
బోధించలేదు
 నీతులు వల్లించలేదు.
తానసలు
పనిచేసినట్లే అనిపించేది కాదు
నమ్మరు కూడ 
ఎవరి గుర్తింపు నాశించకుండా
తనపని తాను చేసుకుంటూ పోతుండేదంతే
జరిగేది చూస్తూ ..
అందువలననేమో
తాను పనిచేసినట్లు అనిపించేది కాదు 

నిందలు భరించడమేతప్ప నీతులుచెప్పింది లేదు
నిగ్గదీసి అడిగినా 
తడబడింది లేదు తప్పు చేసింది లేదు
అగ్ని పరీక్షలో సహితం అలవోకగా నెగ్గినా ఎగిరిపడింది లేదు.

తనేదీ చెప్పేవాడు కాదు,ఆదేశించే వాడు కాదు 
కానీ తన ప్రతీ చర్య మనకేదో సందేశం ఇస్తుండేది.
జీవిత సత్యం తెలుపుతుండేది.
పలుకు పలకడం తెలియదు కానీ
సంస్థాగత వ్యవహారాలు చక్కదిద్దిన తీరు అమోఘం.
ఆ గొప్పతనం ఎవరు క్లైయిమ్ చేసుకున్నా తనకు పట్టేదే కాదు.

క్రీడల్లో జాతీయ అవార్డులు
గణితంలో అవధానాలు
ఉచిత విహార యాత్రలు
డిజిటల్ క్లాస్ ఏర్పాటు
Out side campus treats పై నిషేధం
తెలియకుండానే తెలప కుండానే
ఎన్ని మార్పులు చేశారో 
ఒక్క మాట అనకుండా

ప్రార్థన లో నిలబడాలనే ఆలోచన
ప్రతీ ఉపాధ్యాయునిలో ఎలా కలిగించాడు?
ఉపాధ్యాయులు పోటీ పడి విద్యార్థులకు తమ సొంత నిధులతో బహుమతులు ఇచ్చేవారు తన హయాంలో
పార్టీ ఎవరిచ్చినా అది స్టాఫ్ రూం వరకె పరిమితం అవుతుంది అనేక పాఠశాలల్లో
కానీ ఏ పార్టీ జరిగినా విద్యార్థులతో సహా భాగస్వాములను చేయడం తన హయాంలో జరిగింది 
పాఠశాల విద్యార్థులందరికీ , ఉపాధ్యాయులతో పాటు
 ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసేవారు స్వచ్ఛందంగా
కేవలం ఉపాధ్యాయులకే అనే పద్ధతి మారిందప్పుడే
ఈ విషయం అప్పుడు గూడూరు హైస్కూల్ లో నాతో పనిచేసిన అందరికీ విదితమే. 

భాషా దినోత్సవాలక్కడ 
ప్రారంభమైనదే తన హయాంలో
ఎవరి ఉత్తర్వులు లేని రోజుల్లోనూ
 ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు.
ఏదీ తను క్లెయిమ్ చేసుకోలేదు.
తానొక హెడ్ అన్న విషయం తనకు గుర్తుండేదో లేదో అనిపించేది.
ఎవరికి వారు
ఈ పాఠశాలలో నేనే కీలకమైన పాత్ర పోషిస్తున్నానని అనుకునేలా చేయగలిగారు.
హడావుడుండేది కాదు
ఏదీ ఆగేది కాదు
అప్పుడే ఐపోయిందా అని ఆశ్చర్యపడేలా
సాదా సీదా ఆహార్యంతో 
అతి సామాన్యంగా
పాదరక్షలు కూడా తారుమారు గా ధరించి వచ్చిన 
సందర్భం నాకు తెలుసు
 అమాయకంగా కనిపించే తననపార్థం చేసుకున్న సందర్భాలే అధికం
ఏదీ తనకు పట్టింపు లేదు
అజమాయిషీ అనేదే తెలీదు
అదేంటో క్రమశిక్షణకు మారుపేరుగా 
నడిచేదా సంస్థ
ఆర్థిక క్రమశిక్షణ పిసిని తనమనిపించినా బాధపడిందే లేదు
తెలిపే ప్రయత్నం చేయలేదెప్పుడు
తెలుసుకునేలా చేయడం లో విజయం సాధించారు.

చూసి నేర్చుకోగలిగితే తానొక నిఘంటువు.
పాఠశాల ప్రగతి పథంలో సాగిందంటే
ఎవరికి వారు తామే కర్తలమని 
సంతోషం పొందేలా చేయడమే తన విజయ రహస్యం
పని చెప్పకుండానే 
పని జరిగేలా చూసే తనది అమాయకత్వం అనుకున్న వారే ఎక్కువ
పని రాదనుకున్నవారింకా ఎక్కువ....

