1చెప్పక తప్పదు
2.ఇందిరమ్మ
3.ఆన్లైన్ చదువులు
4.రామసక్కనోడు
5.కారా
6.చెల్లి
7.దేశపతి శ్రీ నివాస్
8.తీపి కబురు
9.దండమూడి
10.మై టీచర్
11.schools reopened
12.ఇంటికొచ్చిన బడి
13.గట్లబాయె
14. ప్రణబ్
15.కాళోజీ
16.దాతృత్వం
17.పొట్లూరి
18.సత్యాగ్రహం
19.క్విట్
20.ఆత్మాభిమానం
21.కోవిడ్
22.కుటుంబం
23.అయిష్టం
24.విశ్వాసుల విజయం
25.జ్ఞాపకాలు
26.మనసు
27.కలవో అలవో
28.బాలూ జాగర్త
29.భగత్ సింగ్
30.వచ్చిపోయింది.
********************--
1
ఇది వీరా గుడిపల్లి కవిత
చెప్పక తప్పదు
04082020
*********************
ఎంతభిమానం
మీకు అర్థం కాదు లెండి
మున్నా సినిమాలో కాకా ఆత్మా లెక్క
వాల్లిద్దరొకటే
ఆ రాతలకు జీవముండదు
చేతలకు అర్థముండదు
అంతే
లోకం శోకంపాలవుతున్నట్లు దొంగ యేడుపు మొదలౌతుంది.
అందరొకసారటు చూసేలా
నీతులు చెప్పడం వృత్తి గా మారింది
యెవరూ పట్టించుకున్నట్లనిపించనపుడు
అదే కదా మార్గం
వాళ్ళిద్దరంతే
2
ఇది వీరా గుడిపల్లి కవిత
05082020
ఇందిరమ్మ
******************
కల్మషమెరుగని మనసు
సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడడం
అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టడం
ఎడారి మొక్కల ఔషధ గుణాలు
తడారిపోతున్న ప్రాణాలకు అందించడం
జీవించే హక్కు ప్రశ్నార్థకంగా మారినపుడు
సంఘజీవిగా జెండా అందుకోవడం
ఎప్పుడూ మరిచిపోలే
తెలుగు పంతులమ్మ లా కనిపిస్తుంది
తెలుగు జాతి వైభవం ఇనుమడింప జేసేందుకు
రామ భక్త శబరిలా కృషి చేస్తుంది.
బిడ్డా అని పిలిచే ఇందిరమ్మ
ఈ కవుల వేదిక అమ్మ
శ్రీనివాసుని ఆలనలో
ఇద్దరు చిరంజీవుల లాలనతో
ప్రశాంత సరోవరం లో
హాయిగా గుండాలని
నీ పుట్టినరోజున దీవిస్తున్నానమ్మా .....
జయహో.... ఇందిరమ్మా
........ వీరా గుడిపల్లి
3
ఇది వీరా గుడిపల్లి కవిత
05082020
ఆన్లైన్ చదువులు
*************************
కాలు కదపకుండా దేశాటనం
ఊహకందని విషయం
మాయా దర్పణం
కాల్పనిక కధా వస్తువు
పాదలేపనాలు
అల్లసాని అల్లిన కధల్లోని కల్పనలు
రెక్కల గుర్రం ఆకాశయానం
గ్రహాంతర వాసం
చుక్కల వనంలో ఆశల విహారం
సాగర జలాల పై కోర్కెల ప్రయాణం
చందమామ నందు కోవడం
కవుల కలాలు ఆడుకునే ఆట ఆనాడు
ఈనాడేది అసాధ్యమైంది గనుక
కలలు గనడం కవుల పని
నిజం చేయండం ........నీపని
ముందడుగేసినోడిని తోసిందెపుడని
వెనక్కి లాగడమే కదా జరిగింది
వెక్కిరించే వాళ్ళు వెనక్కి లాగే వాళ్ళు
మూడడుగులు ముందుకు చూడలేని మూర్ఖత్వం
వాదాల పరదాలు తొలగించుకోలేని
మానసిక సోమరితనం
ఒప్పుకోకున్నా....
ఆన్లైన్ చదువులే అదృశ్య గురువులే.....,............
ఆమోదించక పోతే
అక్కడే ఆగిపోతవు జరిగేదదే.
......... *వీరా గుడిపల్లి*
4
ఇది వీరా గుడిపల్లి కవిత
05082020
రామసక్కనోడు
(అయోధ్య లో గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రామ్ మందిరానికి శంఖుస్థాపన జరిగిన సందర్భంగా)
*******************
అక్కడొకచోట
అపురూపమైన ఘట్టం ఆవిష్కరించబడింది
పదవీలాలస లేనోడు
ప్రాణం బెట్టి చేస్తున్న పని
కార్పోరేట్ ప్రపంచానికి
సనాతన ధర్మానికి జరిగే పోరాటం
కలనైనా ఊహించని
నాయకుడు నడిపించడానికి వచ్చాడు
రామ మందిరం
శతాబ్దాలుగా ఆరకుండా కాపాడుతున్న
వాల్లకు
ధైర్యం చేసి దారి పరచిన తెలుగోడు
అవకాశాలు
వదులుకోకుండా చారిత్రక తప్పిదాలకు
అవకాశం ఇవ్వకుండా
పునాది రాయి వేశాడో మహనీయుడు
న్యాయాన్యాయాలు
తేల్చి చెప్పే తెలివైతే నాకు లేదు కానీ
తెగించి మంటలార్పిన
మహనీయులు వాళ్ళిద్దరన్నది సత్యం
రామమందిరం శాంతి స్థాపనకు నాంది పలికింది
శంభూకుని వారసులకు
న్యాయం జరిగేలా చూసుకుంటే చాలిక.
అతని పై నమ్మకముంది.