తన హయాంలో పాఠశాలకు విరాళాలు ఇచ్చేవారు కూడా అనేకంగా ఉండేవారు
తెలుగు టీచర్ ఒకరు ప్రతి సంవత్సరం 
పిల్లలందరికీ నోట్ బుక్స్ ఉచితంగా పంచారంటే అబద్దం కాదు
హిందీ టీచర్ అనుక్షణం పిల్లలను కనిపెట్టుకుని ఉంటూ సంబరాల సంబారాలు జరిపిస్తూ
ఆర్థికంగా అండగా నిలబడే విషయం అందరికీ విదితమే
ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తన ప్రతిభను సంపూర్ణంగా ప్రదర్శించడానికి అవకాశం లభించిందనడంలో సందేహం లేదు
జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ఘనత కూడా అప్పుడే జరిగింది.

అనేక సందర్భాల్లో విరాళాలు ఉపయోగించుకోవడంలో విఫలమయ్యామంటే అతిశయోక్తి కాదు.

కారులో వెళ్ళాలంటే డ్రైవింగ్ తెలియాల్సిన పనిలేదు కదా 
ఎప్పటికీ తనే విజేత 
కాకపోతే ఎదుటి వారావిజయాన్ని క్లైమ్ చేసుకునే 
అవకాశం ఇచ్చే సుగుణం తనది.
అంతిమ విజేత తానేనని తెలుసా తనకింతకీ అనిపించేదొకసారి.
ఓ నవ్వు అంతే
అనుమానంగా చూసినా అసహనంతో చూసినా
కర్తవ్యం దైవమాన్వితం.
ఊరకుండడమే కదామోక్షం అంటాడు రమణ మహర్షి
సన్యసించాలంటే కాషాయం ధరించాల్సిన పనిలేదు
జనంలో ఉంటూ స్వధర్మాచరణ చేస్తూ యోగిగా బ్రతకొచ్చనే విషయం భగవద్గీత తెలుపుతుంది కదా 
జరీగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పనీ
అన్నాడో సినీ కవి.
సమర్థుడైన నాయకుడు
ఫలితాలు సాధించేలా చూస్తాడు తప్ప
ఆర్భాటం హడావుడి ఆవహించనీయడు

నిఖార్సైన నాయకుడు
తెలుసుకున్న వారికి.
అతనే సత్యనారాయణ రెడ్డి
ప్రధానోపాధ్యాయులు గా పనిచేసి గూడూరు నుండి రిటైరైన ఉపాధ్యాయులు
చదవగలిగితే తానో పుస్తకం
చూడగలిగితే అతనొక మార్గదర్శి.
జీవితపు టంచులవరకు చూడగలిగిన మహర్షి.
మల్లయ్య సార్ రిటైరయ్యాక
గూడూరు హైస్కూల్ బాధ్యతలు చేపట్టి
నాయకత్వానికి కొత్త భాష్యం చెప్పిన వ్యక్తి
కక్ష సాధింపు లో లేక
అధికార దర్పం చూపెట్టడమో
 తెలియదతనికి
తననుతప్పుదారి పట్టించాలని చూసిన ప్రయత్నాలను
పసిగట్టడంలో విఫలమవడంతో చిన్న ఇబ్బందులెదుర్కొన్న సందర్భం మినహాయిస్తే ..

చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న పీవీ గారి ఫిలాసఫీ తనది 
గొప్పగా బ్రతకడమంటే 
గొప్పలకు పోవడం కాదని ఆచరణాత్మకంగా చూపిన మనిషి.
ఆర్థికంగా నైనా ఆత్మీయులలో నైనా ఆకాశపు టంచులు చూసిన
శ్రీ సత్యనారాయణ రెడ్డి గారి గురించి మీతో చెప్పాలనిపించింది.
ఈ పుట్టినరోజు సందర్భంగా
నా జీవితంలో ఎదురైన వ్యక్తులనుండి ఈ సారి సత్య నారాయణ రెడ్డి గారిని గుర్తు చేసుకోవానిపించింది.
అందుకే మీతో ఈరోజిలా....
Thank you very much sir 
Love you a lot 
.. Veera gudipally
3
మూడవ వారం.(శ్రీ ch.మల్లయ్య గారు)
ఆరోజు
విషయం ఇంకా గుర్తుంది.
Ofcourse అందుకే ఇలా మీతో చెప్పగలుగుతున్నాను.
నా పేరు ఒక్కసారంటే ఒక్క సారి కూడా సరిగా పలకలేదు తను. 
ప్రేమ లేక కాదు పలకాలని కాదు. ఒకే సమస్య తనకు. 
ప్రాంతీయ స్లాంగ్ నుండి బయటపడలేని బలహీనత అంతే కానీ మరోటి కాదు.
తన గురించి కొన్ని విషయాలు పంచుకోవాలి.
సిద్దిపేట నుండి సరాసరి ప్రమోషన్ పై కొలనుపాక హైస్కూల్ కి వచ్చారు.అప్పటివరకు నేను అక్కడ FAC ప్రధానోపాధ్యాయులు గా పని చేస్తున్నాను.
సెలవు రోజు కావడంతో నేను లేను. తను వచ్చి జాయిన్ ఐ వెళ్లి పోయారు.
మరుసటి రోజు కలిసాము.సాదా సీదా ఆహార్యం.
అమాయకంగా మాట్లాడుతూ
 భోళా మనిషి లా కనిపించారు.
అప్పటికే నారాయణ రావు గారి లాంటి గొప్ప ప్రధానోపాధ్యాయులను చూసిన నేను తన గురించి పెద్దగా ఊహించు కోలేదు కానీ ఎవరిని కూడా తక్కువ అంచనా వేసే తత్వం కాదు నాది.
 
 చారిత్రాత్మక మైన ప్రదేశం.గొప్ప జైన క్షేత్రం.శైవ క్షేత్రం.మహామహులు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి జన్మస్థలం. విరువంటి గోపాల కృష్ణ గారి రచనల్లో ఒదిగిన గ్రామం.
ఆరువందల పైబడిన విద్యార్థులున్న  పెద్ద పాఠశాల. పేరుకు గ్రామమే ఐనా అప్పటికే రెండు ప్రైవేటు హైస్కూల్స్ ఉన్నాయక్కడ. 
 తప్పని సరిగా ఈ పాఠశాల గొప్పదనం నిలబెట్టడంలో నా పాత్ర సమర్థవంతంగా నిర్వహించి తనకు సహాయ సహకారాలు అందించాలని కృత నిశ్చయంతో ఉన్నాను. అప్పటికే సమస్యల సుడిగుండంలో నుండి బయట పడి అద్భుతంగా రన్ అవుతుంది పాఠశాల.
అదేంటో గాని నా కార్యక్రమాలను ఎక్కడ కూడా ఏమాత్రం మార్పు లేకుండా ఆమోదించే వారు.
విద్యా విషయమై నాకు కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉండేవి.వాటిని అమలు పరచడంలో ఎపుడూ వెనుకడుగు వేసింది లేదు.
కానీ నాకు తెలుసు ప్రధానోపాధ్యాయులు సహకరించక పోతే నేను ముందుకు వెళ్ళలేనని. ఎక్కడ కూడా నేను తననుండి నెగెటివ్ స్పందనను ఎదుర్కొన్నది లేదు.
గణిత అవధానం,మెమొరీ ట్రైనింగ్,గణిత ప్రయోగశాల ఏర్పాటు, ప్రాంతీయ గణిత క్లబ్, కంప్యూటర్ లాబ్,  తొలిసారిగా ఏర్పాటు చేసాము మన పాఠశాలలో.
చేతి రాత పై శిక్షణ తరగతులు నిర్వహించాము. సిద్దిపేట నుండి ఎజాజ్ అహ్మద్ గారి సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.
నా చేతి రాత అంత అందంగా ఉండదు అందుకే ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం లో శ్రద్ధ వహించాలని నిర్ణయం తీసుకుని అమలుపరచే వాళ్ళం.  
ప్రధానోపాధ్యాయులు గా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టడంలో శ్రద్ధ తీసుకునే వారు.  
రెండు పర్యాయాలు కన్యాకుమారి వరకు విద్యా విహార యాత్రలు.
అప్పుడు తను ఆలేరు MEO గా FAC బాధ్యత నిర్వహిస్తున్నారు.
ఐనప్పటికీ పదమూడు రోజుల పాటు విహార యాత్రకు అనుమతి ఇవ్వడం సాహసోపేతమైన నిర్ణయం.
అకడమిక్ విషయాలలో ఎంత శ్రద్ధ తీసుకునే వారంటే వారాంతంలో ప్రతీ సబ్జెక్టు విషయం లో,ప్రతీ తరగతి గురించి ఆ వారం ఏం జరిగిందనేది ఎలా తెలుసుకునేదో గాని నాతో చర్చించి జరగాల్సిన దాని గురించి చెప్పేవారు.
ఆయా ఉపాధ్యాయులతో మామూలుగా మాట్లాడుతూ విషయం దృష్టికి తెచ్చేవారు.
సైన్స్ ఉపాధ్యాయు ని విషయం లో జరిగిన సంభాషణ ఇంకా గుర్తుంది.
మాటల్లో పెట్టి సిలబస్ పూర్తి కాని విషయం తనతోనే చెప్పించి  ఏం చేయాలో చెప్పకనే చెప్పి నష్ట నివారణ చేసిన విషయం ఇంకా గుర్తుంది.
అసలు ఈ విషయం గుర్తు కు వచ్చి ఇదంతా రాసుకొచ్చాను కదూ!!!
అప్పుడు తీసుకున్న రెండు సాహసోపేతమైన నిర్ణయాలు తప్పనిసరిగా చెప్పి తీరాలి.
మొదటిది నూతనంగా మంజూరైన భవనం ఎక్కడ నిర్మించాలి అనే విషయమై తాను తీసుకున్న నిర్ణయం ఎందరు వ్యతిరేకించినా చాకచక్యంగా వ్యవహరించి తానను కున్న చోటే నిర్మించిన తీరు
ప్రస్తుతం కొలను పాకలో ఫస్ట్ రైట్ కార్నర్ బిల్డింగ్ అక్కడనే ఉండాలన్న నిర్ణయం తనదే అందుకోసం జరిగిన చర్చోపచర్చలు జిల్లా పరిషద్ వరకు, పోలీస్ స్టేషన్ వరకు వెల్లినా తన నిర్ణయాన్ని సరియైనది నిరూపించుకోగలిగారు.
రెండవది ఇక్కడ పేర్కొన వచ్చునో లేదో కానీ నారాయణ రావు గారు అర్థాంతరంగా ఈ లోకాన్ని వదిలి పోవడం ద్వారా అసంపూర్ణంగా ఉన్న రికార్డులను నిర్వహించడం లో ఎదురైన సవాళ్లు స్వీకరించి నిర్వహించిన తీరు చాలా సాహసొపేతమైనవని చెప్పక తప్పదు.
తొట్రుపాటు అనేది తెలియని సాహసి. MEO గా విధులు నిర్వహిస్తూ నే పాఠశాల బాగోగులు పర్యవేక్షిస్తుండేవారు.
నాకు ఎప్పుడూ ఫోన్ లో రెండవ రింగ్ కే అందుబాటులోకి వచ్చేవారు.