రామసక్కనోడు
....... *వీరా గుడిపల్లి*
5
ఇది వీరా గుడిపల్లి కవిత
08082020
కారా
***************
లక్ష్యం తనకంటూ
ఒక లక్ష్యం నిర్ధారించుకుంటే అది కారా
కధానిలయం చేరిన
కధలన్నీ కంచి వైపు చూస్తున్నాయి
దారులన్నీ శ్రీకాకుళం వైపు పరుగెడుతున్నాయి కధల్ని మోసుకుంటూ
ఏడుచాపల వేట ఎంతకూ తెగదేమిటా అనుకున్నా
సాలభంజికల ముచ్చట్లిప్పుడు వినాలన్నా
సామాజిక స్థితిగతులు భద్రంగా కధలై జిజ్ఞాసులకై ఎదురు చూస్తున్నా
కాళీపట్నం రామారావే కన్పిస్తున్నాడు
శ్రీ కాకుళం అంటే కధానిలయం
కధానిలయమంటే కారా మాస్టారు
గుర్తొస్తారు నాకు
కధలంటే జీవితాలు
జీవితాల జాతకాలన్నీ ఒకేచోట వెతుక్కోమంటున్నాయి.
పుట్టింటి ఆనందాన్ని ఆస్వాదించడానికి
తండ్రి దగ్గరకు చేరామంటున్నాయి
ఒక్క సారి వచ్చిపొమ్మంటున్నాయి
శ్రీ కాకుళం.
కథలిప్పుడు తీరిక లేకుండా ఉన్నాయి
కారా గారితో.
...... *ఇది వీరా గుడిపల్లి కవిత*
6
ఇది వీరా గుడిపల్లి కవిత
09082020
చెల్లి
లలితా కృష్ణ వివాహ వార్షికోత్సవం సందర్భంగా
**********************"""
జీవితం స్వర్గ తుల్యమైనపుడా గొప్ప తనాన్ని
ఒకరికొకరాపాదించు కోవడమే ప్రేమంటే
మీలాగ
తమగురించి కాకుండా
ఒకరి గురించొకరు ఆలోచించడమే ఆప్యాయతంటే
మీలాగ
విలువలకు ఉదాహరణలకై వెతుక్కుంటున్నప్పడు ఆ అన్వేషణ మీదగ్గరే ఆగిపోతుంది.
ఇద్దరనిపించని
ఓ ఇద్దరు ఒకటైన రోజిది
మనసంతా సాయిమయమై, మనుషుల్లో మమతానురాగాలు చూడగలిగే నీవు
కలల పంటగా సుశుమ్న
కమనీయమైన కుటుంబ బంధం
వరంగా పొందిన
నీకంటే భాగ్యవంతులుంటారనుకోను
లలితా కృష్ణల వివాహబంధం
ఆస్తికత్వం ,ఆధ్యాత్మికతలు ఒకటైనట్లుంది
పోయిన సంవత్సరం
మేమిద్దరం ,మీ ఇద్దరిని ఆశీర్వదించిన క్షణం ఇంకా గుర్తుంది.
అప్పుడే సంవత్సరం ఐపోయిందా అనిపిస్తుంది.
ఏకఘాత ప్రణాళిక
ఎందుకంత గొప్ప అధ్యాయమంటే యేంచెప్ప గలం????
నిన్ను, కృష్ణను ఉదాహరణగా చూపెట్టడం
చెల్లీ ! అని మనసారా ఆశీర్వదించడం తప్ప
.......
లలితా.... కృష్ణ లకు..
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
....... *వీరా గుడిపల్లి*
7
ఇది వీరా గుడిపల్లి కవిత
10082020
**********************
శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు
*******************
న్యాయ నిర్ణేత గా
మాపై చూపిన ప్రేమతో
కవితా గానం సమూహం పరవశించింది.
ప్రతీ కవిత చదివి
సూచనలందించి
ముందుకు నడిపించే దిశగా
అక్షరాక్షితలు చెల్లి
హూందాగా ధ్వనించి
వెన్నుతట్టి ప్రోత్సహించిన మానసమది
బాలూతో వేదికపంచుకున్న
స్వర సాధన సంగీత కళానిలయ వ్యవస్థాపకుల పలకరింపు
మా హృదయాలను తడిమింది.
సమీక్షలా అవి....
అక్షరాల తో స్నేహించడమెలాగో తెలియజెప్పిన
శ్రీనివాసుడి ఆశీస్సులు.
శీతాకాలపు లేయెండతో నూతనోత్సాహం పొందే బాలల మానసమైంది కవితాగానమంతా
మహాశయా మీకు మేము యేమివ్వగలం
అవకాశం ఉంటే
మరోసారి మాపై ఆశీర్వర్శం కురిపించడానికి
మళ్ళీ రమ్మని ఆహ్వానించడం తప్ప
....... *వీరా గుడిపల్లి*
8.
ఇది వీరా గుడిపల్లి కవిత
19082020
తీపి కబురు
(వాస్తవ కధనం పేర్లు కూడా మార్చలేదు)
కధనాత్మక శైలి లో
**********************
అలా అనడం తప్పే
అంతగా ఆశించడం కూడా
చుట్టూ అనామకులు
అంతా నిరక్షరాస్యులు
తొలి తరమన్న సంగతే మర్చిపోయా
మంకెన చెట్టు నల్లుకుని పారిన బోడకాకర తీగోలె
సండ్ర పొదలో వంగిరగకాసిన గంగరేగి వలె
వాడిలో యేదో విశేషం కనిపించింది
ఆశించిన మేర రాణించాలని
అతిగా స్పందించానా
ఈరోజలా అనాల్సింది లేకుండె
రేపు బడికొస్తాడో లేదో
మనసంతా చికాకై పోయింది
నిద్రెక్కడికో పారిపోయింది.
సూర్యోదయం ఆగదు కదా
నేనలా అనాల్సింది కాకుండె.
మనసంతా ...... దిగులు
బరువుగా పడుతున్న అడుగులు
బడి ముందు
చింత చెట్టు కిందికి చేరానో లేదో
సార్!!!!!
మల్లేశ కొట్టాడు దుర్గా కాంప్లైంట్
ఆ((((((( వాడొచ్చాడా!!!!
యెంత తీపి కబురు
అల్లరి గుర్తుకు రాలే
...... ఇది వీరా గుడిపల్లి కవిత
9
ఇది వీరా గుడిపల్లి కవిత
23082020
దండమూడి శ్రీ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షల కవిత
*ఏంటో ఈ మనిషి*
**********************
యదార్థం పదార్థారాధితమై
ఆలోచనాలంబనమౌతుందని తెలిసీ
సూర్యున్ని క్షితిజ రేఖపై బంధిద్దామంటాడు
మృత్యువు ముందర సమానులందరు
సమాధిలో నే ముగిసేదందరంటూ
కలలను పూద్దామంటాడు
కోర్కె లేని,కోమలమైన మృదు చుంబనాన్ని ఆమె నుదుట అలదావా అంటాడు
స్నిగ్ధ సౌందర్యాలు,ముగ్ధ లావణ్యాలు
శుభ ప్రభాతాలూ, సంధ్యా మాధుర్యాలూ క్షణికమని తెలిసీ
యూకలిప్టస్ ఛాయలో,కవితాక్షరాల మధ్య, సంధ్యా వర్ణాలలో ఏకాంతాశ్రువుల్ని దర్శిస్తాడు.
సజావుగా, సరళంగా, సహజంగా,గుండెనుండి సూటిగా
అసలు ప్రేమించగలమా మనమంటూనే
ఒక్కోసారి లెక్క తప్పుతుందంటాడు.
వాయువుని,ఆయువుని,ఆశ్రయించి
కాలాన్ని ఆక్రమించిన క్షణభంగురమైన జీవితాలంటూనే
తన ఉనికి శాశ్వతమంటాడు
తను చెప్పేవన్నీ అబద్దాలన్న అబద్ధాన్ని నిజం చేస్తూ ఈ జన్మంతా తనను భరించమంటాడు.
గాయాన్ని గేయం చేశాడో
గేయాన్ని గాయపరచాడో
ఓ అక్షరమై ఆనవాళు నొదిలాడు
ఏకాంత సాగరాలు,భాష్ప బిందువులు
ఇసిక గూళ్ళు సిరాలో కలిపి
నేలమాళిగలో నైరూప్య చిత్రాల గుర్తులలా వదిలేసిన ఓ అసంగత గీతమతను
*ఏంటో ఈ మనిషి*
..... వీరా గుడిపల్లి
10
ఇది వీరా గుడిపల్లి కవిత
26082020
My teacher
********************
అఆలు దిద్దించలేదు
అసలెప్ప్పుడూ కలవలేదు
అన్నీ చెప్పాడు
యాబయేళ్ళుగా తెలుసుకోలేని విషయాలు
యాబయ్యారు గంటల్లో
సమాధి నుండి మాట్లాడలేదు
మహిమలేవీ చూపలేదు
నాలాంటి వారుంటారనుకున్నాడేమో
నేనతనికి తెలీదు
అతడంటే నాకేం భ్రమలు లేవు
పనిచెయని క్షణం లేదు
పైసా తీసుకున్న సందర్భం లేదు
నాకెప్పుడూ చదువు చెప్పలే
ఏకలవ్య శిష్యరికం చేయలే
అతనే నా గురువు
నాకు చదువు చెప్పలేదు
నేనతనిని చదివాను.....
జీతాలకు పని చేయలే
జీవితమై నిలిచాడు
He
never answered my questions
He
is only answer for every thing
ఎప్పుడూ కలవకున్నా
ఎప్పటికీ కలవ లేమని తెలిసినా
మౌనమంటే
మాట్లాడకపోవడం కాదన్న
రమణ మహర్షి
He is my teacher
..... *వీరా గుడిపల్లి*
11
ఇది వీరా గుడిపల్లి కవిత
28082020
Schools opened
*******************
దేశమంటే మట్టి కాదోయ్
గురజాడ మా అడుగు జాడ
ఆన్లైన్ లోకంలో
అర్థం మారిందా
బడి పంతులు లాప్ టాప్ లో
పిల్లల జాడలు
Zoom లో
తల్లి దండ్రుల తాపత్రయం
జియో మీట్ యాప్ లో సన్నిహిత సలహాలు
గూగుల్ మీట్ సమావేశంలో అధికారుల ఆదేశాలు
అడివై ఎదిగిన ప్రాంగణాల్లో
శాంతి కుటీరపు మౌనయోగులైన ఉపాధ్యాయుల మనసంతా దేవులాట
అయోమయం ఐతే కావచ్చు
అంతా భ్రాంతై కన్పించొచ్చు
యూ ట్యూబ్ అబద్దం కాదు...
రేపటి పాఠశాలలు తెరుచుకున్నాయి.
మూడో కన్ను కథ గాదని ఋజువై పోయింది
పాఠశాలలు తెరిచారు
పాఠశాలలు తెరుచుకున్నాయి
పిల్లలు తెరలపై
పంతుల్లకు
కనీసం కనిపిస్తున్నారు
Schools opened
...... వీరా గుడిపల్లి
12
ఇది వీరా గుడిపల్లి కవిత
29082020
ఇంటికొచ్చిన బడి
********************
మాయా దర్పణం
మాకు పాఠాలు చెబుతుంది
పాఠశాలకు పోవద్దంటుంది
మాస్టార్లు మా ఇంటి ముందు
మాస్కులతో నిలుచున్నారు
వర్క్ షీట్స్ వారి చేతుల్లో
సందేహాలకే సందేహం వస్తుంది
పాజిటివ్ అంటేనే భయం
అందరికీ నెగెటివ్ రావాలనే కోరిక
నాడు వద్దని చెప్పిన మొబైల్
కొనాల్సిందేనని కోరుతున్నారు
అప్పుడు తప్పన్నారు
ఇప్పుడు తప్పదంటున్నారు
ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికామాటలాడమన్న బద్దెన యాదికొస్తుండు
బడి యాడుంది
నేనేడుంటె అక్కడనే బడి
మిరప చేనుకు ముందు పెడుతుంటే
మెన్సురేషన్ పాఠం వస్తుందని
మొబైల్ లో చూడమని మాథ్స్ టీచర్ ఫోన్
ఇప్పుడు నేనో వీఐపీని
వీరా గుడిపల్లి లెక్కల సార్
విజయా మేడమ్ ఫిజిక్స్
తెలుగు బాలయ్య సార్
హిందీ భాస్కర్ రెడ్డి గారు
ఇంగ్లీష్ వినమని కరుణా మేడం
నేను ఫోన్ ఎత్తేదాక చేస్తూనే ఉంటారు
మా అమ్మ నాయినకు పెద్ద సారు
ఒకటే ఫోన్లు
సదువేందోగని సార్లైతె సాంతం ఫోన్లతోనే
బడికి బోయేది ఇదివరకు
గిప్పుడు
బడి మాయింటికి వచ్చింది
నా సుట్టు దిరుగుతుంది
.......... కాలం
యెప్పుడు ఒక్కతీరుగుంటాది.