పని చేసే వారికి తానిచ్చే సపోర్ట్ వేరే లెవెల్ లో ఉండేది.తెలుగు ఉపాధ్యాయులు దూడల వెంకటేశ్ (ప్రస్తుతం ఆలేరు హైస్కూల్ లోNCC ఇంచార్జి గా ఉన్నారు) కొలను పాక హైస్కూల్ లో పని చేస్తున్నప్పుడు చాలా చురుకుగా వ్యవహరిస్తూ పాఠశాల లో చేపట్టే కార్యక్రమాల పట్ల అందరికీ ఆసక్తి ఉండేది . తన ప్రతీ కార్యక్రమానికి మోరల్ సపోర్ట్ ఎకనామికల్ సపోర్ట్ ఇస్తూతనను ప్రోత్సాహించడం చూసి కొందరు అసూయపడిన సందర్భాలుండేవి. ఐనా సరే పనిచేసే వారిని ప్రోత్సహించడంలో వెనుకడుగు వేసే వారు కాదు.
ఎవరిని ఎంతలో ఉంచాలో,ఎక్కడ ఉంచాలో తెలిసిన వ్యక్తి శ్రీ మల్లయ్య గారు. 
విధి నిర్వహణలో తన నుండి నేర్చుకోవలసిన దేమంటే ప్రధానంగా సంయమనం.
నాలుగు సంవత్సరాల పాటు తాను కొలనుపాక ప్రధానోపాధ్యాయులు గా ఉన్నారు.2009 లో గూడూరు పాఠశాలకు బదిలీ ఐ వెళ్లి పోయే వరకు.
తనదైన శైలిలో పాఠశాల అభివృద్ధికి పాటు పడినారన్నది నిజం.
వారెవరన్న విషయం చెప్పాలి కదా అతనే మల్లయ్య సార్. విషయం ఏమిటంటే 2009 లో ఇరువురం ఒకేసారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గూడూరు కు బదిలీ పై వెళ్లి పోయాం.తను గూడూరు లో పదవీ విరమణ చేసే వరకు కలిసే పని చేశాం. ప్రస్తుతం సార్ సిద్ధిపేటలో నివసిస్తున్నారు. విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడుపుతున్నారు.

No comments:

Post a Comment