చదువుకుంటా... యెంత కష్టమైన సరే
....... వీరా గుడిపల్లి
13
ఇది వీరా గుడిపల్లి కవిత
30082020
గట్లబాయె
****************
గట్లబాయె
పాణంబోతే పోయింది
పాడెనన్న మోద్దామనుకున్నా
ఎంత పావురముంటేంలాభం
ఎంతుంటేం లాభం
కండ్లముందలి పోరగాడు
ఆస్పత్రి నుంచి మళ్ళరాలే
ఆళ్ళే తగలబెడతమన్నరు
మాకసలే ఇయ్యమన్నరు
పోరగాళ్ళేడ్వ బట్టిరి
కట్టుకున్నదాని గోస కండ్ల గనబడుతుంది.
గా ఒక్క రోజు దావత్ల దినకబోతేమైతుండె
పాజిటివ్ పాలబడె.
యెవళేమనుకుంటరు?
అనుకుంటరనుకున్నోళ్ళెవరన్న ...
ఆన్తోని బోయిండ్రా
ప్రాణం బోతె బాయె
పాడె మోద్దామనుకున్న , ఆడంటె అంత ప్రేమ
దావత్లకు ,వద్దంటే పిలిచే టోళ్ళకు పాణమంటె భయం లేకుండొచ్చునా
ఫ్యామిలీ పై ప్రేమ లేకుండొచ్చునా
...... వీరా గుడిపల్లి
14
ఇది వీరా గుడిపల్లి కవిత
01092020
ప్రణబ్
****************----
రాయాలని కాదు గానీ
రాయకపోతే తప్పైపోతుంది
పన్నేండేళ్ళముందు కళ్ళు తెరిచి
డెబ్బై మూడేళ్ల తరువాత ముగిసిన
నీఎనబయ్యైదేళ్ళ ప్రస్థానం
ముగిసిందనుకోను.
యాంటీ బయోటిక్స్ లా పనిచేసి
కమ్యూనిటీలో ఇమ్యూనిటీ పెంచి
యాంటీ బాడీస్ డెవలప్ చేసిన
నీ పనితనం
యెవరెలా గుర్తుంచుకుంటారోగాని
ప్రధానిగా ఒకరు, రాష్ట్ర పతిగా ఒకరు
నూతన వెలుగులకు కేంద్రమైంది వాస్తవం
కుడియెడమై ఫలితాలు పొందారన్నది
జనం టాక్
ఐతేనేం....... సాధించారు.
ఏదీ ఎవరి సొంతం కాదని నిరూపించారు
భారత రత్నమా!!!!! జోహార్
..........వీరా గుడిపల్లి
15
ఇది వీరా గుడిపల్లి కవిత
06092020
మన కాళోజీ
********************
కరువుకు చిరునామాగా మారి
చిలుకలు వాలనిచోటు
ఓ ఇంజనీరు పుణ్యమా అని కలకలలాడింది.
ఆంగ్లేయుడైతేనేం
అతను కలగన్నది హరితలోకం
మిగులు లెక్కల్తో మేల్కొని
రంగులద్దుకుని
కప్పుకున్న నాగరికపు కంబళ్ళు
అమాయకత్వం
ఆత్మీయ బంధాలకు నెలవై
మనసున్న మనుషులున్న నేలపై
కన్నేసి
కాజేశి,కబళిస్తున్న వేళ
వంచనకు గురైన వనరులు
దోపిడి పాలైన భాష
అన్నీ కోల్పోతున్నా అసలేమెరుగక
కావాటాలు
బ్లాకైపోయిన గుండెలు
కాలేకడుపుల గొడవంతా
తన గొడవని ...
పని పట్టాల్సి వస్తే
పరాయి వాడైనా,పాలివాడైనా
అంతా ఒకటని చాటి
అన్యాయాన్నెదిరించినోడే
నాకు ఆత్మీయుడంటూ
అక్షరాలను మీటిన మానవీయ కోణం
మా కాళోజీ
....... *వీరా గుడిపల్లి*
16
ఇది వీరా గుడిపల్లి కవిత
09092020
దాతృత్వం
******************
తనకవసరం లేదనే కదా
ఆక్సిజన్ మనకిస్తుంది చెట్టు
ఎవడడిగాడని
చందనం పరిమళం పంచుతుంది
నా గొడవంటూ
గోల చేయమని ప్రజలడిగారా కాళోజీని
పాటతో పోరాటం నేర్పమని
గద్దర్ నెవరడిగారు
ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణం యేంటని
అభినయ్ నెవరడిగారు
నానీల చిరునామా
గోపీ నడిగారా యెవరైనా
ఉమర్ ఖయ్యాం పానశాల చిరునామా
శ్రీ శ్రీ కవిత్వం
శేషేంద్ర మానిఫెస్టో
ముప్పాళ్ళ రామాయణం
చలం మైదానం
ఠాగూర్ గీతాంజలి
యెవరడిగారని ఇచ్చారు వీళ్ళంతా??
శిబినే గుర్తు పెట్టుకుంటారేం
లోతుల్లో కెల్దాం
దాతృత్వం అంటే ....
గొప్ప కోసం చేసేది కాదు
తెలియకుండా చేసేది
తెగించి చేసేది
మంచి మాటకూడా.....
..... *వీరా గుడిపల్లి*
17
ఇది వీరా గుడిపల్లి కవిత
11092020
పొట్లూరి హరి కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా
****************
ఆ(((
నాకు తెలుసు అనని వారున్నారా
చాలా క్లోజ్ అని చెప్పని వారున్నారా
ఒక్క సారి కలిసినా, మాట్లాడినా చాలిక
It would be registered permanently in the mind of him
అనంతపురంలో కలిసింది మొదలు
ఇప్పటి వరకు ఆ రిజిస్ట్రేషన్ expire కాలేదు
అయ్యే అవకాశం కూడా లేదు
విశేషణాల కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు
యే విశేషణాలు తూచలేవతనిని
ఉపమానాల కందడు
ఉత్ప్రేక్షలలో ఇమడడు
అతిశయోక్తుల నొప్పడు
కనెక్టివిటీ అన్ లిమిటెడ్
కాంటాక్ట్ నెవర్ closed
Its a rare character
మరో కాపీ లభించదు
Virtual meeting ఐనా సరే ఆసాంతం తానై
కనిపించని ఇరుసు గా కనిపెట్టుకునుండే మన మనసతను,
భాషాభిమానం మానం నాకు కద్దని వట్టి మాటలు చెప్పలేదు
ఖండాంతరాలు దాటిన శ్రమే అందుకు సాక్షి
రక్షణ వేదిక వేసి రక్షా కవచం చుట్టి
తెలుగు పూలతోటకు మాలిగా నిలబడ్డాడు
రాహుల్,చందర్ లాంటి వారల్లుకుపోవడానికి పందిరి గుంజ మాదిరిగా పాతుకుపోయిన నమ్మకమై కనబడతాడు
భాషాభిమానులకతనో దీపస్థంబం
భాషామతల్లికి మొదటి వరుస భక్తుడు
పొట్లూరి...అంటేనే
పొటమరించే నమ్మకం
పోటెత్తిన ఆవేశం
వెరసి యబైయ్యారక్షరాలలో తనో అక్షరం
........ *వీరా గుడిపల్లి*
18
ఇది వీరా గుడిపల్లి కవిత
12092020
సత్యాగ్రహం
**********************
ప్రకృతి ధర్మానికి విఘ్నం కలిగినపుడు
అవాక్కయ్యేలా ,న్యాయమైన ఆగ్రహం
అవసరం లేకున్నా
జిల్లేడాకు తెంపితే కంట్లో పడిన పాలచుక్క
కన్నూమిన్ను కాదనకుండా నడిచేటప్పుడు
తాకుర్రాయి తగిలినట్లు
ఉప్పు పైన పన్ను వేస్తే
మతకలహాలు సృష్టిస్తే
రాయబారాలు విఫలమైతే
పగవాడి పరాభవం కోరకుండా
ధర్మాగ్రహం కనబరచడం
తప్పనలేమది సత్యాగ్రహం.
హేరాం అన్నాడా లేదా అని కాదు
ధర్మాచరణ చూద్దాం
సత్యశోధన చేద్దాం
సత్కర్మలాచరిద్దాం
కళ్ళెర్రబడితే, కాలరెగరాయాల్సి వస్తే
సత్యాగ్రహం పాటిద్దాం.
నడిచింది గాంధీ యుగం
గెలిచింది గాంధీ మార్గం
ఆయుధం పట్టడం తప్పెప్పుడూ కాదు
ఆయుధం సత్యాగ్రహమవ్వాలి
...... *వీరా గుడిపల్లి*
19
ఇది వీరా గుడిపల్లి కవిత
12092020
క్విట్
***************
వంద సంవత్సరాలు
వంగొంగి సలాం చేశాం
వ్యాపార మంటే నమ్మి
వంచనకు గురయ్యాం
ఝాన్సీ,సైరా, ప్రతాప్, అల్లూరి
మడమ తిప్పని పోరాటాలు
ప్రాంతాలకే పరిమితమైనా
ఆశలు నాటి ఆంకాక్షలను చిగురిపజేశారు
సిపాయిల తిరుగుబాటు
చిదిమేయ బడినా
తుపాకి లేకుండా, రుమాలు వదలకుండా
హింసకు తావివ్వకుండా
దేశమొదిలి పొమ్మని నినదించే ధైర్యం
గుండెల్లో కొలువైన బోసినవ్వుల తాత
పలికించిన నినాదం
క్విట్ ఇండియా
..... *ఇది వీరా గుడిపల్లి కవిత*
20
ఇది వీరా గుడిపల్లి కవిత
15092020
ఆత్మాభిమానం
****************
జుట్టుకు రంగేసుకుంటూ
మొహానికి నవ్వు పులుముకుంటూ
పలకలేని నిజాలను
పంటిబిగువున వత్తి పట్టి
నడకొకరి తీరు
నడతొకరి తీరు
నాదంటూ యేముందసలు
ఆత్మాభిమానమంటే
నీవు నీలా ఉండడమే
అమ్మ కోసం మెడిసిన్
నాన్న కోసం సివిల్స్
యేం చదవాలో తేల్చుకోలేక
నచ్చిన కోర్సు వదులుకున్నాక
దోస్త్ కోసం నచ్చని సినిమా చూసానా
ఇంకేముంది
ఆత్మాభిమానమంటే
తనకేమిష్టమో నని
అదే తినడం
పక్కింటోళ్ళు కొన్న వెంచర్ లోనే ప్లాటు కొనడం
కొలీగ్ కొడుకు
యూ యస్ వెళ్ళాడని కొడుకు ను యూయస్ పంపించడం
యేముందసలు
ఆత్మాభిమానమంటే
మనమొకరితో పోల్చుకోవడం కాదు
మన బతుకు మనచేతిలో ఉండడం
మనల్ని మనమే శాసించుకోవడం
తెల్లోడి ప్రభావాన్ని దాటలేని
తెల్లబోయిన మానసిక స్థితిని
తట్టి లేపి
స్వదేశీ మీటను మీటితేగదా
ఆత్మాభిమానమంటే తెలిసింది.
నీవు నీలా ఉండడమే ఆత్మాభిమానం
నిన్ను నీవు ఏలుకోవడమే
ఆత్మాభిమానం
..... *వీరా గుడిపల్లి*
21
ఇది వీరా గుడిపల్లి కవిత
15092020
కోవిడ్
********************
అవునలాగే మరి
కాదనడానికేముంది??
కనిపించని వ్యవహారాలు కానరాని కారణాలు
కాలరీల కొలతలు
సమతుల్యత లోపిస్తే
కరోనా కనిపెట్టి దాడిచేసేస్తుంది.
ముసుగేసుకున్న భ్రాంతికి
యెన్ని పేర్లోమరి
ప్రశాంత చిత్తం ఫలితాలను సాధిస్తుంది
కనిపించని వైరస్
కానరాని భయాలు
కలిమిని మింగే శబలాలు
కాటేశాక కూడా తెలీని నైపుణ్యం
కబలిస్తున్నా యేమీ చేయలేని దైన్యం
కరోనా వరమనే చెప్పాలి
కావాలి గాయలేని దైన్యం
కట్టడి చేయలేని అసహనం
రాకపోకలెరుగలేని అచేతనత్వం
ప్రతిక్షణం ప్రమత్తులై ఉండాలనే ఉద్భోద
ఆచరణలో పెట్టగలిగితే అలా
లేకుంటే యేమౌతుందో తెలీదిలా
కొత్త పాఠాలు నేర్పుతూ కోవిడ్
22
ఇది వీరా గుడిపల్లి కవిత
16092020
కుటుంబం
****************
అలా వచ్చి పడ్డానా
అమ్మ
క్షణం వదలకుండా కనిపెట్టుకుంది
చిరాకు పడినా,చీదరించుకున్నా
చిరునవ్వుతో నన్నంటిపెట్టుకునే ఉంటుంది.
యేమాశించిచేసింది
నాన్న
అడిగిందల్లా కాదనకుండా
అడగలేనిదతడే తెలుసుకుని
అవసరాలు తీర్చడానికి తనతో తానే పోటీ పడుతున్నాడు రోజూ
ఏంలాభం తనకి
చెల్లి
అమ్మ చిన్నప్పుడెలా ఉండేదోననే
సందేహానికి సమాధానం తను
నన్ను శాసించేది, నాకోసం దన్నుగా నిలబడేది
తనేం కోరుకుంటుంది?
నవ్వుతూ పలకరిస్తే చాలనుకుంటుంది
తమ్ముడు
నా పై ఈగ వాలినా సహించగలడా
తోడై సాగి ఒక్కడిగా నిలబడ్డామా
నాన్న కళ్ళలో ధైర్యం కనిపించేది
అది అర్ధం కాని కనెక్షన్
పేగు బంధమొ?
ప్రేమ పాశమో?
పేర్లేమైనా???
కుటుంబమంటే
ఇక్కన్నుండే ఎక్కడికైనా
ఎక్కడి నుండైనా ఇక్కడికే
అంటుగొమ్మలుగా విడిపోనంతవరకు
........ *వీరా గుడిపల్లి*
23
ఇది వీరా గుడిపల్లి కవిత
17092020
*******************
అక్షరాలనొలక బోసి
అందమైన కావ్యాలని చెప్పించి
ప్రశంసా పత్రాలతో పైకప్పు వేసుకున్నాడు
ఇప్పుడు చెప్పేవన్నీ నీతులే
రాతలన్నీ ......
అభినందన పత్రాలంటే
అవార్డు లంటే
అయిష్టతెందుకో గానీ
24
ఇది వీరా గుడిపల్లి కవిత
22092020
విశ్వాసుల విజయం
************************
ప్రజాతంత్ర విధానాలు ప్రకాశించిన విశ్వాసం
ప్రజాస్వామ్య భావాలుగా పాదుకొన్న ప్రతీకలు
పవిత్ర గ్రంథం ప్రాతిపదికగా పాలించే కర్తవ్యం పొంది
ధార్మిక పాలనకు దారులు వేసిన వారసత్వం
అల్ ఘజాలీ అన్నట్లు
ధర్మబద్ధమైన అధికారం చలాయించేవరం
ధార్మిక పాండిత్యానికి దాసోహమనే చైతన్యం
న్యాయ విధులు,ధర్మాలను స్త్రీల పక్షపాతిగా చెలాయిస్తూ
సురాజ్యం, స్వరాజ్యం, నడుస్తున్న వేల
స్వయం ప్రకటిత ఖలీఫాలను పట్టించుకోని లోకం
విదేశీ అధికారం తమ విశ్వాసాలపై దాడి చేసి నమ్మకాన్ని రద్దు చేస్తే
కళ్ళెర్ర జేసిన సందర్భం ఖిలాఫత్ ఉద్యమం.
మతవిశ్వాసాలను మంటగలపాలనిజూసిన
రవి అస్తమించని సామ్రాజ్యం
ప్రజాగ్రహానికి భీతిల్లక తప్పలేదు.
ఆంగ్లేయుల కుతంత్రాలకు బలై
నిషేధింఛబడిన ఓ విశ్వాసం పట్ల
విశ్వాసం ప్రకటించిన ఓ నిరసనోద్యమం
స్వాతంత్ర్య కాంక్షకు ఊపిరులూదిన
ఖిలాఫత్ ఉద్యమం
నమ్మకాలనపహాస్యం చేస్తే అంతేమరి
...... *ఇది వీరా గుడిపల్లి కవిత*
25
ఇది వీరా గుడిపల్లి కవిత
22092020
జ్ఞాపకాలు (8 వ దశకం )
బాల్యం
***********
ఒక్క మాట తో
ఒక్క ముచ్చటతో
ఒక్క కవితతో ఒడిశే ముచ్చట కాదు
యాదికొచ్చిన చిన్న సంగతొక్కటి చెప్తా .. సరేనా
***"
ఖాళీ క్వార్టర్ బాటిల్ లో గ్యాస్ నూనె నింపి
మూత కొక్క పొక్క జేసి గుడ్డపేల్కె వత్తి జేసి
అంటుబెట్టినంక
సుట్టగూసోని .... సదివేటోళ్ళం
ఎక్కదీపం వచ్చినాక ,ఎంతబాగుండేదో ?
రోజూ మాపడ్జాము, గుడ్డతోని తూడ్శినంక
సుద్దతోని రాశి కడ్గి, ఆరబెట్టి
పొద్దుగూకినంక.. ముట్టిచ్చేది
నక్రేకల్ అంగట్లో కందిని దెచ్చినపుడు
మస్తు ఎలుగొచ్చేది.
గ్యాస్ నూనె ఎక్కువ తాగుద్దని
అప్పుడప్పుడెలిగించేది.
పండగ పబ్బాలప్పుడు, పెండ్లీలకు
రామనర్సయ్యింటికాడ
పెట్రోమాక్స్ .. లైటు దెచ్చి
బుగ్గసంచి బిగ్గెరగట్టి, బుస్స బుస్స గాలిగొడ్తె
భాగ్గు మనేది.
దేవుని షావను దీస్తే.. దీటీలను జేసెటోల్లు
నూనెగుప్పినప్పుడల్ల.. ఎగిరిపడేమంటవల్ల
దారంతా గనపడేది
ఇంటింటికి కుంపటుండి
నిప్పడుగుట నిప్పిచ్చుట.. ఘనాపాటి కార్యమపుడు
జకమొకసంచులు నడుముకు చుట్టకోని తిర్గేది
సుట్టగాల్సుకోనీకి సుతారంగ దీసేది
ఎన్ని.. జ్ఞాపకాలో... సంధికాలపు బతుకుల్లో
ఒడువని ముచ్చట నా బాల్యం
..... *ఇది వీరా గుడిపల్లి కవిత*
26.
ఇది వీరా గుడిపల్లి కవిత
23092020
మ న సు
*********
కనపడదు, వినపడదు
లేదనలేం కాదనలేం
మనిషి ,మనసు వేరనలేం
లక్షణం లాక్షణికం
వేదం, వాదం
మిధ్యా భావనల భ్రమల్లో మధ్య తరగతి
అనవసరమైన దేదైనా
శస్త్ర చికిత్స తో కోసేయక
కధలు జెప్పి కాలమెల్లదీస్తూ దారప్పోగుల రక్షణలో
దౌర్జన్యాల సహవాసం చేసే సాత్విక మహర్షుల పురాణాల సృష్టి
మనసై విహరిస్తూ మనుషుల్ని మసిచేస్తుంది.
మానవత్వం మాటల్లో చూపిస్తూ
తోటి వారిని తొక్కి పెడుతుంది
మనసు... మనిషి వేరైతే ఐపీఎల్
మనసూ మనిషి ఒకటైతే వన్డే
యేదైనా సరే
దాచుకున్న దారప్పోగు
పరిమళించే హృదయాలకు సంకెళ్లు తగిలిస్తే
మనసొక మోసపు తెర
మనిషొక మౌనభ్రమ
కష్టజీవుల భుజం కమిలినా కుమిలినా
సినిమాగా డబ్బులు రాల్చే మార్గం గా ఉన్నోడికే ఊడిగం
...... వీరా గుడిపల్లి
27
ఇది వీరా గుడిపల్లి కవిత
25092020
కలవో అలవో
***********************
కలవో అలవో వలవో
యెవరివో నీవెవరివో
మనసంతా ముసిరిన వాడా
మనువంటే యొప్పనివాడా
యెలా కమ్ముకున్నావో
యెందుకు నను కలిశావో
నా దారి నాదే నంటూ
నీ దారిలో
సూదంటు రాయిని నాటిన వాడా
యెవరివోయి నీవూ...
కలవో అలవో వలవో..
యెవరివో నీవెవరివో
పచ్చనాకు నచ్చిందంటే
పరవశించడం సహజమనీ
పచ్చనాకు గా మారాలనుకుంటే
పరమ మూర్ఖుడవవుతావనీ
చెప్పిన మాటల
భావం మాకూ...తెలిసే లోపే ...
తెరమరుగైనా తెరువరీ.. నీవెవరూ
కలవో అలవో వలవో
యెవరివో నీవెవరివో...
నన్ను నన్ను గా ప్రేమించీ
తనను తానుగా భావించీ
తన్మయమొందే తనువొకటుండదనీ
తెలియజెప్పిన నేస్తమా...
యెవరు సుమా నీవు
కలవో అలవో వలవో
యెవరివో నీవెవరివో...
ఆకర్షణలను వలగా విసిరే
కృత్రిమ ప్రేమకు ప్రాణం పోసే
కల్తీ జీవుల రక్త సమూహం
కబళిస్తున్నా తెలియగలలేని
అమాయకత్వం ఆగం కాగా
అమ్మానాన్నలు బలియౌతారని
నిజం తెలిపిన మిత్రమా
నిలువుమా...నను నిలుపుమా.....
నేస్తమా....
కలవో ...వలవో.. యెవరివో....
.............. *వీరా గుడిపల్లి*
28
ఇది వీరా గుడిపల్లి కవిత
25092020
బాలూ జాగర్త
*******************
ఈరోజు ఎందుకో
నిద్దర్రావడం లేదు
నీవెల్లి పోయావని కాదు
నీవూ వెళ్లి పోయావని
పాటలదేముంది
జీవితమంతా విన్నా తరగని పాటలు పాడావు
ఇంకేమైనా ఉంటే
యెవరైనా పాడతారు గాని
చేయని స్తుతి లేదు
మోయని దైవం లేడు
యెవరాపలేక పోయారు
పదహారు భాషల్లో పాడినా
అర్థం కాలేదు పట్కపోయినోనికి
పల్లెత్తు మాటెవరిననకుండా సాగినా
వెళ్ళక తప్పలేదు
అక్కడేం చేయాలో
పాటలే పాడాలంటే పరేశానేం లేదు
తిరిగొచ్చినోడు లేడు కదా
మేమొస్తే కనిపిస్తావూ కదూ!!!
బాలూ.....
తప్పని దాని గురించి తన్కులాటెందుకని
అన్పిస్తుంది గాని
నిద్రైతే పడ్తలేదు
నీ పాటే దిక్కు ... నీవు లేకపోయినా
మంచోడివి
యాడికి బోయినా బాగుంటావులే
బాలూ జాగర్త
...., *వీరా గుడిపల్లి*
29.
ఇది వీరా గుడిపల్లి కవిత
28092020
భగత్ సింగ్
****************************
నేనెందుకు నాస్తికుడి నయ్యాను
నాస్తికత్వాన్ని ఆలింగనం చేసుకోవడం
కాదు ఆవాహనం చేసుకోవడం
యెందుకో.....
అక్షరీకరించిన సందర్భాల్లో
జలియన్వాలాబాగ్ మట్టిని భద్రపర్చుకున్న భావోద్వేగం
పంటలు విలువ తెలిసి
పసితనంలో తుపాకి వనం పెంచాలన్న ఆవేశం
పగవాడిపై బాంబు వేసి
పారిపోకుండా పగతురకు చెమటలు పట్టించిన వైనం
ఉరికొయ్యను ప్రేమించి భరతమాతసేవకంకితమైన జననం
కడదాకా నమ్మిన సిద్ధాంతం వదలని భారతమ్మ ముద్దు బిడ్డ
భగత్ సింగ్ మా ఆవేశం
భగత్ సింగ్ మా స్వాభిమానం
భగత్ సింగ్ మా భావోద్వేగం
భగత్ సింగ్ పాదాలు ముద్దాడిన ఈనేల నా నాకు స్వర్గసీమ
భగత్ సింగ్.... అంటే ప్రతీ భారతీయుని ఆత్మ
...... వీరా గుడిపల్లి
30
ఇది వీరా గుడిపల్లి కవిత
29092020
వచ్చిపోయింది
*********************
అనుకోలేదుమరి
వచ్చిపోయింది, పలకరించి పోయింది
నమ్మలేదసలు
ఆరోజు స్ట్రీట్ నెంబర్ త్రీ పైనే ఓ జల్లు పడింది.
తెల్లారి తెరిపి నిచ్చింది.తెలిసిందపుడే తానొచ్చిందని
ఎటూ వెల్లకుండా తనకూడా గడపాలనుకున్నా.
క్షణం విడవకుండా గడప దాటకుండా
.........
మర్యాదకు మాటరానివ్వలేదు, తనకేం లోటు రానివ్వలేదు
పోషక విలువలు కలిగిన ఆహారం
పోషణకై
బిగ్ బాస్కెట్ ఇంటికొచ్చి ఇచ్చిపోయింది
పండ్లు, కూరగాయలు
కోడిగుడ్లు, మొలకలు, చికెన్ మటన్
అన్నీ క్రమం తప్పకుండా వడ్డించా
ప్రతీ ఉదయం యోగా
తనకోసం పడని శ్రమలేదు
ఐనా నన్ను ప్రేమించలేదు,నాతో ఉండిపోవాలనుకోలేదు
వెళ్లి పోయింది. ఉన్నన్నాల్లు కనిపించలేదు
కనీసం ఓ తుమ్మన్నా రాలే
కాకన్నా అరవలే తాను వస్తున్నట్టు
సుజాత కన్ఫర్మ్ చేస్తే నమ్మాను గానీ
నాకింకా అనిపించడంలే తాను వచ్చి వెళ్లినట్లు
అమితాబ్ ను పలకరించిందంటే అవునా అనుకున్నా
యస్పీ బాలు ను యేకంగా వెంటబెట్టుకొని వెల్లిందంటే వెక్కివెక్కి ఏడ్చా
ఊరంతా పాకిందంటే ... భయపడ్డా
నా ఒంట్లో దూరి నాకు తెల్వకుండా పదిరోజులుండి పోయిందంటే
ఇంకా నమ్మలేక పోతున్నా.
అదేంటో గాని
తానున్నన్ని రోజులు
ఆకాశం యేదో సమయం లో కాసేపు కన్నీరు కార్చేది
తానుందనో,యేమో
వెళ్లి పోయాక ఇప్పటిక వరకు ఒక్కసారి కూడా పలకరించలే
నేనంటే ఇష్టమా తనంటేనా తేల్చుకోలేకున్నా
ప్రపంచ మంతా భయపడి,
మాస్క్ తో మూస్కొంటూ, శానిటైజర్ పూసుకుంటూ
గడప దాటకుండా తలుపులేసుకుంటున్నా
తనను రానివ్వకుండా చూసుకుంటున్నా
లక్షల మందిని పలకరించింది.
వేలమందిని వెంటేసుక పోయింది.
లాక్ డౌన్ పరిచయం చేసి, పోరగాళ్ళకు ఆరునెలలు సెలవులిచ్చి
కనిపించకుండా విశ్వరూపం చూపిస్తున్న తను
పలకరించి పోయిందా నన్ను
వావ్.... అనుకోనా.. వామ్మో అనుకోనా
యేదేమైనా... తనైతే వచ్చిపోయిందట
Certified మరీ ....
బీ పాజిటివ్ బ్లడ్ నాది కానీ
కోవిడ్ టెస్ట్ రిజల్ట్ మాత్రం నెగిటివ్
......... *వీరా గుడిపల్లి*